Panchatantra story
-
పంచతంత్రం: కథన బలం.. కదన నీతి!!
కథ అంటే నీతి.. కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! బాల్యంలో కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. పంచతంత్రాలను బోధిస్తూ, ప్రపంచంలో ఎవరితో ఎలా నడచుకోవాలో బోధిస్తాయి. చిన్నప్పుడు విన్న కథన బలమే... ఆ కాల్పనిక శక్తే పెద్దయ్యేంతవరకూ...ఆ మాటకొస్తే పెద్దయ్యాక కూడా తెలివితేటలను పెంపొందిస్తాయి. ఊహలతోనే వ్యూహాలను నెరుపుతాయి. ఈ కథల ద్వారానే కదా ఆ నాడు విష్ణుశర్మ.. మూర్ఖులు, ఎందుకూ పనికిరాని వారిగా పేరు పొందిన రాజకుమారులను ప్రయోజకులను చేసింది. వారికి ఆయన బోధించిన మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అపరిక్షిత కారకం... అంటే ఏమీ పరీక్ష చేయకుండానే పనిలోకి దిగడం, ఇతరుల చెడు కోరడం. ఈ కథలు వింటూనే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి. మిత్రలాభం, మిత్రభేదానికి చెందిన ఒక కథ చెప్పుకుందాం ఇప్పుడు.. కలసి ఉంటే కలదు సుఖం మగధ దేశంలో మందారవతి అనే వనం. ఆ వనంలో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా కాలం గడుపుతున్నాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ వనంలో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది. బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే ఎలాగైనా సరే దాని మాంసం తినాలనుకుంది నక్క. వెంటనే లేడి దగ్గరకు వెళ్ళి దానితో మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని దొంగేడుపులు ఏడ్చింది నక్క. నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది. వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి ఇది గమనించింది. నక్కను గురించి వివరాలడిగింది. లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనిదని, తనతో స్నేహంకోరి వచ్చిందని కాకితో చెప్పింది. అంతా విన్న కాకి, మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. అయినా సరే, తమాయించుకుంటూ... అదేంటి మిత్రమా, అలాగంటావు? నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా...? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది. ఇక అప్పటి నుంచి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితోపాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపునిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చాటుగా వలపన్నాడు. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్కను చూసి, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది. మేతకు వెళ్లిన తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల. ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని, తాను సమయం చూసి అరవగానే లేచి పరుగుతీయమని, అప్పటికి అంతకుమించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల. లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే, అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ... వనంలోకి వెళ్లిపోయింది కాకి. ఈ కథ సారాంశం ఏమిటంటే... కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అలాగే, ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుందనే విషయాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. పునఃకథనం: డి.వి.ఆర్. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
