నీలిరంగు నక్క | Panchatantra story of Blue color fox | Sakshi
Sakshi News home page

నీలిరంగు నక్క

Published Sat, Nov 15 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

నీలిరంగు నక్క

నీలిరంగు నక్క

పంచతంత్ర కథ
పూర్వం దండకారణ్యంలో ఒక నక్క ఉండేది. ఆ నక్క అరణ్యాన్ని ఆనుకొని ఉన్న ఊరిలో రాత్రివేళ వెళ్లి దొరికిన తిండి తిని, కడుపు నింపుకునేది. ఒకరోజు అది రాత్రంతా తిరిగి ఆహారం తిని అడవికి బయలుదేరింది. ఊరి చివర చాకిరేవులో దానికి ఒక పెద్ద బాన కనిపించింది. వెళ్ళి నీళ్ళు తాగుదామని ఆ నక్క ఆ బానలోకి తొంగిచూసి పొరపాటున అందులో పడిపోయింది. ఆ బాన నిండా నీలిరంగు నీళ్ళున్నాయి. నక్క ఆ బానలో నుండి బయటికి రాలేకపోయింది. చాకలి వచ్చే సమయానికి నక్క చచ్చిపోయినట్లు నటించింది.

కొంతసేపటికి చాకలి వచ్చి బానలో చచ్చిపోయిందనుకున్న నక్కను చూసి తీసి బయట పడేశాడు. కిందపడగానే గభాలున లేచి నక్క అడవిలోకి పరుగుతీసింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే దాని శరీరం అంతా నీలిరంగులో మెరిసిపోతోంది. తన రంగు చూసుకుని ఎంతో మురిసిపోయిన నక్క ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. వెంటనే అది తన తోటి నక్కలను పిలిచి ‘‘మిత్రులారా! నాకు నిన్న రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఈ నీలిరంగును ప్రసాదించి, ఈ అడవికి రాజును చేశాడు. నాకు ఎన్నో శక్తులను కూడా ఇచ్చాడు. మీరందరూ ఇక ముందు సుఖంగా ఉండాలనుకుంటే నేను ఈ  అడవికి రాజును అని గుర్తించండి’’ అని ప్రకటించింది.
 
తమ జాతివాడు అడవికి రాజవుతున్నాడని నక్కలన్నీ ఎంతో ఆనందపడి, వెంటనే నీలిరంగు నక్కను అడవికి రాజుగా ప్రకటించి దండోరా వేశాయి. విషయం తెలుసుకున్న సింహాలు, పులులు, తోడేళ్ళు, ఏనుగులు ఇలా ఒకటేమిటి? అడవిలోని చిన్నా పెద్దా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. నీలిరంగు నక్కను చూసి, నిజంగానే దేవుడు ఆ నక్కకు నీలిరంగు ప్రసాదించాడని, సింహంతో సహాఅన్ని జంతువులు నమ్మాయి. అన్ని జాతుల జంతువులు ఆ నీలిరంగు నక్కకు సన్మానం చేశాయి. పులులు, సింహాలు కూడా నన్ను సన్మానం చేశాయంటే నేను వాటికంటే నిజంగానే  గొప్పవాడిని అని గర్వంతో విర్రవీగి పోయింది.
 
నీలిరంగు నక్క వెంటనే ఒక మంత్రివర్గాన్ని ప్రకటించింది. సింహాన్ని మంత్రిగా, ఏనుగును న్యాయమూర్తిగా, పులిని సేనానాయకుడిగా, ఎలుకను ఆహరమంత్రిగా...ఇలా అన్ని జాతుల నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చింది. నక్కజాతికి మాత్రం ఒక్క పదవినీ ఇవ్వలేదు.
 
సమావేశం అయిపోయిన తర్వాత జంతువులన్నీ ఎవరి తావులకు వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి నక్కజాతి ఒక్కటే మిగిలింది. అందులోంచి ఒక ముసలి నక్క ముందుకు వచ్చి నీలిరంగు నక్కతో ఇలా అంది. ‘‘అయ్యా! మీరు  మనకు శత్రువులైన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. కాని మన నక్క జాతికి ఒక్క పదవినీ ఇవ్వలేదు. మీరు నక్క జాతిని ఆదరించాలి. ఆపద సమయంలో వారే మీకు సహాయపడతారు’’ అంది.
 
అందుకు నీలిరంగు నక్క అధికార గర్వంతో ‘‘నువ్వు వయసులో పెద్దవాడివి కావచ్చు. కాని బుద్ధిలో మాత్రం ఎంతో అల్పుడిగా కనబడుతున్నావు. శత్రుపక్షం వారికి పదవులు ఇస్తే ఇక వారినుండి మనకు ఎలాంటి ముప్పు ఉండదు. అంతేకాకుండా మన నక్కజాతిలో గొప్పవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీరంతా నేను రాజునైనందుకు సంతోషించండి.’’ అంది.
 నీలిరంగు నక్క మాటలు విన్న నక్కలన్నీ ఎంతో బాధపడి, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి.
 
కొన్నాళ్ళకు నక్కలన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ‘‘మన జాతి వాడు రాజు అయ్యాడంటే సంతోషంగానే ఉంది. కానీ ప్రతిరోజూ మనల్ని మిగతా జాతి వాళ్ళకంటే హీనంగా చూడడం బాగాలేదు. గతంలో సింహం రాజుగా ఉంటే మనం మంత్రులుగా వెలిగిపోయాం. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి దాపురించింది. దీనికంతటికీ కారణమైన ఆ నక్క రాజుకు మనం బుద్ధి చెప్పాల్సిందే’’ అని ముసలి నక్క అన్నది. దానికి మిగతా నక్కలన్నీ ‘సై’ అన్నాయి.
 
ఓ రోజు సాయంత్రంపూట నక్కలన్నీ వెళ్ళి నీలిరంగు నక్క ఇంటిముందు చేరి పెద్దగా ఊళవేయడం ఆరంభించాయి. ఆ ఊళలకు నీలిరంగు నక్క ఎంతో ఆనందపడిపోయింది. తన జాతి స్వభావమైన ఊళవేయడం విని దాని మనసు పులకించిపోయింది. ‘‘నేను ఊళవేయడం మాని ఎంతకాలమైందో?’’ అనుకుంటూ ఇంటి బయటికి వచ్చి తాను కూడా తన జాతితో కలిసి ఊళ వేయడం ఆరంభించింది. ఇలా ఒక్కసారిగా నక్కలన్నీ ఊళవేస్తుండడం విని, మిగతా జంతుజాతులన్నీ అక్కడికి చేరుకున్నాయి.
 
అక్కడే ఉండి చూస్తున్న సింహం ఆశ్చర్యపడి ‘‘అదేంటి? మిగతా నక్కల మాదిరిగా ఈ నీలిరంగు నక్క ఊళవేస్తుంది? దీనికి దైవశక్తులు ఉన్నాయని చెప్పింది కదా? మరి మామూలు నక్కలా ఊళవేయడమేమిటి? అని అనుమానించింది.
 ఇంతలో జోరుగా వర్షం కురవడం ఆరంభమైంది. వర్షపు నీళ్ళ వల్ల నీలిరంగు నక్క శరీరం మీద ఉన్న నీలిరంగు అంతా కొట్టుకుపోయి, అది మిగతా నక్కల మాదిరిగా మారిపోయింది. వెంటనే నక్కజాతి అంతా విషయాన్ని గ్రహించాయి.
 
‘‘అరె! ఇది కూడా మన మాదిరి నక్కనే! ఎక్కడో నీలిరంగు వేసుకొని తనకు దేవుడు వరమిచ్చాడని చెప్పి మనల్ని మోసం చేసింది.’’ అని అనుకున్నాయి. అక్కడే ఉన్న మంత్రి సింహం ‘‘అరె! జిత్తులమారి నక్కా! ఇన్నాళ్ళుగా నీవు నీలిరంగు వేసుకొని మమ్మల్నందర్నీ మోసం చేస్తావా? నీకు దేవుడు శక్తులు ఇచ్చాడా? మరి నీ నీలిరంగు ఏమైంది?’’ అని హుంకరించింది.
 
నీలిరంగు నక్క ఒక్కసారి తన శరీరాన్ని చూసుకొని నీలిరంగు లేకపోవడంతో గతుక్కుమంది.
 ‘‘ఓసి జిత్తులమారి నక్కా! ఇంతమోసం చేస్తావా? అడవికి రాజునైన నన్నే బోల్తా కొట్టించి నన్ను మంత్రిగా చేసి నీవు నా చేత సేవలు చేయించుకుంటావా? ఎంత మోసకారి నక్కవు నీవు... నీ పని పట్టాల్సిందే’’ అంటూ సింహం ఒక్క ఉదుటున నక్క మీద పడి దాని గొంతు పట్టి చంపేసింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు విడిచింది. నక్కలన్నీ ఆ సంఘటనను చూసి ‘‘తగిన శాస్తి జరిగింది సొంత జాతిని కాదని శత్రు జాతిని చేరదీస్తే ఇలాగే ఉంటుంది.’’ అని అనుకున్నాయి.
 చూశారు కదా! ఎవరైనా సరే తన జాతివారిని, తన బంధువర్గాన్ని చేరదీయాలి. తన వాళ్ళను కాదని శత్రువులను చేరదీస్తే ఏనాటికైనా ముప్పు తప్పదు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement