ఏం..తమాషా చేస్తున్నారా..!
అనంతపురం రూరల్ : ‘ఏం..తమాషా చేస్తున్నారా.. సిలిండర్లలో గ్యాస్ నింపడం ఇలాగేనా.. ఇంత తక్కువగా నింపితే ఎలా..? ప్రజలు అమాయాకుల్లా కన్పిస్తున్నారా మీకు’ అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల వద్ద గల హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) గ్యాస్ రీ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రీ ఫిల్లింగ్‌స్టేషన్‌ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొమెస్టిక్ (గృహావసరాలకు) సిలిండర్‌లో 200 గ్రాములు, కమర్షియల్ (వాణిజ్య అవసరాలకు) సిలిండర్లలో 4 కిలోల మేర గ్యాస్ తక్కువగా నింపుతుండటం గమనించారు. సిలిండర్‌పై సీలు సరిగా లేకపోవడం, గడువు తేదీ ముద్రణ అస్తవ్యస్తంగా ఉండటం గుర్తించారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆగ్రహించిన మంత్రి తమాషాలు చేస్తున్నారా.. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఇష్టానుసారంగా గ్యాస్ సిలిండర్లను నింపి విక్రయిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
అనంతరం హెచ్‌పీసీఎల్ ఆర్‌ఎంఓ ఎక్కడంటూ ప్రశ్నించగా ఆయన క్యాంపు వెళ్లారని సిబ్బంది చెప్పారు. ఇక్కడి లోపాలపై అక్కడే ఉన్న సివిల్ సప్లై జిల్లా మేనేజర్ వెంకటేశం, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, తూనికలు, కొలతల ఇన్స్‌స్పెక్టర్ దయాకర్‌రెడ్డిలతో మంత్రి రికార్డు చేయించారు. అనంతపురం మంత్రి మాట్లాడుతూ సిలిండర్లలో తక్కువ గ్యాస్ నింపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సమక్షంలోనే అధికారులు హెచ్‌పీసీఎల్ ఫిల్లింగ్‌స్టేషన్‌ను సీజ్ చేశారు.