Nehru zoo park
-
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
HYD: జూపార్క్‌లో ఏనుగు దాడి.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రు జూపార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూపార్క్‌లోని ఓ ఏనుగు దాడిలో దాని కేర్ టేకర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నెహ్రు జూపార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కాగా, ఏనుగు దాడిలో కేర్ టేకర్ షెహబాజ్ మృతిచెందాడు. ఏనుగు దాడి అనంతరం, షెహబాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో... -
జూపార్క్ లోకి భారీ వరద నీరు (ఫొటోలు)
-
జూపార్కును సందర్శించిన మెగా బ్రదర్ నాగబాబు
నెహ్రూ జూలాజికల్ పార్కును సినీ నటుడు నాగబాబు మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. జూపార్కులోని ఆయా వన్యప్రాణుల ఎన్క్లోజర్ను సందర్శించి వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జూపార్కు సందర్శన ఎంతో అనుభూతిని అందిస్తుందన్నారు. జూ నిర్వాహణ, వన్యప్రాణుల సంరక్షణ, క్లీన్ అండ్ గ్రీన్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని జూ మేనేజ్మెంట్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక జత సెనెగల్ రామచిలుకలను కొనుగోలు చేయాలంటూ రూ.35 వేల చెక్కును తన సోదరి విజయ తరఫున జూపార్కు క్యూరేటర్ వి.వి.ఎల్.సుభద్రాదేవికి అందజేశారు. -
గుండెపోటుతో ‘కదంబ’ మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (11) గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ప్రాథమిక నివేదికల ప్రకారం గుండె పనితీరు ఫెయిలవడం, రక్తం గడ్డ కట్టడం మృతికి కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ ఫ్యాథలాజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్, వీబీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్, వీబీఆర్ఐ వైద్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, అత్తాపూర్ సీసీఎంబీ ల్యాంకోన్స్ సీనియర్ ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త సదానంద్ సోన్‌టాకే, జూపార్కు వెటర్నరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్, జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందుకు సంబందించిన నమునాలను రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ, ల్యాంకోన్స్ సీసీఎంబీ, వీబీఆర్‌ఐకు పంపినట్లు తెలిపారు. వారం రోజులుగా అస్వస్థతకు గురైన ‘కదంబా ఆహారం తీసుకోవడం లేదని జూ క్యూరేటర్ క్షితిజా తెలిపారు. జూ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో కదంబాకు చికిత్స అందించారు. అయితే శనివారం గుండె పనితీరు పూర్తిగా క్షీణించడంతో రాత్రి 9.20 గంటలకు మృతి చెందిందన్నారు. ప్రస్తుతం జూపార్కులో 11 ఎల్లో టైగర్లు ఉన్నాయని, ఇందులో మూడు పులులు 19–21 ఏళ్ల వయస్సు గలవని ఆమె తెలిపారు. హడలెత్తించిన ‘కదంబా’ కర్ణాటక జూలాజికల్ పార్కు నుంచి 2014 మార్చి 6న వన్యప్రాణి జంతువు మార్పిడిలో భాగంగా ‘కదంబా’ను జూపార్కుకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి జూపార్కులో ఉన్న కదంబాను 2015 ఆగస్టు 21న సంతానోత్పత్తి కోసం జూలో ఉన్న రాణి పులితో కలిపేందుకు ప్రయత్నం చేశారు. 