కాలం కరిగిపోతోంది.. ఈడు ముదిరిపోతోంది.. జతగాడు దొరకక ఒంటరి జీవితం గడపాల్సి వస్తోంది. హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శన శాలలోని వన్యప్రాణుల వేదన ఇదీ. దీంతో ఏ రోజుకారోజు తోడు కోసం ఎదురు చూస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాయి.
తమకు తోడెప్పుడు తెస్తారంటూ ‘జూ’అధికారులవైపు కొరకొరా చూస్తున్నాయి.అప్పుడప్పుడు అలుగుతున్నాయి. అరుస్తున్నాయి.. గోడలు దూకుతున్నాయి.. తిండితినక మారాం చేస్తున్నాయి. వీటి బాధ చూడలేక జూపెద్దలు తోడు కోసం దేశదేశాలూ తిరిగి చూస్తున్నారు.. ఇంటర్నెట్‌లో సైతం చాటింపు వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్
అతగాని కోసం..
దీని పేరు సుజీ. 25 ఏళ్ల వయసుకొచ్చింది. మగ తోడుంటే ఈ చింపాంజీ ఇప్పటికే రెండింటిని కని జూ అధికారుల చేతిలో పెట్టేది. ఈడు ముదిరి పోతోందిగానీ తోడు మాత్రం దొరకటం లేదు. పదేళ్ల కింద పూణె జూ నుంచి దీనిని పట్టుకొచ్చారు. అప్పటి నుంచి తోడు కోసం వెతుకుతూనే ఉన్నారు. సుజీకి 15 నుంచి 20 ఏళ్ల మగ చింపాంజీ కావాలి. ఎక్కడెక్కడో వెతికినా లాభం లేకపోయింది.విదేశాల నుంచి బ్రీడ్ పట్టుకొచ్చారు. ఆ బ్రీడ్‌తోనైనా సుజీకి తోడు పుడుతుందేమో అని ఎదురుచూశారు. కానీ దురదృష్టవశాత్తు అది సక్సస్ కాలేదు. ఇప్పట్లో సుజీకి మగ తోడు కష్టమే అని జూ అధికారులు నిట్టూరుస్తున్నారు.
అన్నీ ఆడ ఏనుగులే..
జూలో ఆరు ఏనుగులు ఉన్నాయి. అన్నీ ఆడవే. ఒక్క మగ తోడూ లేదు. మావటీలకు ఈ ఏనుగులతో పెద్ద సమస్య అయ్యింది. ఆహారం తీసుకోవు. ఒక్కోసారి ఎన్‌క్లోజర్ పీకి పందిరి వేస్తాయి. వీటి కోసం ఒక్క మగ ఏనుగునైనా తీసుకురావాలని జూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
ఓ మొసలి కూడా జూలో ఒంటరిగా ఉండలేకపోతోంది. తిండి తినటం మానేసి తోడు కోసం తహతహలాడుతోంది. ఏం చేసినా జూ అధికారులు జతగాడిని తీసుకురారు అనుకుందో ఏమో.. జూలోని ఎత్తైన ప్రహారీ గోడను ఒక్క ఊదుటన దూకి సందర్శకుల పార్కులోకి చొరబడింది. అప్రమత్తమైన అధికారులు గంటల తరబడి శ్రమించి దానిని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. అధికారులు కొద్దిగా చొరవ చూపితే దీనికి తోడు దొరికే అవకాశం ఉంది. ఇవే కాక జూలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన నిశాచర జీవి స్ప్లెండర్ లోరిస్ కోతి, ఫారస్ కోతులు, 10 జాతుల పక్షులు తోడు కోసం తపన పడుతున్నాయి.
ఆహారం తీసుకోక..
హిమాలయన్ సన్‌బెర్ ఎలుగుబంటి. ఒంటరిగా ఉండలేక దీని బాధ వర్ణనాతీతం. సహజంగానే ఈ జంతువులు సంఘ జీవులు. ఈ ఆడ జీవి తోడులేక యానిమల్ కీపర్లను ఇబ్బంది పెడుతున్నాయి. సరిగా ఆహారం తీసుకోదు. ఒక్కోసారి రోజుల తరబడి తినటం మానేసి అనారోగ్యం పాలవుతోంది. దీనికి ఆహారం తినిపించడం యానిమల్ కీపర్లకు తలకు మించిన భారమవుతోంది.
ఆడతోడు కోసం..
పొడుగు కాళ్ల బసంత్‌కి 11 ఏళ్లు.. ఎత్తు 10 అడుగులు.. ఆరేళ్ల కిందటే ఈడుకు వచ్చింది. తోడు కావాలంటూ జూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది.. అప్పుడప్పుడు అలిగి తిండి మానేస్తోంది.. జూ అధికారులు దీని తోడు కోసం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి జంతువులను కొనటం నిషిద్ధం. ఈ నిబంధనను కూడా పక్కనబెట్టి ప్రపంచమంతా గాలించారు. అయినా లాభం లేకపోయింది. ఈడుకు తగిన తోడు దొరకనేలేదు. దీనికి జత కలపాలంటే కనీసం 5–6 ఏళ్ల వయసున్న ఆడ జిరాఫీ కావాలి. ఈ వయసు జిరాఫీలు ఎక్కడా దొరకటం లేదట.
ఆస్ట్రేలియాలో ఓ జిరాఫీని చూసినా అక్కడి నుంచి తీసుకురావటం సాధ్యం కావట్లేదు. విదేశీ జంతువులను విమానంలో తీసుకురావటం ఒక్కటే మార్గం. కానీ 9 ఫీట్లు పెరిగిన ఈ జిరాఫీ విమానంలో పట్టే పరిస్థితి లేదు. ఓడలో తీసుకువస్తే 15 రోజులకుపైగా సముద్ర యానం చేయాలి. సముద్ర ప్రయాణంలో జిరాఫీ అన్ని రోజులు బతకటం కష్టమని అధికారులు భయపడుతున్నారు. ఇటీవల కోల్‌కతా జూ అధికారులు.. ‘మా దగ్గర జిరాఫీ ఉంది’మీ దగ్గర ఉన్న జాగ్వార్(అమేజాన్ అడవి నుంచి తెచ్చిన చిరుత పులి) మాకు ఇస్తే జిరాఫీని ఇస్తాం’అని కుబురు పంపారు.
తీరా మాట ముచ్చట వరకూ వచ్చేసరికి కోల్‌కతా జూ పెద్దలు మా దగ్గర జిరాఫీ జంట ఉంది.. జంటను ఇస్తాం కానీ ఒక్క జిరాఫీని ఇవ్వబోమని కరాకండీగా చెప్పేశారు. అయినా వాటిని హైదరాబాద్ తీసుకురావటానికి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఓ కొత్త సమస్య వచ్చింది. జంట జిరాఫీలను తీసుకువచ్చి జూలో ఎక్కడ ఉంచాలో తెలియక తలపట్టుకున్నారు. ఇచ్చే కొత్త జంటను, మన ఒంటరి జిరాఫీని కలిపి ఒకే చోట ఉంచితే.. ఒంటరి జిరాఫీ చిన్న మగ జిరాఫీని శత్రువుగా భావించి దాడి చేసి చంపే అవకాశం ఉందని అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. వేర్వేరుగా ఉంచితే జంట జిరాఫీలు హ్యాపీగా ఉంటే.. ఒంటరి జిరాఫీ ఎలా ఉంటుందో తెలియక సతమతమవుతున్నారు.
తోడు కోసం వెతుకుతున్నాం..
ఒంటరి జంతువులకు తోడు కోసం వెతుకుతున్నాం. జంతువుల వయసును పరిగణనలోకి తీసుకుని తోడు వెతకాలి. సుజీ, బసంత్ కోసం చేయని ప్రయత్నం లేదు. దేశంలోని అన్ని జూల్లో చూస్తున్నాం. కానీ ఎక్కడా జోడు దొరకటం లేదు. సెంట్రల్ జూ అథారిటీకి లేఖలు రాశాం. వేరే రాష్ట్రంలోని ఏ జూ అధికారులు ముందుకొచ్చినా సింహం, తెల్లపులి, పులి, చిరుత, అడవిదున్నలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. – శివాని డోగ్రే, క్యూరేటర్, నెహ్రూ జంతుప్రదర్శనశాల