మొసలి అస్వస్థత | A story of a sick Crocodile | Sakshi
Sakshi News home page

మొసలి అస్వస్థత

Jan 26 2025 5:54 AM | Updated on Jan 26 2025 6:01 AM

A story of a sick Crocodile

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. 

తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా.  

అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో!  ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. 

ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా  మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా  వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. 

అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు  సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి.  

తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది.  ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. 

అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. 

అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement