'జూ' వరద మయం
బహదూర్‌పురా: తాడ్‌బన్ లోని మీరాలం చెరువు వర్షానికి నిండి ఉప్పొంగుతోంది. దీంతో నీరంతా జూలోకి చేరుకుంది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. లయన్ సఫారీ, సింగోజీ ఫాంట్స్‌తో పాటు ఇతర ఫాంట్స్‌లో నీరు చేరడంతో వన్యప్రాణులను నైట్‌హౌస్‌లకే పరిమితం చేశారు. ఎన్ క్లోజర్లలోకి వర్షపు నీరు చేరడం, మీరాలం ట్యాంక్ నుంచి నీరు ఏకధాటిగా ప్రవహిస్తుండటంతో శుక్రవారం జూకు అధికారులు సెలవు ఇచ్చారు. 1983 తరువాత వర్షం కారణంగా జూకు సెలవు ఇవ్వడం ఇదే మొదటిసారి.
శనివారం సెలవు ఇవ్వాలా? లేదా? అనే దానిపై ఉదయం పరిస్థితిని బట్టి ప్రకటిస్తామని జూ అధికారులు చెప్పారు. వివిధ ఎన్ క్లోజర్ మోడ్‌లలో చేరిన నీటిని డీజిల్ మోటార్లతో బయటికి పంపిస్తున్నారు. మీరాలం ఫిల్టర్ నుంచి వస్తున్న కలుషిత నీటితో వన్యప్రాణులు వ్యాధులకు గురి కాకుండా ముందస్తుగా జూ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం క్యూరేటర్‌తో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.