నీలిరంగు నక్క
పంచతంత్ర కథ పూర్వం దండకారణ్యంలో ఒక నక్క ఉండేది. ఆ నక్క అరణ్యాన్ని ఆనుకొని ఉన్న ఊరిలో రాత్రివేళ వెళ్లి దొరికిన తిండి తిని, కడుపు నింపుకునేది. ఒకరోజు అది రాత్రంతా తిరిగి ఆహారం తిని అడవికి బయలుదేరింది. ఊరి చివర చాకిరేవులో దానికి ఒక పెద్ద బాన కనిపించింది. వెళ్ళి నీళ్ళు తాగుదామని ఆ నక్క ఆ బానలోకి తొంగిచూసి పొరపాటున అందులో పడిపోయింది. ఆ బాన నిండా నీలిరంగు నీళ్ళున్నాయి. నక్క ఆ బానలో నుండి బయటికి రాలేకపోయింది. చాకలి వచ్చే సమయానికి నక్క చచ్చిపోయినట్లు నటించింది. కొంతసేపటికి చాకలి వచ్చి బానలో చచ్చిపోయిందనుకున్న నక్కను చూసి తీసి బయట పడేశాడు. కిందపడగానే గభాలున లేచి నక్క అడవిలోకి పరుగుతీసింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే దాని శరీరం అంతా నీలిరంగులో మెరిసిపోతోంది. తన రంగు చూసుకుని ఎంతో మురిసిపోయిన నక్క ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. వెంటనే అది తన తోటి నక్కలను పిలిచి ‘‘మిత్రులారా! నాకు నిన్న రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఈ నీలిరంగును ప్రసాదించి, ఈ అడవికి రాజును చేశాడు. నాకు ఎన్నో శక్తులను కూడా ఇచ్చాడు. మీరందరూ ఇక ముందు సుఖంగా ఉండాలనుకుంటే నేను ఈ అడవికి రాజును అని గుర్తించండి’’ అని ప్రకటించింది. తమ జాతివాడు అడవికి రాజవుతున్నాడని నక్కలన్నీ ఎంతో ఆనందపడి, వెంటనే నీలిరంగు నక్కను అడవికి రాజుగా ప్రకటించి దండోరా వేశాయి. విషయం తెలుసుకున్న సింహాలు, పులులు, తోడేళ్ళు, ఏనుగులు ఇలా ఒకటేమిటి? అడవిలోని చిన్నా పెద్దా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. నీలిరంగు నక్కను చూసి, నిజంగానే దేవుడు ఆ నక్కకు నీలిరంగు ప్రసాదించాడని, సింహంతో సహాఅన్ని జంతువులు నమ్మాయి. అన్ని జాతుల జంతువులు ఆ నీలిరంగు నక్కకు సన్మానం చేశాయి. పులులు, సింహాలు కూడా నన్ను సన్మానం చేశాయంటే నేను వాటికంటే నిజంగానే గొప్పవాడిని అని గర్వంతో విర్రవీగి పోయింది. నీలిరంగు నక్క వెంటనే ఒక మంత్రివర్గాన్ని ప్రకటించింది. సింహాన్ని మంత్రిగా, ఏనుగును న్యాయమూర్తిగా, పులిని సేనానాయకుడిగా, ఎలుకను ఆహరమంత్రిగా...ఇలా అన్ని జాతుల నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చింది. నక్కజాతికి మాత్రం ఒక్క పదవినీ ఇవ్వలేదు. సమావేశం అయిపోయిన తర్వాత జంతువులన్నీ ఎవరి తావులకు వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి నక్కజాతి ఒక్కటే మిగిలింది. అందులోంచి ఒక ముసలి నక్క ముందుకు వచ్చి నీలిరంగు నక్కతో ఇలా అంది. ‘‘అయ్యా! మీరు మనకు శత్రువులైన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. కాని మన నక్క జాతికి ఒక్క పదవినీ ఇవ్వలేదు. మీరు నక్క జాతిని ఆదరించాలి. ఆపద సమయంలో వారే మీకు సహాయపడతారు’’ అంది. అందుకు నీలిరంగు నక్క అధికార గర్వంతో ‘‘నువ్వు వయసులో పెద్దవాడివి కావచ్చు. కాని బుద్ధిలో మాత్రం ఎంతో అల్పుడిగా కనబడుతున్నావు. శత్రుపక్షం వారికి పదవులు ఇస్తే ఇక వారినుండి మనకు ఎలాంటి ముప్పు ఉండదు. అంతేకాకుండా మన నక్కజాతిలో గొప్పవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీరంతా నేను రాజునైనందుకు సంతోషించండి.’’ అంది. నీలిరంగు నక్క మాటలు విన్న నక్కలన్నీ ఎంతో బాధపడి, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కొన్నాళ్ళకు నక్కలన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ‘‘మన జాతి వాడు రాజు అయ్యాడంటే సంతోషంగానే ఉంది. కానీ ప్రతిరోజూ మనల్ని మిగతా జాతి వాళ్ళకంటే హీనంగా చూడడం బాగాలేదు. గతంలో సింహం రాజుగా ఉంటే మనం మంత్రులుగా వెలిగిపోయాం. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి దాపురించింది. దీనికంతటికీ కారణమైన ఆ నక్క రాజుకు మనం బుద్ధి చెప్పాల్సిందే’’ అని ముసలి నక్క అన్నది. దానికి మిగతా నక్కలన్నీ ‘సై’ అన్నాయి. ఓ రోజు సాయంత్రంపూట నక్కలన్నీ వెళ్ళి నీలిరంగు నక్క ఇంటిముందు చేరి పెద్దగా ఊళవేయడం ఆరంభించాయి. ఆ ఊళలకు నీలిరంగు నక్క ఎంతో ఆనందపడిపోయింది. తన జాతి స్వభావమైన ఊళవేయడం విని దాని మనసు పులకించిపోయింది. ‘‘నేను ఊళవేయడం మాని ఎంతకాలమైందో?’’ అనుకుంటూ ఇంటి బయటికి వచ్చి తాను కూడా తన జాతితో కలిసి ఊళ వేయడం ఆరంభించింది. ఇలా ఒక్కసారిగా నక్కలన్నీ ఊళవేస్తుండడం విని, మిగతా జంతుజాతులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడే ఉండి చూస్తున్న సింహం ఆశ్చర్యపడి ‘‘అదేంటి? మిగతా నక్కల మాదిరిగా ఈ నీలిరంగు నక్క ఊళవేస్తుంది? దీనికి దైవశక్తులు ఉన్నాయని చెప్పింది కదా? మరి మామూలు నక్కలా ఊళవేయడమేమిటి? అని అనుమానించింది. ఇంతలో జోరుగా వర్షం కురవడం ఆరంభమైంది. వర్షపు నీళ్ళ వల్ల నీలిరంగు నక్క శరీరం మీద ఉన్న నీలిరంగు అంతా కొట్టుకుపోయి, అది మిగతా నక్కల మాదిరిగా మారిపోయింది. వెంటనే నక్కజాతి అంతా విషయాన్ని గ్రహించాయి. ‘‘అరె! ఇది కూడా మన మాదిరి నక్కనే! ఎక్కడో నీలిరంగు వేసుకొని తనకు దేవుడు వరమిచ్చాడని చెప్పి మనల్ని మోసం చేసింది.’’ అని అనుకున్నాయి. అక్కడే ఉన్న మంత్రి సింహం ‘‘అరె! జిత్తులమారి నక్కా! ఇన్నాళ్ళుగా నీవు నీలిరంగు వేసుకొని మమ్మల్నందర్నీ మోసం చేస్తావా? నీకు దేవుడు శక్తులు ఇచ్చాడా? మరి నీ నీలిరంగు ఏమైంది?’’ అని హుంకరించింది. నీలిరంగు నక్క ఒక్కసారి తన శరీరాన్ని చూసుకొని నీలిరంగు లేకపోవడంతో గతుక్కుమంది. ‘‘ఓసి జిత్తులమారి నక్కా! ఇంతమోసం చేస్తావా? అడవికి రాజునైన నన్నే బోల్తా కొట్టించి నన్ను మంత్రిగా చేసి నీవు నా చేత సేవలు చేయించుకుంటావా? ఎంత మోసకారి నక్కవు నీవు... నీ పని పట్టాల్సిందే’’ అంటూ సింహం ఒక్క ఉదుటున నక్క మీద పడి దాని గొంతు పట్టి చంపేసింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు విడిచింది. నక్కలన్నీ ఆ సంఘటనను చూసి ‘‘తగిన శాస్తి జరిగింది సొంత జాతిని కాదని శత్రు జాతిని చేరదీస్తే ఇలాగే ఉంటుంది.’’ అని అనుకున్నాయి. చూశారు కదా! ఎవరైనా సరే తన జాతివారిని, తన బంధువర్గాన్ని చేరదీయాలి. తన వాళ్ళను కాదని శత్రువులను చేరదీస్తే ఏనాటికైనా ముప్పు తప్పదు! -
మూర్ఖపు ఏనుగులు - తెలివైన కుందేళ్లు
పంచతంత్ర కథ పూర్వం కాశీపట్టణానికి ఉత్తర దిశలో ఉన్న అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. దాని పేరు చంద్రసరస్సు. ఆ సరస్సు పరిసరాలలో అనేక కుందేళ్ళు నివసించేవి. ఆ సరస్సులో నీళ్ళు తాగడానికి ప్రతిరోజూ ఎన్నో ఏనుగులు వచ్చేవి. అలా వచ్చినప్పుడు వాటి కాళ్ళ కింద పడి చిన్న చిన్న కుందేళ్ళు చచ్చిపోతుండేవి. కొండలలాంటి ఏనుగులను కుందేళ్ళు ఏమి చేయగలుగుతాయి? రోజూ చచ్చిపోతున్న కుందేళ్ళను చూసి, మిగిలిన కుందేళ్ళు ఏడుస్తూ ఉండేవి. ఒకరోజు కుందేళ్ళన్నీ కలిసి వాటి రాజైన శిలాముఖుడి దగ్గరికి వెళ్ళాయి. కుందేళ్ళను చూసి రాజు ‘‘ఏమిటి? ఇంతమంది కలిసి ఒక్కసారిగా వచ్చారు. ఏమిటి విషయం?’’అన్నాడు. ‘‘మహారాజా! మా బాధలను ఏమని చెప్పాలి? ఈ సరస్సు దగ్గరికి రోజూ నీళ్ళు తాగడానికి ఎన్నో ఏనుగులు వస్తున్నాయి. వాటి కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఆ ఏనుగులకు కొండంత శరీరం ఉంది. మేం చూస్తే ఎలుకలలాంటి శరీరాలు ఉన్నవాళ్ళం, వాటిని నిలువరించడం మా వల్ల కాదు కాబట్టి కుందేళ్ళు చనిపోకుండా ఉండడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్తారని మీ వద్దకు వచ్చాం’’ అని కుందేళ్ళన్నీ చెప్పాయి. కుందేళ్ళ బాధలు విన్న రాజు ఎంతగానో బాధపడ్డాడు. వాటి ఏడుపు చూసి తాను కూడా ఏడ్చేశాడు. ఎంతోసేపు ఆలోచించాడు. కాని కొండల్లాంటి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలో రాజుకీ అర్థం కాలేదు. ‘‘నన్ను క్షమించండి, నాకూ ఈ విషయంలో ఏమీ తోచడం లేదు’’ అని శిలాముఖుడు రాజు అన్నాడు. ఇంతలో అక్కడే కూర్చుని అందరి మాటలు వింటున్న విజయుడు అనే ఒక ముసలి కుందేలు ‘‘ఒక ఉపాయం ఉంది మహారాజా! అంది. ‘‘ఓహో! విజయుడుగారు మీరా! మా అందరికంటే వయసులో పెద్ద కాబట్టి మీకు తెలివి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి’’ అన్నాడు శిలాముఖుడు. ‘‘ప్రభూ! ఇక మీరేమి విచారించకండి. నేను నా బుద్ధి బలంతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాను. ఆ ఏనుగులు ఈ సరస్సుకు రాకుండా చేస్తాను.’’ అని అంది. విజయుని మాటలు విన్న మిగిలిన కుందేళ్ళు ఎంతో ఆనందించాయి.మర్నాడు విజయుడు ఉదయమే వెళ్ళి చంద్ర సరస్సు పక్కనే కూర్చుని, ఏనుగుల రాకకోసం ఎదురుచూస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత ఏనుగుల గుంపు చంద్ర సరస్సు దగ్గరికి వచ్చింది. ఏనుగుల రాజు ముందుగా సరస్సులో దిగి స్నానం చేయడానికి వెళుతున్నాడు... ‘‘గజరాజా! ఆగు! ఈ చంద్రసరస్సులో అడుగుపెట్టకు!’’ అని విజయుడు పెద్దగా అన్నాడు. ఆ మాటలకు ఒక్కసారిగా ఏనుగుల రాజు ఆగిపోయి చుట్టూ వెతికాడు. కొండపై కూర్చున్న కుందేలు కనిపించింది. ‘‘ఓరీ! నీవా నా తోకంత లేవు! నన్ను అడ్డగించేది? ఎవడు నీవు? ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను సరస్సులోకి రాకుండా వద్దనడానికి నీకెంత ధైర్యం?’’ అని ఏనుగుల రాజు కోపంగా ప్రశ్నించింది. ‘‘ఓయీ! గజరాజా! విను! నేను విజయుడను. చంద్రుడు మాకు మహారాజు. నేను ఆయన దూతగా ఇక్కడికి వచ్చాను. మా మహారాజు చెప్పిన మాటలను నీకు చెప్పాను. ఈ సరస్సులో నీవు దిగకూడదు. స్నానం చేయకూడదు. ఇది మా మహారాజు చంద్రుడి ఆజ్ఞ’’ అంది విజయుడు. ‘‘ఈ సరస్సు చంద్రమహారాజుదా! ‘‘ఓహో!’’అని మనసులో అనుకుంది గజరాజు. ‘‘గజరాజా ఇంకా విను! మా మహారాజు నీకు చెప్పమని కొన్ని విషయాలు చెప్పాడు’’ అంది విజయుడు. ‘‘ఏమా విషయాలు? నాకు చెప్పండి!’’ అంది గజరాజు. ‘‘గజరాజా! ప్రతిరోజూ నీవూ, నీ పరివారమూ ప్రతిరోజూ ఈ చంద్ర సరస్సుకు వస్తూ ఉండడం మా కుందేళ్ళకు ప్రాణ సంకటంగా మారింది. మీ పెద్దపెద్ద కాళ్ళ కిందపడి ఎన్నో కుందేళ్ళు చనిపోతున్నాయి. ఈ విషయం తెలిసి మా మహారాజు తను చెప్పాల్సిన మాటలను నాకు చెప్పి ఇక్కడికి పంపాడు. ఆ మాటలను విను... ‘‘గజరాజా! ఈ సరస్సుకు కాపు కాస్తున్న నా పరివారమైన కుందేళ్లను నీవు, నీ ఏనుగుల గుంపు నిర్దాక్షిణ్యంగా తొక్కి చంపుతున్నారు. నాకు నీ మీద పట్టరాని కోపం ఏర్పడింది. నిన్నూ, నీ జాతిని నా చంద్రాయుధంతో ఒక్క క్షణంలో చంపి వేయగలను. నా మాటను కాదని నీవు మళ్ళీ ఈ చంద్రసరస్సు తీరానికి వస్తే మాత్రం నా చంద్రాయుధాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది నా ఆజ్ఞ. బతుకు మీద ఆశ ఉంటే మళ్ళీ ఈ సరస్సు ఛాయలకు కూడా రాకూడదు’’ అని విజయుడు తన మహారాజు చెప్పిన మాటలను వినిపించింది. ‘బతుకు మీద ఆశ ఉంటే’ అన్న మాటలు విన్న గజరాజు వణికిపోయి ‘మహారాజు తలచుకుంటే ఏమైనా చేయగలడు’ అని అనుకుని, ‘అయ్యా! దూతగారూ! మీ మహారాజుకు నా నమస్కారాలు. ఇది నేను తెలియక చేసిన తప్పు! మీ మహారాజు ఆజ్ఞాపించినట్లుగానే నేను ఇకముందు ఈ చంద్ర సరస్సుకు రావడం మానేస్తాను. నన్ను క్షమించమని మీ మహారాజుగారికి తెలియజేయండి.’’ అని చంద్రుడి దూతతో (విజయుడితో) గజరాజు విన్నవించుకుంది. ‘‘సరే! ఇది మీ మొదటి తప్పుగా భావించి నిన్ను మన్నించమని చెబుతాను.’’ అంది విజయుడు. మర్నాటి నుండి చంద్ర సరస్సు ఛాయలకు కూడా రావడం మానేశాయి ఏనుగులు. విజయుడిని కుందేళ్ల రాజు శిలాముఖుడు ఎంతగానో అభినందించాడు. చూశారు కదా! కండబలం లేకపోయినా బుద్ధిబలంతో కుందేలు కొండలాంటి శరీరం ఉన్న ఏనుగులను కట్టడి చేయగలిగింది. -
మూర్ఖపు కోతులు- అమాయకపు పక్షి
పంచతంత్ర కథ పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీముఖం అనే ఓ పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుపక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. రోజూ ఉదయాన్నే సూచీముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేది. ఓసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. మంట వెలిగించడం రాదు. మరి ఎలా?’’ అని ఆ కోతులు ఆలోచిస్తున్నాయి. మధ్యాహ్నమంతా ఎండబాగానే ఉన్నా రాత్రవుతున్నాకొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి. కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునే వాళ్ళు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కాని మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా? దాంతో అవి తమలో తాము ఎంతో మదనపడిపోతున్నాయి. సూచీముఖం రోజూ కోతుల ఈ తంతునంతా రోజూ కనిపెడుతూనే ఉంది. రాత్రి పూట మిణుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలోంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అనే అనుకున్నాయి. ఓరోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మిణుగురుపురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోశాయి. మిణుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. సూచీముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా గమనిస్తోంది. దానికి నవ్వొచ్చింది. ‘ఈ కోతులు ఎంత తెలివి తక్కువవి! మిణుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నట్టున్నాయి. పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి’ అని తనలో తనే నవ్వుకుంది. రోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మిణుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలికాచుకుంటున్నాయి. సూచీముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. ‘‘అయ్యో! కోతులారా! మీరు చలికాచుకుంటున్నది నిజంగా మంట కాదు. అవి మిణుగురు పురుగులు! ఆ పురుగులు శరీరం నుండి వెలువడేది వెలుగు మాత్రమే. ఆ వెలుగుకు మీరు వేడిమి ఉంటుందనుకొని భ్రమ పడుతున్నారు. కట్టెపుల్లలను కాల్చితే మంటవస్తుంది. ఆ మంటకు వేడి ఉంటుంది. అంతేకాని! ఈ మిణుగురు పురుగులకు వేడిమి ఎక్కడిది?’’ అంది నవ్వుతూ. కోతులన్నీ సూచీముఖం చెప్పిన మాటలు విన్నాయి. ‘‘ఈ పక్షి ఏమిటి? మాకు సలహాలు ఇస్తోంది?’’ అని అనుకున్నాయి. మళ్ళీ సూచీముఖం ఇలా అంది. ‘‘కోతులారా! ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలికాచుకున్నారు గదా! అక్కడ చూడండి! ఇంకా నిప్పు ఉంటుంది. అందులో కొన్ని కట్టెపుల్లలు తెచ్చి వేయండి. అవి రాజుకొని మంట వస్తుంది. మీకు చలి బాధ తీరుతుంది.’’ అంది. కోతులన్నీ సూచీముఖం వైపు ఆశ్చర్యంగా, అసహనంగా చూశాయి.సూచీముఖం మళ్ళీ ఇలా అంది. ‘‘ ఇంకా చూస్తారేం! మీరు ఎంతసేపు ఆ మిణుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం? అక్కడ వేడిమి ఉండదు? అని అంది. కోతులకు కోపం నసాళానికి అంటింది. వాటిలో ఒకటి తెలివిగా సూచీముఖంతో ‘‘ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదూ!’’ అని అడిగింది. తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో సూచీముఖం ఒళ్ళు మరచి పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా! అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఉదుటున సూచీముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ‘ఓరి భడవా! మేము ఇంత పెద్ద జంతువులం. నీవేమో వేలెడంత లేవు! అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెబుతున్నావా. నీకున్నపాటి బుద్ధి మాకు లేదా ఏమిటి?’’ అని కోతులు కోపంగా అని, తమకు మంచి చెప్పబోయిన సూచీముఖం మెడపట్టుకొని పిసికి చంపేశాయి! కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు. సలహా ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు. పైగా వారివల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు, బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదంటే సూచీముఖానికి పట్టిన లాంటి గతే మంచివారికీ పడుతుంది. నీతి: మూర్ఖులకు మంచి చెప్పినా ముప్పు ముంచుకు రావచ్చు!