బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (11) గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ప్రాథమిక నివేదికల ప్రకారం గుండె పనితీరు ఫెయిలవడం, రక్తం గడ్డ కట్టడం మృతికి కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ ఫ్యాథలాజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్, వీబీఆర్‌ఐ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్, వీబీఆర్‌ఐ వైద్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, అత్తాపూర్ సీసీఎంబీ ల్యాంకోన్స్ సీనియర్ ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త సదానంద్ సోన్‌టాకే, జూపార్కు వెటర్నరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్, జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందుకు సంబందించిన నమునాలను రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ, ల్యాంకోన్స్ సీసీఎంబీ, వీబీఆర్‌ఐకు పంపినట్లు తెలిపారు. వారం రోజులుగా అస్వస్థతకు గురైన ‘కదంబా ఆహారం తీసుకోవడం లేదని జూ క్యూరేటర్ క్షితిజా తెలిపారు. జూ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో కదంబాకు చికిత్స అందించారు. అయితే శనివారం గుండె పనితీరు పూర్తిగా క్షీణించడంతో రాత్రి 9.20 గంటలకు మృతి చెందిందన్నారు. ప్రస్తుతం జూపార్కులో 11 ఎల్లో టైగర్లు ఉన్నాయని, ఇందులో మూడు పులులు 19–21 ఏళ్ల వయస్సు గలవని ఆమె తెలిపారు.
హడలెత్తించిన ‘కదంబా’
కర్ణాటక జూలాజికల్ పార్కు నుంచి 2014 మార్చి 6న వన్యప్రాణి జంతువు మార్పిడిలో భాగంగా ‘కదంబా’ను జూపార్కుకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి జూపార్కులో ఉన్న కదంబాను 2015 ఆగస్టు 21న సంతానోత్పత్తి కోసం జూలో ఉన్న రాణి పులితో కలిపేందుకు ప్రయత్నం చేశారు. 10 అడుగుల ఎత్తున్న ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి వాటిని కలిపేందుకు ప్రయత్నం చేస్తుండగా ‘కదంబా’ ఎన్‌క్లోజర్‌ను దూకి బయటికి వచ్చింది. దీంతో అక్కడే ఉన్న యానిమల్ కీపర్లు, జూ వైద్యులు, అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దాదాపుగా 2 గంటల పాటు అటు ఇటు తిరిగి హల్‌చల్ చేసిన కదంబాను ఎట్టకేలకు ఎన్‌క్లోజర్‌లో బం«ధించారు. ఇందుకు జూ అసిస్టెంట్ క్యూరేటర్ మక్సూద్ వైఫల్యమే కారణమని భావించి అప్పట్లో అతడిని బదిలీ చేశారు. ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చినా ఎవరికి హాని చేయకపోవడం గమనార్హం. అయితే 11 ఏళ్ల వయస్సులోనే ‘కదంబా’ గుండె వ్యాధితో మృతి చెందడం బాధాకరం.
కొనసాగుతున్న వన్యప్రాణుల మృత్యువాత
2016 నుంచి జూలో వరుసగా చిన్న వయస్సులోనే పులులు, సింహాలు, అడవిదున్నలు, ఐనాలు, నామాల కోతులు, నీటి కుక్కలు (ముంగిసలు), సంవత్సరం వయస్సున్న పులి సైతం మృతి చెందాయి. ప్రాథమిక నివేదికల ఆధారంగా కదంబా మృతి చెందిందని చెబుతున్న జూ అధికారులు... అంతకు ముందు మృతి చెందిన వన్యప్రాణులు ఫలానా వాటితో మృతి చెందాయని తెలిపారే తప్పా... సేకరించిన నమునాల నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment