Rabbits
-
కుందేళ్లకు అంకితమైన మ్యూజియంగా గిన్నిస్ రికార్డు!
మనం జంతువుల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంలు, మానవ మ్యూజియంలు, పిరమిడ్ మమ్మీల మ్యూజియంలు వంటవి గురించి విన్నాం. అంతేగానీ కేవలం కుందేళ్లకు అంకితమయ్యే మ్యాజియం గురించి విని ఉండలేదు కదా!. కానీ అలాంటి విచిత్రమైన మ్యూజియం ఒకట ఉంది. ఎక్కడంటే.. ప్రపంచంలో చాలా చిత్రవిచిత్రమైన మ్యూజియమ్లు ఉన్నాయి. వాటిలో ఈ కుందేళ్ల మ్యూజియం ఒకటి. పూర్తిగా కుందేళ్లకే అంకితమైన ఈ మ్యూజియం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియా ఆల్టడెనా ప్రాంతంలోని లేక్ అవెన్యూలో ఈ మ్యూజియమ్‌ను 1998లో ప్రారంభించారు. దాదాపు ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పదహారు గ్యాలరీలతో ఏర్పాటైన ఈ మ్యూజియంలో ఎక్కడ చూసినా కుందేళ్లకు సంబంధించిన కళాఖండాలు, వస్తువులే కనిపిస్తాయి. కాండిస్ ఫ్రాజీ, స్టీవ్ లుబాన్‌స్కీ అనే దంపతులు కుందేళ్ల మీద ఉన్న ఇష్టంతో ఈ మ్యూజియమ్‌ను ప్రారంభించారు. ఇందులో సిరామిక్, గాజు వంటి వస్తువులతో తయారు చేసిన కుందేలు బొమ్మలు, గడ్డి నింపిన కుందేళ్లు, కుందేలు ఆకారంలోని సీసాలు, డబ్బాలు వంటి 8,473 కళాకృతులు ఉన్నాయి. కుందేళ్లకు సంబంధించిన అత్యధిక వస్తువులు గల ప్రదేశంగా ఈ మ్యూజియమ్ గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. (చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి!) -
యుద్దంతో మొదలై, కుందేళ్ల దీవిగా మారింది
జపాన్‌లోని ఒకునోషిమా దీవి కుందేళ్ల దీవిగా పేరుమోసింది. ఈ దీవిలో మనుషుల కంటే కుందేళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కుందేళ్లు గుంపులు గుంపులుగా గంతులేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ దీవి సాధారణ జనావాసంగానే ఉండేది. వ్యవసాయం సహా అన్ని పనులూ సాగేవి. ఈ దీవిలో కొన్ని మత్స్యకారుల కుటుంబాలు కూడా ఉండేవి. దీవి రక్షణ కోసం జపాన్ ప్రభుత్వం ఇక్కడ కట్టుదిట్టమైన పది కోటలను నిర్మించింది. తర్వాత రష్యాతో యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జపాన్ సైన్యం 1925లో దీనిని రహస్య పరిశోధన కేంద్రంగా మార్చుకుని, ఇక్కడి జనాలను ఇతర ప్రదేశాలకు తరలించింది. రసాయనిక ఆయుధాల ప్రయోగాలలో భాగంగా ఇక్కడకు కొన్ని కుందేళ్లను తీసుకొచ్చింది. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నాళ్లకు జపాన్ సైన్యం కూడా ఈ దీవిని ఖాళీ చేసింది. అయితే, మొదట్లో తీసుకొచ్చిన కుందేళ్లు ఆ తర్వాత అంతకంతకూ వృద్ధి చెంది, ఇది కుందేళ్ల దీవిగా మారింది. ఇక్కడి కుందేళ్లను చూడటానికి పర్యాటకులు తరచు ఇక్కడకు వస్తుంటారు. -
వన్య ప్రాణికి కరువైన రక్షణ
ఒకప్పుడు ఎటూ చూసిన అడవులే. అంతటా పచ్చిక బయళ్లే. వాటిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు కనువిందు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేటగాళ్లు సాధు జంతువులను వేటాడుతున్నారు. వల వేసి పడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన అడ్డాలైన కల్లు దుకాణాలు, అంగళ్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కొందరికైతే మరీ ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు మాత్రం చీమకుట్టు కూడా చలించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి సాదు జంతువులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక వారు ఏ మేరకు స్పందిస్తారో..! నస్రుల్లాబాద్(బాన్సువాడ): రోజు రోజుకు వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. శాఖాహార జీవాలను వేటగాళ్లు వలలు వేసి మరీ పట్టుకుని కాల్చుకుతింటున్నారు. కాపాడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇటీవలే మండలంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో దానికి శస్త్ర చికిత్స చేసి రాజధాని జూకు తరలించారు. అయినా కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. ప్రతి నెల వచ్చే వేతనాలను తీసుకోవడంలో ఉన్న ఆతృత ఉద్యోగం చేయడంలో చూపించడంలేదని వన్య ప్రేమికులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, గాంధారి, సిరికొండ, మాచారెడ్డి, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, భీమ్‌గల్ తదితర మండలాల్లో గతంలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే అవి కాస్త ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో వేటగాళ్లు అటవీ జంతువులను వేడాడి వాటి మాంసాన్ని పాళ్లుగా వేస్తున్నారు. దీంతో వారికి ‘మూడు పాళ్లు.. ఆరు వేలు’గా ఆదాయం సమకూరుతోంది. వేటగాళ్లు ప్రధానంగా గ్రామాల్లోని కల్లు దుకాణాలు, వైన్సులను అడ్డాలుగా మార్చుకుని మరీ విక్రయిస్తున్నారు. కన్నెత్తి చూడని అటవీ అధికారులు.. ‘ఒకవైపు వన్య ప్రాణులను కాపాడాలి’ అన్న నినాదంతో శాకాహార జంతువుల పెంపకం కోసం వన సంపద పెంచాలని ప్రభుత్వం హరితహారం నిర్వహించి మరీ మొక్కలను పెంచుతోంది. వేటగాళ్ల చేతులకు సాదు జీవులు బలై పోతున్నాయి. దీంతో రాబోయో రోజుల్లో సాదు జీవాలను జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడాల్సి వస్తోంది. ఇలా ఇష్టారీతిన జంతువులను చంపుకు తింటూ ఉంటే మాత్రం రానురాను వన్య ప్రాణులు మాత్రం అంతరించి పోతున్నాయి. ఐదేళ్ల క్రితం నస్రుల్లాబాద్ మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించే అటవీ జీవుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం తగ్గిపోయింది. వర్ని–నస్రుల్లాబాద్ మధ్య ఉన్న గండిలో సాయంత్రం అయితే జన సంచారం ఉండేది కాదు. అయితే నేటి జనాలు క్రూర మృగాలుగా మారి కనుమరుగు చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని పంట పొలాలు, పచ్చిక బయల్లు వంటి ప్రాంతాల్లో వలలు, ఉర్లు వంటివి పెట్టి యథేచ్ఛగా పెడుతున్నారు. ముందస్తు సమాచారంతోనే... పచ్చిక బయల్లు, అడవి ప్రాంతాల్లో పట్టిన శాఖాహార జంతువులు కుందేళ్లు, అడవి పంది, దుప్పి, కొండ గొర్రె, అడవి పక్షులు, కంజు పిట్టలు, పావురాలు వంటి వాటిని పట్టుకు వచ్చి సమీపంలోని కల్లు దుకాణాల్లో, అంగట్లో, బస్టాండ్ ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికితోడు కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే చెప్పి మరీ వేటకు వెళుతున్నారు. పెద్ద మొత్తంలో మద్యం వ్యాపారం జరిగే గ్రామాల్లో కల్లు దుకాణాల్లో ప్రతి రోజు వివిధ రకాల వన్య ప్రాణులు లభిస్తాయని సమాచారం. ఇంతగా వన్యప్రాణులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని వన ప్రేమికులు కోరుతున్నారు. -
కుందేళ్లు చిన్నవి.. లాభాలు పెద్దవి!
అరకొరగా చదువుకున్న మహిళలు చాలా మంది వంటింటికే పరిమితం అవుతున్నప్పటికీ.. దృఢసంకల్పంతో ముందడుగేస్తున్న రాధమ్మ వంటి మహిళా రైతులు ఆదర్శప్రాయమైన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. వివిధ పంటల సాగుతోపాటు బర్రెలు, కుందేళ్ల పెంపకం చేపట్టారు. వివిధ నగరాల్లో తమ కుందేలు మాంసాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం ద్వారా చేతినిండా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ ఇంటర్ వరకు చదువుకున్నారు. తొలినాళ్లలో టైలరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత వ్యవసాయం, పశుపోషణ, కుందేళ్ల పెంపకంపై దృష్టిపెట్టారు. గ్రామ సమీపంలో ఓ షెడ్డు నిర్మించి రూ. 5 లక్షల పెట్టుబడితో మూడేళ్ల క్రితం కుందేళ్ల పెంపకం ప్రారంభించారు. 300 కుందేళ్లతో పెంపకం ప్రారంభించగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు చేరింది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని సాగు చేస్తున్నారు. దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్క పొడిని దాణాగా ఇస్తున్నారు. నలుగురు కూలీలను నియమించారు. ఆడ కుందేలు నెలకోమారు 5–10 పిల్లలు పెడుతుంది. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుంది. పిల్లలు నాలుగు నెలల్లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు పెరుగుతాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై కుందేళ్ల మాంసం సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో కుందేలు మాంసం కిలోకి రూ.650 ధర పలుకుతున్నది. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ.లక్ష నికరాదాయం వస్తున్నదని రాధమ్మ తెలిపారు. పదెకరాలలో మూడు బోర్లు వేయించి వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతోపాటు 10 బర్రెలను పోషిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని, రైతుగా తనకు చాలా సంతృప్తిగా ఉందని రాధమ్మ(89855 97106) సంతోషంగా తెలిపారు. – ఈటి సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా -
కుందేలు వేటగాళ్ల అరెస్టు
ఎల్లారెడ్డి: కుందేలును వేటాడినవారిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి రాధాకిషన్ గురువారం తెలిపారు. మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో కుందేళ్లను వేటాడుతూ, వేటగాళ్లు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మండిరాం, భీమా అనే ఇద్దరు యువకులు కుందేళ్లతో పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. -
కుందేళ్లను గెంతనిస్తే అవార్డు!
జంతువులకు మనసుంటుంది. ఆ విషయం మనుషులకు తెలుసు. కానీ వాటి సహజ స్వభావాన్ని మరుగు పరచేలా.. దయలేకుండా వ్యవహరించటం పారిశ్రామిక వ్యవసాయ పద్ధతిలో చూసేదే. కానీ దానికి భిన్నంగా జైళ్లలో ఖైదీల్లా కిక్కిరిసిన ఇనుప పంజరాల్లో(కేజ్‌లలో) పెంచుతున్న కుందేళ్లకు సాంత్వన చేకూర్చేలా ఐరోపా దేశాల కూటమి తీసుకుంటున్న చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుందేళ్ల పెంపకంలో మెరుగైన ప్రమాణాలు పాటించే వారికి ఈ ఏడాది నుంచి అవార్డ్లు ఇవ్వనున్నట్టు ఐరోపా దేశాల కూటమి ప్రకటించింది. కేజ్‌ల్లో పెంచుతున్న కుందేళ్ల సంక్షేమానికి కృషిచేసే సంస్థలకు ఈ అవార్డ్ ఇస్తారు. ఐరోపాలో మాంసం కోసం పెంచుతున్న జంతువుల సంఖ్యలో కుందేళ్లది రెండో స్థానం. ప్రతి సంవత్సరం 12 లక్షల కుందేళ్లను ఆ దేశాల్లో మాంసం కోసం పెంచుతున్నారు. లెక్కకుమిక్కిలి ఉండే కుందేళ్లు కేజ్‌ల్లో కిక్కిరిసిన జీవితం గడుపుతాయి. తమ సహజ స్వభావానికి అనుగుణంగా చెంగు చెంగున ఉల్లాసంగా ఎగిరే అవకాశం లేదు. ఇంత జరుగుతున్నా వీటి బాగోగుల కోసం ఉద్ధేశించిన శాసనాలేవీ అమల్లో లేవు. కానీ కుందేళ్ల దాణాను తయారుచేసే కంపెనీలు వీటి జీవన పరిస్థితులు మెరుగుచేసేందుకు నడుం బిగిస్తున్నాయి. ఇటువంటి చర్యలకు ప్రభుత్వ అవార్డ్లు కుందేళ్ల సంక్షేమానికి మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందంటున్నారు జంతు ప్రేమికులు. -
మూర్ఖపు ఏనుగులు - తెలివైన కుందేళ్లు
పంచతంత్ర కథ పూర్వం కాశీపట్టణానికి ఉత్తర దిశలో ఉన్న అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. దాని పేరు చంద్రసరస్సు. ఆ సరస్సు పరిసరాలలో అనేక కుందేళ్ళు నివసించేవి. ఆ సరస్సులో నీళ్ళు తాగడానికి ప్రతిరోజూ ఎన్నో ఏనుగులు వచ్చేవి. అలా వచ్చినప్పుడు వాటి కాళ్ళ కింద పడి చిన్న చిన్న కుందేళ్ళు చచ్చిపోతుండేవి. కొండలలాంటి ఏనుగులను కుందేళ్ళు ఏమి చేయగలుగుతాయి? రోజూ చచ్చిపోతున్న కుందేళ్ళను చూసి, మిగిలిన కుందేళ్ళు ఏడుస్తూ ఉండేవి. ఒకరోజు కుందేళ్ళన్నీ కలిసి వాటి రాజైన శిలాముఖుడి దగ్గరికి వెళ్ళాయి. కుందేళ్ళను చూసి రాజు ‘‘ఏమిటి? ఇంతమంది కలిసి ఒక్కసారిగా వచ్చారు. ఏమిటి విషయం?’’అన్నాడు. ‘‘మహారాజా! మా బాధలను ఏమని చెప్పాలి? ఈ సరస్సు దగ్గరికి రోజూ నీళ్ళు తాగడానికి ఎన్నో ఏనుగులు వస్తున్నాయి. వాటి కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఆ ఏనుగులకు కొండంత శరీరం ఉంది. మేం చూస్తే ఎలుకలలాంటి శరీరాలు ఉన్నవాళ్ళం, వాటిని నిలువరించడం మా వల్ల కాదు కాబట్టి కుందేళ్ళు చనిపోకుండా ఉండడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్తారని మీ వద్దకు వచ్చాం’’ అని కుందేళ్ళన్నీ చెప్పాయి. కుందేళ్ళ బాధలు విన్న రాజు ఎంతగానో బాధపడ్డాడు. వాటి ఏడుపు చూసి తాను కూడా ఏడ్చేశాడు. ఎంతోసేపు ఆలోచించాడు. కాని కొండల్లాంటి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలో రాజుకీ అర్థం కాలేదు. ‘‘నన్ను క్షమించండి, నాకూ ఈ విషయంలో ఏమీ తోచడం లేదు’’ అని శిలాముఖుడు రాజు అన్నాడు. ఇంతలో అక్కడే కూర్చుని అందరి మాటలు వింటున్న విజయుడు అనే ఒక ముసలి కుందేలు ‘‘ఒక ఉపాయం ఉంది మహారాజా! అంది. ‘‘ఓహో! విజయుడుగారు మీరా! మా అందరికంటే వయసులో పెద్ద కాబట్టి మీకు తెలివి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి’’ అన్నాడు శిలాముఖుడు. ‘‘ప్రభూ! ఇక మీరేమి విచారించకండి. నేను నా బుద్ధి బలంతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాను. ఆ ఏనుగులు ఈ సరస్సుకు రాకుండా చేస్తాను.’’ అని అంది. విజయుని మాటలు విన్న మిగిలిన కుందేళ్ళు ఎంతో ఆనందించాయి.మర్నాడు విజయుడు ఉదయమే వెళ్ళి చంద్ర సరస్సు పక్కనే కూర్చుని, ఏనుగుల రాకకోసం ఎదురుచూస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత ఏనుగుల గుంపు చంద్ర సరస్సు దగ్గరికి వచ్చింది. ఏనుగుల రాజు ముందుగా సరస్సులో దిగి స్నానం చేయడానికి వెళుతున్నాడు... ‘‘గజరాజా! ఆగు! ఈ చంద్రసరస్సులో అడుగుపెట్టకు!’’ అని విజయుడు పెద్దగా అన్నాడు. ఆ మాటలకు ఒక్కసారిగా ఏనుగుల రాజు ఆగిపోయి చుట్టూ వెతికాడు. కొండపై కూర్చున్న కుందేలు కనిపించింది. ‘‘ఓరీ! నీవా నా తోకంత లేవు! నన్ను అడ్డగించేది? ఎవడు నీవు? ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను సరస్సులోకి రాకుండా వద్దనడానికి నీకెంత ధైర్యం?’’ అని ఏనుగుల రాజు కోపంగా ప్రశ్నించింది. ‘‘ఓయీ! గజరాజా! విను! నేను విజయుడను. చంద్రుడు మాకు మహారాజు. నేను ఆయన దూతగా ఇక్కడికి వచ్చాను. మా మహారాజు చెప్పిన మాటలను నీకు చెప్పాను. ఈ సరస్సులో నీవు దిగకూడదు. స్నానం చేయకూడదు. ఇది మా మహారాజు చంద్రుడి ఆజ్ఞ’’ అంది విజయుడు. ‘‘ఈ సరస్సు చంద్రమహారాజుదా! ‘‘ఓహో!’’అని మనసులో అనుకుంది గజరాజు. ‘‘గజరాజా ఇంకా విను! మా మహారాజు నీకు చెప్పమని కొన్ని విషయాలు చెప్పాడు’’ అంది విజయుడు. ‘‘ఏమా విషయాలు? నాకు చెప్పండి!’’ అంది గజరాజు. ‘‘గజరాజా! ప్రతిరోజూ నీవూ, నీ పరివారమూ ప్రతిరోజూ ఈ చంద్ర సరస్సుకు వస్తూ ఉండడం మా కుందేళ్ళకు ప్రాణ సంకటంగా మారింది. మీ పెద్దపెద్ద కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఈ విషయం తెలిసి మా మహారాజు తను చెప్పాల్సిన మాటలను నాకు చెప్పి ఇక్కడికి పంపాడు. ఆ మాటలను విను... ‘‘గజరాజా! ఈ సరస్సుకు కాపు కాస్తున్న నా పరివారమైన కుందేళ్లను నీవు, నీ ఏనుగుల గుంపు నిర్దాక్షిణ్యంగా తొక్కి చంపుతున్నారు. నాకు నీ మీద పట్టరాని కోపం ఏర్పడింది. నిన్నూ, నీ జాతిని నా చంద్రాయుధంతో ఒక్క క్షణంలో చంపి వేయగలను. నా మాటను కాదని నీవు మళ్ళీ ఈ చంద్రసరస్సు తీరానికి వస్తే మాత్రం నా చంద్రాయుధాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది నా ఆజ్ఞ. బతుకు మీద ఆశ ఉంటే మళ్ళీ ఈ సరస్సు ఛాయలకు కూడా రాకూడదు’’ అని విజయుడు తన మహారాజు చెప్పిన మాటలను వినిపించింది. ‘బతుకు మీద ఆశ ఉంటే’ అన్న మాటలు విన్న గజరాజు వణికిపోయి ‘మహారాజు తలచుకుంటే ఏమైనా చేయగలడు’ అని అనుకుని, ‘అయ్యా! దూతగారూ! మీ మహారాజుకు నా నమస్కారాలు. ఇది నేను తెలియక చేసిన తప్పు! మీ మహారాజు ఆజ్ఞాపించినట్లుగానే నేను ఇకముందు ఈ చంద్ర సరస్సుకు రావడం మానేస్తాను. నన్ను క్షమించమని మీ మహారాజుగారికి తెలియజేయండి.’’ అని చంద్రుడి దూతతో (విజయుడితో) గజరాజు విన్నవించుకుంది. ‘‘సరే! ఇది మీ మొదటి తప్పుగా భావించి నిన్ను మన్నించమని చెబుతాను.’’ అంది విజయుడు. మర్నాటి నుండి చంద్ర సరస్సు ఛాయలకు కూడా రావడం మానేశాయి ఏనుగులు. విజయుడిని కుందేళ్ల రాజు శిలాముఖుడు ఎంతగానో అభినందించాడు. చూశారు కదా! కండబలం లేకపోయినా బుద్ధిబలంతో కుందేలు కొండలాంటి శరీరం ఉన్న ఏనుగులను కట్టడి చేయగలిగింది. -
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!
లైఫ్ బుక్: వాణీకపూర్ మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ. చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను. నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది! కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను. ‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది! -
అరణ్యం: కుందేలుకు సంతోషం కలిగితే...?
మగ కుందేళ్లను బక్స్, ఆడ కుందేళ్లను డాస్ అంటారు! కుందేళ్లు ఎలాంటి ప్రదేశంలో అయినా జీవించగలవు. గడ్డి మైదానాలు, వర్షారణ్యాలు, చివరకు ఎడారుల్లో కూడా అవి బతగ్గలవు! ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి! కుందేళ్లు సంవత్సరంలో మూడుసార్లు బిడ్డల్ని కంటాయి. వీటి పిల్లలను కిట్స్ అంటారు. పుట్టినప్పుడు వీటికి చూపు ఉండదు. ఒంటిమీద బొచ్చు కూడా ఉండదు! వీటి దృష్టికోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఇవి తమ వెనుక ఉన్నవాటిని కూడా తల తిప్పకుండానే చూడగలవు! కుందేళ్లకు ఇరవై ఎనిమిది పళ్లుంటాయి. ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి గుండె నిమిషానికి 130 నుంచి 325 సార్లు కొట్టుకుంటుంది! వీటికి ఆనందం వస్తే నానా హంగామా చేస్తాయి. ఎగురుతాయి, ఎత్తులెక్కి దూకుతాయి, అడ్డదిడ్డంగా పరుగులు తీస్తాయి, కాళ్లు నేలకేసి టపటపా కొడుతుంటాయి! కుందేళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. తోడు లేకపోతే విసిగిపోతాయవి! కొన్నిసార్లు ఆహారమే కుందేళ్ల పాలిట విషమవుతూ ఉంటుంది. ఎందుకంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే అదే విషమై ప్రాణాలు తీస్తుంది. అందుకే గట్టిగా ఉండే ఆహారాన్ని ముట్టవు కుందేళ్లు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గడ్డి, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి వాటినే తింటూ ఉంటాయి! మీసాలు మాకూ ఉన్నాయోచ్! పక్షులకు కూడా మీసాలుంటాయా అని ఆశ్చర్యం వేయడం లేదూ దీన్ని చూస్తుంటే! అయితే ఇవి మీసాలు కాదు... కొమ్ములు. పైగా ఒకటి, రెండు కాదు... మూడున్నాయి! అందుకే దీన్ని త్రీ వ్యాటిల్డ్ బెల్ బర్డ్ అంటారు. ఆడ బెల్ బర్డ్స్‌కి ఇలా కొమ్ములు ఉండవు. మగవాటికి మాత్రమే ఉంటాయి. దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షులు ముప్ఫై సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. వీటి ముక్కు చుట్టూ వచ్చే మూడు కొమ్ములు పది సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. సాధారణంగా ఈ కొమ్ములు కిందికి వేళ్లాడుతున్నట్టుగా ఉంటాయి. కానీ భయపడినప్పుడు, కోప్పడినప్పుడు, పాట పాడుతున్నప్పుడు నిటారుగా అవుతుంటాయి. అలాంటప్పుడు వాటి పరిమాణం కూడా కాస్త పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పక్షులన్నింటిలోకీ గట్టిగా అరవగలిగేవి ఇవే. వీటి అరుపు కిలోమీటరు దూరం వరకూ స్పష్టంగా వినిపిస్తుంది. తమ జంట విషయంలో వీటికి స్వార్థం చాలా ఎక్కువ. ఇతర మగ పక్షి కనుక తనతో జతకట్టిన ఆడపక్షి దగ్గరకు వస్తే, దాని చెవిలో గట్టిగా అరిచి వెళ్లగొట్టేస్తాయి మగ బెల్ బర్డ్స్. మనిషయినా పక్షి అయినా జెలసీ సహజమే అన్నమాట!