10 అడుగుల ఎత్తున్న ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి వాటిని కలిపేందుకు ప్రయత్నం చేస్తుండగా ‘కదంబా’ ఎన్క్లోజర్ను దూకి బయటికి వచ్చింది. దీంతో అక్కడే ఉన్న యానిమల్ కీపర్లు, జూ వైద్యులు, అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దాదాపుగా 2 గంటల పాటు అటు ఇటు తిరిగి హల్చల్ చేసిన కదంబాను ఎట్టకేలకు ఎన్‌క్లోజర్‌లో బం«ధించారు. ఇందుకు జూ అసిస్టెంట్ క్యూరేటర్ మక్సూద్ వైఫల్యమే కారణమని భావించి అప్పట్లో అతడిని బదిలీ చేశారు. ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చినా ఎవరికి హాని చేయకపోవడం గమనార్హం. అయితే 11 ఏళ్ల వయస్సులోనే ‘కదంబా’ గుండె వ్యాధితో మృతి చెందడం బాధాకరం. కొనసాగుతున్న వన్యప్రాణుల మృత్యువాత 2016 నుంచి జూలో వరుసగా చిన్న వయస్సులోనే పులులు, సింహాలు, అడవిదున్నలు, ఐనాలు, నామాల కోతులు, నీటి కుక్కలు (ముంగిసలు), సంవత్సరం వయస్సున్న పులి సైతం మృతి చెందాయి. ప్రాథమిక నివేదికల ఆధారంగా కదంబా మృతి చెందిందని చెబుతున్న జూ అధికారులు... అంతకు ముందు మృతి చెందిన వన్యప్రాణులు ఫలానా వాటితో మృతి చెందాయని తెలిపారే తప్పా... సేకరించిన నమునాల నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. -
చిన్నారిని బలిగొన్న బ్యాటరీ వాహనం
సాక్షి, హైదరాబాద్ : నెహ్రూ జూపార్కులో విషాదం చోటుచేసుకుంది. బ్యాటరీ వాహనం ఢీ కొనటంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూపార్కు సందర్శించేందుకు విద్యానగర్‌కు చెందిన మహమ్మద్ ఒమర్ అనే రెండు సంవత్సరాల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. పార్కులో పర్యటిస్తున్న సమయంలో బ్యాటరీ వాహనం ఒమర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన చిన్నారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మృతిపై ప్రభుత్వం స్పందించింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. పీసీసీఎఫ్.. పీకే ఝూ ఈ ఘటనపై విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ పృద్వీరాజ్‌ను నియమించారు. -
ఏమి హాయిలే..
బహదూర్‌పురా: ఎండలు మండిపోతున్నాయి.. నీటి విరజిమ్మే స్పింకర్లు, చల్లదనాన్ని ఇచ్చే గ్రీన్ పరదాలు.. కూలర్లు.. నీటి ఫాంట్లు.. ఫాగర్స్ వన్యప్రాణులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించనున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో వీటిని ఏర్పాటు చేశారు. జూలో వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో ఉండే వన్యప్రాణులకు చుట్టూ నీటిని స్ప్రింక్లర్లతో విరజిమ్ముతున్నారు. ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటి ఫాంట్లతో నీటిని విరజిమ్ముతూ వేసవితాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ల వద్ద కూలర్ల ద్వారా చల్లనిగాలి, మధ్య మధ్యలో పైపుల ద్వారా నీటిని విరజిమ్ముతూ హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పక్షుల ఎన్క్లోజర్ల వద్ద నీటి బిందువులను పొగ రూపంలో విరజిమ్మే ఫాగర్స్లను ఏర్పాటు చేశారు. నిశాచర జంతువుశాల, సరీసృపాల జగత్తులో ఎండ వేడిమిని ఉపశమనం కల్పించేందుకు ఏసీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు అదనంగా బలవర్ధకమైన ఆహారం, విటమిన్స్, మినరల్స్‌ను అందజేస్తున్నారు. -
తోడు కావాలి..!
కాలం కరిగిపోతోంది.. ఈడు ముదిరిపోతోంది.. జతగాడు దొరకక ఒంటరి జీవితం గడపాల్సి వస్తోంది. హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శన శాలలోని వన్యప్రాణుల వేదన ఇదీ. దీంతో ఏ రోజుకారోజు తోడు కోసం ఎదురు చూస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాయి. తమకు తోడెప్పుడు తెస్తారంటూ ‘జూ’అధికారులవైపు కొరకొరా చూస్తున్నాయి.అప్పుడప్పుడు అలుగుతున్నాయి. అరుస్తున్నాయి.. గోడలు దూకుతున్నాయి.. తిండితినక మారాం చేస్తున్నాయి. వీటి బాధ చూడలేక జూపెద్దలు తోడు కోసం దేశదేశాలూ తిరిగి చూస్తున్నారు.. ఇంటర్నెట్లో సైతం చాటింపు వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ అతగాని కోసం.. దీని పేరు సుజీ. 25 ఏళ్ల వయసుకొచ్చింది. మగ తోడుంటే ఈ చింపాంజీ ఇప్పటికే రెండింటిని కని జూ అధికారుల చేతిలో పెట్టేది. ఈడు ముదిరి పోతోందిగానీ తోడు మాత్రం దొరకటం లేదు. పదేళ్ల కింద పూణె జూ నుంచి దీనిని పట్టుకొచ్చారు. అప్పటి నుంచి తోడు కోసం వెతుకుతూనే ఉన్నారు. సుజీకి 15 నుంచి 20 ఏళ్ల మగ చింపాంజీ కావాలి. ఎక్కడెక్కడో వెతికినా లాభం లేకపోయింది.విదేశాల నుంచి బ్రీడ్ పట్టుకొచ్చారు. ఆ బ్రీడ్తోనైనా సుజీకి తోడు పుడుతుందేమో అని ఎదురుచూశారు. కానీ దురదృష్టవశాత్తు అది సక్సస్ కాలేదు. ఇప్పట్లో సుజీకి మగ తోడు కష్టమే అని జూ అధికారులు నిట్టూరుస్తున్నారు. అన్నీ ఆడ ఏనుగులే.. జూలో ఆరు ఏనుగులు ఉన్నాయి. అన్నీ ఆడవే. ఒక్క మగ తోడూ లేదు. మావటీలకు ఈ ఏనుగులతో పెద్ద సమస్య అయ్యింది. ఆహారం తీసుకోవు. ఒక్కోసారి ఎన్‌క్లోజర్ పీకి పందిరి వేస్తాయి. వీటి కోసం ఒక్క మగ ఏనుగునైనా తీసుకురావాలని జూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఓ మొసలి కూడా జూలో ఒంటరిగా ఉండలేకపోతోంది. తిండి తినటం మానేసి తోడు కోసం తహతహలాడుతోంది. ఏం చేసినా జూ అధికారులు జతగాడిని తీసుకురారు అనుకుందో ఏమో.. జూలోని ఎత్తైన ప్రహారీ గోడను ఒక్క ఊదుటన దూకి సందర్శకుల పార్కులోకి చొరబడింది. అప్రమత్తమైన అధికారులు గంటల తరబడి శ్రమించి దానిని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. అధికారులు కొద్దిగా చొరవ చూపితే దీనికి తోడు దొరికే అవకాశం ఉంది. ఇవే కాక జూలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన నిశాచర జీవి స్ప్లెండర్ లోరిస్ కోతి, ఫారస్ కోతులు, 10 జాతుల పక్షులు తోడు కోసం తపన పడుతున్నాయి. ఆహారం తీసుకోక.. హిమాలయన్ సన్బెర్ ఎలుగుబంటి. ఒంటరిగా ఉండలేక దీని బాధ వర్ణనాతీతం. సహజంగానే ఈ జంతువులు సంఘ జీవులు. ఈ ఆడ జీవి తోడులేక యానిమల్ కీపర్లను ఇబ్బంది పెడుతున్నాయి. సరిగా ఆహారం తీసుకోదు. ఒక్కోసారి రోజుల తరబడి తినటం మానేసి అనారోగ్యం పాలవుతోంది. దీనికి ఆహారం తినిపించడం యానిమల్ కీపర్లకు తలకు మించిన భారమవుతోంది. ఆడతోడు కోసం.. పొడుగు కాళ్ల బసంత్కి 11 ఏళ్లు.. ఎత్తు 