మూర్ఖపు కోతులు- అమాయకపు పక్షి | Opinionated monkeys - innocent bird | Sakshi
Sakshi News home page

మూర్ఖపు కోతులు- అమాయకపు పక్షి

Published Sun, May 25 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

మూర్ఖపు కోతులు- అమాయకపు పక్షి

మూర్ఖపు కోతులు- అమాయకపు పక్షి

 పంచతంత్ర కథ
పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీముఖం అనే ఓ పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుపక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. రోజూ ఉదయాన్నే సూచీముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేది. ఓసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. మంట వెలిగించడం రాదు. మరి ఎలా?’’ అని ఆ కోతులు ఆలోచిస్తున్నాయి.

మధ్యాహ్నమంతా ఎండబాగానే ఉన్నా రాత్రవుతున్నాకొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి. కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునే వాళ్ళు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కాని మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా? దాంతో అవి తమలో తాము ఎంతో మదనపడిపోతున్నాయి.

 సూచీముఖం రోజూ కోతుల ఈ తంతునంతా రోజూ కనిపెడుతూనే ఉంది. రాత్రి పూట మిణుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలోంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అనే అనుకున్నాయి. ఓరోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మిణుగురుపురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోశాయి. మిణుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి.

 సూచీముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా గమనిస్తోంది. దానికి నవ్వొచ్చింది. ‘ఈ కోతులు ఎంత తెలివి తక్కువవి! మిణుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నట్టున్నాయి. పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి’ అని తనలో తనే నవ్వుకుంది. రోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మిణుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలికాచుకుంటున్నాయి.

 సూచీముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. ‘‘అయ్యో! కోతులారా! మీరు చలికాచుకుంటున్నది నిజంగా మంట కాదు. అవి మిణుగురు పురుగులు! ఆ పురుగులు శరీరం నుండి వెలువడేది వెలుగు మాత్రమే. ఆ వెలుగుకు మీరు వేడిమి ఉంటుందనుకొని భ్రమ పడుతున్నారు. కట్టెపుల్లలను కాల్చితే మంటవస్తుంది. ఆ మంటకు వేడి ఉంటుంది. అంతేకాని! ఈ మిణుగురు పురుగులకు వేడిమి ఎక్కడిది?’’ అంది నవ్వుతూ. కోతులన్నీ సూచీముఖం చెప్పిన మాటలు విన్నాయి.

 ‘‘ఈ పక్షి ఏమిటి? మాకు సలహాలు ఇస్తోంది?’’ అని అనుకున్నాయి. మళ్ళీ సూచీముఖం ఇలా అంది. ‘‘కోతులారా! ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలికాచుకున్నారు గదా! అక్కడ చూడండి! ఇంకా నిప్పు ఉంటుంది. అందులో కొన్ని కట్టెపుల్లలు తెచ్చి వేయండి. అవి రాజుకొని మంట వస్తుంది. మీకు చలి బాధ తీరుతుంది.’’ అంది. కోతులన్నీ సూచీముఖం వైపు ఆశ్చర్యంగా, అసహనంగా చూశాయి.సూచీముఖం మళ్ళీ ఇలా అంది. ‘‘ ఇంకా చూస్తారేం! మీరు ఎంతసేపు ఆ మిణుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం? అక్కడ వేడిమి ఉండదు? అని అంది. కోతులకు కోపం నసాళానికి అంటింది. వాటిలో ఒకటి తెలివిగా సూచీముఖంతో ‘‘ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదూ!’’ అని అడిగింది.

తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో సూచీముఖం ఒళ్ళు మరచి పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా! అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఉదుటున సూచీముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ‘ఓరి భడవా! మేము ఇంత పెద్ద జంతువులం. నీవేమో వేలెడంత లేవు! అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెబుతున్నావా. నీకున్నపాటి బుద్ధి మాకు లేదా ఏమిటి?’’ అని కోతులు కోపంగా అని, తమకు మంచి చెప్పబోయిన సూచీముఖం మెడపట్టుకొని పిసికి చంపేశాయి!
 

కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు. సలహా ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు. పైగా వారివల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు, బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదంటే సూచీముఖానికి పట్టిన లాంటి గతే మంచివారికీ పడుతుంది.
 నీతి: మూర్ఖులకు మంచి చెప్పినా ముప్పు ముంచుకు రావచ్చు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement