అరణ్యం: కుందేలుకు సంతోషం కలిగితే...?
మగ కుందేళ్లను బక్స్, ఆడ కుందేళ్లను డాస్ అంటారు!
కుందేళ్లు ఎలాంటి ప్రదేశంలో అయినా జీవించగలవు. గడ్డి మైదానాలు, వర్షారణ్యాలు, చివరకు ఎడారుల్లో కూడా అవి బతగ్గలవు!
ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి! కుందేళ్లు సంవత్సరంలో మూడుసార్లు బిడ్డల్ని కంటాయి. వీటి పిల్లలను కిట్స్ అంటారు. పుట్టినప్పుడు వీటికి చూపు ఉండదు. ఒంటిమీద బొచ్చు కూడా ఉండదు!
వీటి దృష్టికోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఇవి తమ వెనుక ఉన్నవాటిని కూడా తల తిప్పకుండానే చూడగలవు!
కుందేళ్లకు ఇరవై ఎనిమిది పళ్లుంటాయి. ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి గుండె నిమిషానికి 130 నుంచి 325 సార్లు కొట్టుకుంటుంది!
వీటికి ఆనందం వస్తే నానా హంగామా చేస్తాయి. ఎగురుతాయి, ఎత్తులెక్కి దూకుతాయి, అడ్డదిడ్డంగా పరుగులు తీస్తాయి, కాళ్లు నేలకేసి టపటపా కొడుతుంటాయి!
కుందేళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. తోడు లేకపోతే విసిగిపోతాయవి!
కొన్నిసార్లు ఆహారమే కుందేళ్ల పాలిట విషమవుతూ ఉంటుంది. ఎందుకంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే అదే విషమై ప్రాణాలు తీస్తుంది. అందుకే గట్టిగా ఉండే ఆహారాన్ని ముట్టవు కుందేళ్లు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గడ్డి, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి వాటినే తింటూ ఉంటాయి!
మీసాలు మాకూ ఉన్నాయోచ్!
పక్షులకు కూడా మీసాలుంటాయా అని ఆశ్చర్యం వేయడం లేదూ దీన్ని చూస్తుంటే! అయితే ఇవి మీసాలు కాదు... కొమ్ములు. పైగా ఒకటి, రెండు కాదు... మూడున్నాయి! అందుకే దీన్ని త్రీ వ్యాటిల్డ్ బెల్ బర్డ్ అంటారు. ఆడ బెల్ బర్డ్స్‌కి ఇలా కొమ్ములు ఉండవు. మగవాటికి మాత్రమే ఉంటాయి. దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షులు ముప్ఫై సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. వీటి ముక్కు చుట్టూ వచ్చే మూడు కొమ్ములు పది సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. సాధారణంగా ఈ కొమ్ములు కిందికి వేళ్లాడుతున్నట్టుగా ఉంటాయి. కానీ భయపడినప్పుడు, కోప్పడినప్పుడు, పాట పాడుతున్నప్పుడు నిటారుగా అవుతుంటాయి. అలాంటప్పుడు వాటి పరిమాణం కూడా కాస్త పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పక్షులన్నింటిలోకీ గట్టిగా అరవగలిగేవి ఇవే. వీటి అరుపు కిలోమీటరు దూరం వరకూ స్పష్టంగా వినిపిస్తుంది. తమ జంట విషయంలో వీటికి స్వార్థం చాలా ఎక్కువ. ఇతర మగ పక్షి కనుక తనతో జతకట్టిన ఆడపక్షి దగ్గరకు వస్తే, దాని చెవిలో గట్టిగా అరిచి వెళ్లగొట్టేస్తాయి మగ బెల్ బర్డ్స్. మనిషయినా పక్షి అయినా జెలసీ సహజమే అన్నమాట!