10 అడుగులు.. ఆరేళ్ల కిందటే ఈడుకు వచ్చింది. తోడు కావాలంటూ జూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది.. అప్పుడప్పుడు అలిగి తిండి మానేస్తోంది.. జూ అధికారులు దీని తోడు కోసం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి జంతువులను కొనటం నిషిద్ధం. ఈ నిబంధనను కూడా పక్కనబెట్టి ప్రపంచమంతా గాలించారు. అయినా లాభం లేకపోయింది. ఈడుకు తగిన తోడు దొరకనేలేదు. దీనికి జత కలపాలంటే కనీసం 5–6 ఏళ్ల వయసున్న ఆడ జిరాఫీ కావాలి. ఈ వయసు జిరాఫీలు ఎక్కడా దొరకటం లేదట. ఆస్ట్రేలియాలో ఓ జిరాఫీని చూసినా అక్కడి నుంచి తీసుకురావటం సాధ్యం కావట్లేదు. విదేశీ జంతువులను విమానంలో తీసుకురావటం ఒక్కటే మార్గం. కానీ 9 ఫీట్లు పెరిగిన ఈ జిరాఫీ విమానంలో పట్టే పరిస్థితి లేదు. ఓడలో తీసుకువస్తే 15 రోజులకుపైగా సముద్ర యానం చేయాలి. సముద్ర ప్రయాణంలో జిరాఫీ అన్ని రోజులు బతకటం కష్టమని అధికారులు భయపడుతున్నారు. ఇటీవల కోల్‌కతా జూ అధికారులు.. ‘మా దగ్గర జిరాఫీ ఉంది’మీ దగ్గర ఉన్న జాగ్వార్(అమేజాన్ అడవి నుంచి తెచ్చిన చిరుత పులి) మాకు ఇస్తే జిరాఫీని ఇస్తాం’అని కుబురు పంపారు. తీరా మాట ముచ్చట వరకూ వచ్చేసరికి కోల్‌కతా జూ పెద్దలు మా దగ్గర జిరాఫీ జంట ఉంది.. జంటను ఇస్తాం కానీ ఒక్క జిరాఫీని ఇవ్వబోమని కరాకండీగా చెప్పేశారు. అయినా వాటిని హైదరాబాద్ తీసుకురావటానికి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఓ కొత్త సమస్య వచ్చింది. జంట జిరాఫీలను తీసుకువచ్చి జూలో ఎక్కడ ఉంచాలో తెలియక తలపట్టుకున్నారు. ఇచ్చే కొత్త జంటను, మన ఒంటరి జిరాఫీని కలిపి ఒకే చోట ఉంచితే.. ఒంటరి జిరాఫీ చిన్న మగ జిరాఫీని శత్రువుగా భావించి దాడి చేసి చంపే అవకాశం ఉందని అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. వేర్వేరుగా ఉంచితే జంట జిరాఫీలు హ్యాపీగా ఉంటే.. ఒంటరి జిరాఫీ ఎలా ఉంటుందో తెలియక సతమతమవుతున్నారు. తోడు కోసం వెతుకుతున్నాం.. ఒంటరి జంతువులకు తోడు కోసం వెతుకుతున్నాం. జంతువుల వయసును పరిగణనలోకి తీసుకుని తోడు వెతకాలి. సుజీ, బసంత్ కోసం చేయని ప్రయత్నం లేదు. దేశంలోని అన్ని జూల్లో చూస్తున్నాం. కానీ ఎక్కడా జోడు దొరకటం లేదు. సెంట్రల్ జూ అథారిటీకి లేఖలు రాశాం. వేరే రాష్ట్రంలోని ఏ జూ అధికారులు ముందుకొచ్చినా సింహం, తెల్లపులి, పులి, చిరుత, అడవిదున్నలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. – శివాని డోగ్రే, క్యూరేటర్, నెహ్రూ జంతుప్రదర్శనశాల -
'జూ' వరద మయం
బహదూర్‌పురా: తాడ్బన్ లోని మీరాలం చెరువు వర్షానికి నిండి ఉప్పొంగుతోంది. దీంతో నీరంతా జూలోకి చేరుకుంది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. లయన్ సఫారీ, సింగోజీ ఫాంట్స్‌తో పాటు ఇతర ఫాంట్స్‌లో నీరు చేరడంతో వన్యప్రాణులను నైట్హౌస్లకే పరిమితం చేశారు. ఎన్ క్లోజర్లలోకి వర్షపు నీరు చేరడం, మీరాలం ట్యాంక్ నుంచి నీరు ఏకధాటిగా ప్రవహిస్తుండటంతో శుక్రవారం జూకు అధికారులు సెలవు ఇచ్చారు. 1983 తరువాత వర్షం కారణంగా జూకు సెలవు ఇవ్వడం ఇదే మొదటిసారి. శనివారం సెలవు ఇవ్వాలా? లేదా? అనే దానిపై ఉదయం పరిస్థితిని బట్టి ప్రకటిస్తామని జూ అధికారులు చెప్పారు. వివిధ ఎన్ క్లోజర్ మోడ్లలో చేరిన నీటిని డీజిల్ మోటార్లతో బయటికి పంపిస్తున్నారు. మీరాలం ఫిల్టర్ నుంచి వస్తున్న కలుషిత నీటితో వన్యప్రాణులు వ్యాధులకు గురి కాకుండా ముందస్తుగా జూ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం క్యూరేటర్‌తో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
జూ పార్క్‌లో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరికి రిమాండ్
బహదూర్‌ఫురా (హైదరాబాద్): నెహ్రూ జూ పార్కు క్యూరేటర్ శివానీ డోగ్రాపై దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు సందర్శకులను బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింహాల ఎన్‌క్లోజర్ వద్ద గురువారం విశాంత్ (20) అనే వ్యక్తి రేలింగ్ ఎక్కి సింహాలకు సైగలు చేస్తున్నాడు. అదే సమయంలో ఆ మార్గంలో పరిశీలనకు వచ్చిన క్యూరేటర్ శివానీ డోగ్రా గమనించి యువకున్ని మందలించింది. దీంతో విశాంత్ తండ్రి ప్రశాంత్ క్యూరేటర్‌ను కుమారుడితో కలిసి తోసేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన యానిమల్ కీపర్లు వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. క్యూరేటర్ శివానీ డోగ్రా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఓ మందబాబు హల్చల్ చేశాడు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం జూ పార్క్ సందర్శనకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఒక్కసారిగా పులి ఇంక్లోజర్లోనికి దూకేశాడు. అదృష్టవశాత్తు పులి అతన్ని గమనించలేదు. ఇంతలో సందర్శకుల అరుపులు, కేకలతో పులి డెన్లోనికి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో పులులను డెన్లోకి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి స్థానిక పోలీసులకు అప్పగించారు. బతుకు దెరువు కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. సందర్శకుడు సురక్షితంగా బయటపడడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
హైదరాబాద్ జూపార్క్‌లో విషాదం
హైదరాబాద్: నెహ్రూ జూపార్క్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి నెహ్రూ జూ పార్క్‌కు విహార యాత్రకు వచ్చాడు. బట్టర్ఫ్లై పార్క్‌లోకి వెళ్లిన సమయంలో సెల్ఫీ దిగుతుండగా ప్రమాదశాత్తూ అతడికి కరెంటు తీగలు తగిలి షాక్ తగిలింది. విద్యుత్ షాక్ కారణంగా తీవ్రగాయాలపాలైన విద్యార్థి ముంజిత్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలో అతడు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.