మూర్ఖపు ఏనుగులు - తెలివైన కుందేళ్లు
పంచతంత్ర కథ
పూర్వం కాశీపట్టణానికి ఉత్తర దిశలో ఉన్న అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. దాని పేరు చంద్రసరస్సు. ఆ సరస్సు పరిసరాలలో అనేక కుందేళ్ళు నివసించేవి. ఆ సరస్సులో నీళ్ళు తాగడానికి ప్రతిరోజూ ఎన్నో ఏనుగులు వచ్చేవి. అలా వచ్చినప్పుడు వాటి కాళ్ళ కింద పడి చిన్న చిన్న కుందేళ్ళు చచ్చిపోతుండేవి. కొండలలాంటి ఏనుగులను కుందేళ్ళు ఏమి చేయగలుగుతాయి? రోజూ చచ్చిపోతున్న కుందేళ్ళను చూసి, మిగిలిన కుందేళ్ళు ఏడుస్తూ ఉండేవి.
ఒకరోజు కుందేళ్ళన్నీ కలిసి వాటి రాజైన శిలాముఖుడి దగ్గరికి వెళ్ళాయి. కుందేళ్ళను చూసి రాజు ‘‘ఏమిటి? ఇంతమంది కలిసి ఒక్కసారిగా వచ్చారు. ఏమిటి విషయం?’’అన్నాడు. ‘‘మహారాజా! మా బాధలను ఏమని చెప్పాలి? ఈ సరస్సు దగ్గరికి రోజూ నీళ్ళు తాగడానికి ఎన్నో ఏనుగులు వస్తున్నాయి. వాటి కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఆ ఏనుగులకు కొండంత శరీరం ఉంది. మేం చూస్తే ఎలుకలలాంటి శరీరాలు ఉన్నవాళ్ళం, వాటిని నిలువరించడం మా వల్ల కాదు కాబట్టి కుందేళ్ళు చనిపోకుండా ఉండడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్తారని మీ వద్దకు వచ్చాం’’ అని కుందేళ్ళన్నీ చెప్పాయి.
కుందేళ్ళ బాధలు విన్న రాజు ఎంతగానో బాధపడ్డాడు. వాటి ఏడుపు చూసి తాను కూడా ఏడ్చేశాడు. ఎంతోసేపు ఆలోచించాడు. కాని కొండల్లాంటి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలో రాజుకీ అర్థం కాలేదు. ‘‘నన్ను క్షమించండి, నాకూ ఈ విషయంలో ఏమీ తోచడం లేదు’’ అని శిలాముఖుడు రాజు అన్నాడు.
ఇంతలో అక్కడే కూర్చుని అందరి మాటలు వింటున్న విజయుడు అనే ఒక ముసలి కుందేలు ‘‘ఒక ఉపాయం ఉంది మహారాజా! అంది. ‘‘ఓహో! విజయుడుగారు మీరా! మా అందరికంటే వయసులో పెద్ద కాబట్టి మీకు తెలివి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి’’ అన్నాడు శిలాముఖుడు.
‘‘ప్రభూ! ఇక మీరేమి విచారించకండి. నేను నా బుద్ధి బలంతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాను. ఆ ఏనుగులు ఈ సరస్సుకు రాకుండా చేస్తాను.’’ అని అంది. విజయుని మాటలు విన్న మిగిలిన కుందేళ్ళు ఎంతో ఆనందించాయి.మర్నాడు విజయుడు ఉదయమే వెళ్ళి చంద్ర సరస్సు పక్కనే కూర్చుని, ఏనుగుల రాకకోసం ఎదురుచూస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత ఏనుగుల గుంపు చంద్ర సరస్సు దగ్గరికి వచ్చింది. ఏనుగుల రాజు ముందుగా సరస్సులో దిగి స్నానం చేయడానికి వెళుతున్నాడు... ‘‘గజరాజా! ఆగు! ఈ చంద్రసరస్సులో అడుగుపెట్టకు!’’ అని విజయుడు పెద్దగా అన్నాడు. ఆ మాటలకు ఒక్కసారిగా ఏనుగుల రాజు ఆగిపోయి చుట్టూ వెతికాడు. కొండపై కూర్చున్న కుందేలు కనిపించింది. ‘‘ఓరీ! నీవా నా తోకంత లేవు! నన్ను అడ్డగించేది? ఎవడు నీవు? ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను సరస్సులోకి రాకుండా వద్దనడానికి నీకెంత ధైర్యం?’’ అని ఏనుగుల రాజు కోపంగా ప్రశ్నించింది.
‘‘ఓయీ! గజరాజా! విను! నేను విజయుడను. చంద్రుడు మాకు మహారాజు. నేను ఆయన దూతగా ఇక్కడికి వచ్చాను. మా మహారాజు చెప్పిన మాటలను నీకు చెప్పాను. ఈ సరస్సులో నీవు దిగకూడదు. స్నానం చేయకూడదు. ఇది మా మహారాజు చంద్రుడి ఆజ్ఞ’’ అంది విజయుడు.
‘‘ఈ సరస్సు చంద్రమహారాజుదా! ‘‘ఓహో!’’అని మనసులో అనుకుంది గజరాజు. ‘‘గజరాజా ఇంకా విను! మా మహారాజు నీకు చెప్పమని కొన్ని విషయాలు చెప్పాడు’’ అంది విజయుడు.
‘‘ఏమా విషయాలు? నాకు చెప్పండి!’’ అంది గజరాజు. ‘‘గజరాజా! ప్రతిరోజూ నీవూ, నీ పరివారమూ ప్రతిరోజూ ఈ చంద్ర సరస్సుకు వస్తూ ఉండడం మా కుందేళ్ళకు ప్రాణ సంకటంగా మారింది. మీ పెద్దపెద్ద కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఈ విషయం తెలిసి మా మహారాజు తను చెప్పాల్సిన మాటలను నాకు చెప్పి ఇక్కడికి పంపాడు. ఆ మాటలను విను...
‘‘గజరాజా! ఈ సరస్సుకు కాపు కాస్తున్న నా పరివారమైన కుందేళ్లను నీవు, నీ ఏనుగుల గుంపు నిర్దాక్షిణ్యంగా తొక్కి చంపుతున్నారు. నాకు నీ మీద పట్టరాని కోపం ఏర్పడింది. నిన్నూ, నీ జాతిని నా చంద్రాయుధంతో ఒక్క క్షణంలో చంపి వేయగలను.
నా మాటను కాదని నీవు మళ్ళీ ఈ చంద్రసరస్సు తీరానికి వస్తే మాత్రం నా చంద్రాయుధాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది నా ఆజ్ఞ. బతుకు మీద ఆశ ఉంటే మళ్ళీ ఈ సరస్సు ఛాయలకు కూడా రాకూడదు’’ అని విజయుడు తన మహారాజు చెప్పిన మాటలను వినిపించింది.
‘బతుకు మీద ఆశ ఉంటే’ అన్న మాటలు విన్న గజరాజు వణికిపోయి ‘మహారాజు తలచుకుంటే ఏమైనా చేయగలడు’ అని అనుకుని, ‘అయ్యా! దూతగారూ! మీ మహారాజుకు నా నమస్కారాలు. ఇది నేను తెలియక చేసిన తప్పు! మీ మహారాజు ఆజ్ఞాపించినట్లుగానే నేను ఇకముందు ఈ చంద్ర సరస్సుకు రావడం మానేస్తాను. నన్ను క్షమించమని మీ మహారాజుగారికి తెలియజేయండి.’’ అని చంద్రుడి దూతతో (విజయుడితో) గజరాజు విన్నవించుకుంది.
‘‘సరే! ఇది మీ మొదటి తప్పుగా భావించి నిన్ను మన్నించమని చెబుతాను.’’ అంది విజయుడు.
మర్నాటి నుండి చంద్ర సరస్సు ఛాయలకు కూడా రావడం మానేశాయి ఏనుగులు. విజయుడిని కుందేళ్ల రాజు శిలాముఖుడు ఎంతగానో అభినందించాడు.
చూశారు కదా! కండబలం లేకపోయినా బుద్ధిబలంతో కుందేలు కొండలాంటి శరీరం ఉన్న ఏనుగులను కట్టడి చేయగలిగింది.