
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. సెలవు రోజున సరదాగా పిల్లలను తీసుకుని జూపార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ జేబు బరువు పెరగాల్సిందే. ఎందుకంటే జూపార్కు ఎంట్రీ టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పెద్దల టికెట్ రేటు రూ. 30, పిల్లలకు 5 రూపాయలు పెంచారు.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) ఎంట్రీ టికెట్ రేట్లను పెంచారు. జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెద్దలకు టికెట్ ధర రూ.100, చిన్నారులకు రూ.50కి పెంచారు. ఈ రేట్లు సందర్శకులకు మార్చి 1వ తేదీ (శనివారం) నుంచి అమలులోకి వస్తాయని జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు సాధారణ రోజుల్లో ఒకలా.. శని, ఆదివారాలతో పాటు సెలవురోజుల్లో మరోలా టికెట్ రేట్లు ఉండేవి. ఇక నుంచి అన్నిరోజుల్లోనూ ఒకటే ధరలు ఉంటాయని జూ క్యూరేటర్ వెల్లడించారు. ఎంట్రీ టికెట్ రేట్లతో పాటు కెమెరా, బ్యాటరీ వెహికల్, టాయ్‌ట్రైన్, సఫారీ పార్కు డ్రైవ్ రేట్లు కూడా పెంచినట్టు తెలిపారు.
చదవండి: రైలు టికెట్ ఇలా కొంటే క్యాష్‌బ్యాక్..
ప్రస్తుతం సాధారణ రోజుల్లో పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ.45 ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో పెద్దలకు రూ. 80, పిల్లలకు రూ.55 తీసుకుంటున్నారు. మార్చి 1 నుంచి అన్నిరోజుల్లోనూ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 వసూలు చేస్తారు. ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. పూర్తి వివరాలకు nzptsfd.telangana.gov.in/home.do వెబ్‌సైట్ చూడొచ్చు.
ఉమెన్స్ డే రోజు ‘రన్ ఫర్ యాక్షన్–2025’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 8న హైదరాబాద్ నగర షీ–టీమ్స్ ‘రన్ ఫర్ యాక్షన్–2025’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. పీవీ నర్సింహారావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగే ఈ 5కే, 2కే పరుగుకు సంబంధించిన పోస్టర్‌ను కొత్వాల్ సీవీ ఆనంద్ మంగళవారం ఆవిష్కరించారు. వీటిలో పాల్గొనాలని భావించే వారు ( rfa.bebetter.run) వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్య తెలిపారు. ‘మహిళల భద్రతకు అవసరమైన చర్యలు వేగవంతం చేయండి’అనే థీమ్‌తో ఈ రన్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment