amejan
-
8 వారాలు ఆగాల్సిందే
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్లైన్లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్లైన్లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. -
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాదిలో 40.1 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ఈయన.. ఈ ఏడాదిలో 50 బిలియన్ డాలర్ల సంపదతో ప్రస్తుత ర్యాంక్‌కు ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో ముకేశ్ అంబానీ తరువాత.. విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 36వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 22.6 బిలియన్ డాలర్లు. హెచ్‌సీఎల్ కో–ఫౌండర్ శివ్ నాడార్ 82వ స్థానంలో నిలవగా.. ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ 91వ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా (122), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (167), భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ (244), పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు ఆచార్య బాల్కృష్ణ (365), పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ (436), బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా (617), ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి (962), ఆర్‌కామ్ చైర్మన్ రిలయన్స్ అనిల్ అంబానీ (1349) స్థానాల్లో నిలిచారు. -
‘అమేజాన్’లో ఇంటి దొంగ!
మరో యువకుడితో కలిసి సంస్థకే టోకరా ఐ-ఫోన్లు ‘కొట్టేసి’ వాటి స్థానంలో చైనా ఫోన్లు చెక్ పెట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ నిందితుల అరెస్టు, ఆరు ఫోన్లు స్వాధీనం సిటీబ్యూరో: తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్లు, సబ్బు బిళ్లలు పార్శిల్లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ఆమేజాన్కే ఇద్దరు యువకులు టోకరా వేశారు. తమదైన పంథాలో దాదాపు రెండు నెలలుగా రూ.ఐదు లక్షలకు పైగా స్వాహా చేశారు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం నిందితులను అరెస్టు చేశారు. వరిలో ఒకరు సంస్థకు చెందిన ఉద్యోగి ఉన్నారని, వీరి నుంచి ఆరు ఖరీదైన యాపిల్ ఐ-ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మాజీ సహోద్యోగితో జట్టు కట్టి... కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన అంకుష్ బిరాజ్దర్, పాతబస్తీలోని పురానీహవేలీ ప్రాంతానికి చెందిన మీర్ ఫెరోజ్ అలీ అలియాస్ హసన్ పాత స్నేహితులు. అంకుష్ ప్రస్తుతం అమేజాన్‌లో ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్నాడు. సంస్థ ఆపరేషన్స్‌లో లోపాలు, వీటి ఆధారంగా జరుగుతున్న మోసాలను గుర్తించి యాజమాన్యాన్ని అప్రమత్తం చేయడం అతని పని. ఈ నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఓ లోపాన్ని వినియోగించుకుని పని చేస్తున్న సంస్థకే టోకరా వేయాలని పథకం వేసి హుస్సేన్‌తో కలిసి రంగంలోకి దిగాడు. ఆర్డర్ ఇవ్వడం... రిటర్న్ చేయడం... వీరిద్దరూ కలిసి వివిధ పేర్లతో బోగస్ కస్టమర్ ఐడీలుగా వినియోగించడానికి ఈ-మెయిల్ ఐడీలు సృష్టించుకున్నారు. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహేంద్ర బ్యాంకుల్లో హుస్సేన్ పేరుతో ఖాతాలు తెరిచి, అందులో అవసరమైన నగదును అంకుష్ డిపాజిట్ చేశాడు. ఒక్కోసారి ఒక్కో ఈ-మెయిల్ ఐడీ వినియోగించి అమేజాన్ నుంచి ఖరీదైన ఆరు యాపిల్ ఐ-ఫోన్లు బుక్ చేశారు. డెలివరీ కోసం వేర్వేరు ఫోన్ నెంబర్లు, చిరునామా ఇస్తూ వచ్చారు. పార్శిల్ తీసుకువచ్చిన సంస్థ డెలివరీ బాయ్స్ వీరిచ్చిన చిరునామాలు దొరక్కపోవడంతో ఫోన్లో సంప్రదిస్తే నేరుగా బాయ్స్ వద్దకే వెళ్ళి వస్తువులు తీసుకునేవారు. చైనా ఫోన్లను రిటర్న్ చేస్తూ... ఓ వస్తువును ఖరీదు చేసి, రిసీవ్ చేసుకున్న తర్వాత వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే ‘ఈజీ రిటర్న్’ పాలసీ అమలు చేస్తోంది. దీని ప్రకారం విషయాన్ని కంపెనీకి తెలిపి, డెలివరీ బాయ్స్‌కు వస్తువు అప్పగిస్తే... తక్షణం ఆన్లైన్లో చెల్లించిన మొత్తం కంపెనీ నుంచి వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. దీన్ని ‘క్యాష్’ చేసుకున్న వారు పార్శిల్లో ఉన్న ఐ-ఫోన్‌ను తీసేసి... దాన్నే పోలి ఉన్న చైనా ఫోన్ పెట్టి, వివిధ కారణాలతో రిటర్న్ చేస్తూ నగదును తమ ఖాతాలోకి జమ చేయించుకునేవారు. పక్కా సమాచారంతో చిక్కారు... ఇలా చేతికందిన ఫోన్లను హసన్ తీసుకువెళ్లి అంకుష్‌కు అప్పగించేవాడు. వీటిని మార్కెట్లో అవసరమైన వారికి విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకునే వారు. రెండు నెలల్లో దాదాపు రూ.5 లక్షల ఖరీదు చేసే ఆరు ఐ-ఫోన్లను వారు అమేజాన్ నుంచి కాజేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు జి.మల్లేష్, బి.మధుసూదన్, ఎస్కే జకీర్ హుస్సేన్, ఎన్.శ్రీశైలంతో కూడిన బృందం బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు. -
జూలో కొత్త అతిథుల సందడి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రెడ్ ఆండ్రేడ్ టమారీన్ (గోల్డెన్) కోతులు సందడి చేస్తున్నాయి. ఇవి చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జూకు చేరుకున్నాయని జూ క్యూరేటర్ బిఎన్ఎన్. మూర్తి తెలిపారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీటిని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. కొలంబియా, సౌత్ అమెరికా, ఆమెజాన్ ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ దత్తత తీసుకొని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. వీటిని వారం రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి సందర్శనార్ధం ఎన్క్లోజర్లలో ఉంచుతామన్నారు. అతి తక్కువ బరువు (250 గ్రాములు) గల ఈ కోతులకు పిగ్టెల్ మాకాక్ (పందితోక కోతులు) ఎన్‌క్లోజర్‌లోనే వీటిని ఉంచుతామన్నారు. జూకు చేరుకున్న ఈ కోతుల్లో మగది 4 ఏళ్లు, అడవి 3 ఏళ్ల వయస్సు గలవి. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండేందుకు ఇష్టపడుతాయన్నారు. ఈ కోతులకు పండ్లు, చిన్న చిన్న కీటికాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారమన్నారు. జూలో వీటికి మొలకెత్తిన విత్తనాలు, పండ్లతో పాటు సెర్లాక్స్ను కూడా అందిస్తామన్నారు. జూకు మరిన్ని కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.