ఇటీవల ఇండోనేషియాలోని మకస్పర్‌లో తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లిన ఓ మహిళను భారీ అనకొండ మింగేసింది. అలాగే రెండ్రోజుల కిందట అసోంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను పట్టుకొన్న ఓ అటవీ అధికారి, దానితో సెల్ఫీ తీసుకుంటుండగా అది ఆయన మెడను చుట్టుకొని బిగించింది. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి దాని పట్టునుంచి అధికారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అనకొండ గురించి క్లుప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములున్నాయి. వీటిలో అతి పెద్దదే అనకొండ(పైథాన్). సరీసృపాల్లోని యునెక్ట్స్ ప్రజాతికి చెందిన ఇవి విషరహితం. యునెక్ట్స్ అంటే గ్రీకు భాషలో గుడ్ స్విమ్మర్(మంచి ఈతగాడు) అని అర్థం. అనకొండల రూపం, పరిమాణాన్ని బట్టి వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గ్రీన్(ఆకుపచ్చ) అనకొండ, ఎల్లో(పసుపు) లేదా పరాగ్వేయన్ అనకొండ, బ్లాక్ స్పాటెడ్ (నల్లమచ్చల) అనకొండ, బేని లేదా బొలివియన్ అనకొండ. మనదేశంతోపాటు ఉపఖండంలో కనిపించే కొండచిలువ ఇందులో ఒకటి.
దక్షిణ అమెరికాలో అత్యధికం
ఒక్క అంటార్కిటాకాలో మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ అనకొండలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య దక్షిణ అమెరికాలో అత్యధికం. అక్కడి వాతావరణ పరిస్థితులు దీనికి కారణం. అనకొండల్లోని నాలుగు రకాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి పురాణాల్లోనూ వీటి ప్రసక్తి ఉంది. వీటికి కొన్ని అతీత శక్తుల్ని ఆపాదిస్తూ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనుషుల్ని తినేవిగానూ వీటిని పేర్కొన్నారు. అనకొండ పేరు మీద వచ్చిన అనేక ఇంగ్లిష్ సినిమాలకు ఇవే ప్రేరణ.
చిత్తడి నేలలు, తీరాల్లో ఆవాసం
అనకొండలు అన్ని ప్రాంతాల్లోనూ నివసించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా నది, సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఉండడానికి ఆసక్తి చూపుతాయి. ఇక్కడ ఇవి సంచరించడానికి అనుకూలంగా ఉండడంతోపాటు వీటి ఆహారమైన చిన్నచిన్న జంతువులు నీళ్లు తాగేందుకు రావడం మరో కారణం. బలమైన కండరాలతో ఏర్పడిన వీటి ఆకారం నేలమీద కంటే నీటిలో చురుగ్గా ప్రయాణించేందుకు వీలుగా ఉండడమూ చెప్పుకోవచ్చు. ఇవి నీళ్లలో ఈదుతూ లేదా దాక్కొని ఉంటూ ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రవాహ వేగం తక్కువగా ఉండే నదులు, జలపాతాల సమీపంలో ఎత్తైన చెట్ల కొమ్మలను చుట్టుకొనీ ఉంటాయి. ఇవి గరిష్ఠంగా 100 అడుగుల వరకూ పెరుగుతాయని వాదనలు ఉన్నప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల పొడవైన అనకొండే అతి పెద్దది. అలాగే వీటి బరువు 250 కిలోల వరకూ ఉంటుందని అంచనా. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం గరిష్టంగా 45–68 కిలోల వరకు ఉన్నవాటినే ఇప్పటిదాకా గుర్తించారు.
ఊపిరి ఆడకుండా .. రక్తప్రసరణ జరగకుండా..
ఏటా వసంత కాలంలో అనకొండలు జతకూడతాయి. ఆడ అనకొండలు వదిలే ఒకరకమైన ద్రవం వాసనను బట్టి మగవి వెతుక్కుంటూ వస్తాయి. గర్భస్థ కాలం ఏడు నెలలు. ఈ కాలంలో పిల్లల్ని మోసే ఆడవి వేటాడవు. ఒక్కదఫా కనీసం 30 పిల్లల్ని కంటాయి. పుట్టగానే వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. అనకొండ గరిష్ఠ జీవిత కాలం 30 ఏళ్లు. జింకలు, కుందేళ్లు, చేపలు, మొసళ్లు, తదితర జంతువుల్ని ఆహారంగా తీసుకొనే అనకొండలు.. ఆకలేస్తే మనిషి మీద దాడి చేయడానికీ వెనకాడవు. ఈ క్రమంలో ఇవి తమ ఆహారాన్ని మొదట బలంగా చుట్టుకొని ఊపిరి ఆడకుండా, రక్తప్రసరణ జరగకుండా చేస్తాయి. అవి చనిపోయాక వాటిని మింగి ఆరగిస్తాయి.
అడవుల నరికివేత.. ఆవాసం ధ్వంసం
సాధారణంగా అడవుల్లోనే నివసించే అనకొండలు ఇటీవల తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. కలప, వ్యవసాయం కోసం అడవులను నరికివేయడంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. చిత్తడి నేలలు, నదీ తీర ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో వీటి ఆహారమైన ఇతర జంతువుల రాక తగ్గింది. దీంతో అనకొండలు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment