మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం... | journey another world ... | Sakshi
Sakshi News home page

మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం...

Published Thu, May 15 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం...

మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం...

పాఠశాలలకు సెలవు రోజులు. తిరిగి బడులు తెరిచే సమయానికి ఎన్నో అద్భుతమైన ప్రాంతాలను సంద ర్శించాలనుకునేవారికి వన్యప్రాణి కేంద్రాలు సరైన ఎంపిక. మన దేశంలో అభయారణ్యాలుగా పేరుపొందిన ప్రాంతాలు మన దేశంలో ప్రతి రాష్ర్టంలోనూ ఉన్నాయి. వాటిలో కొన్ని అభయారణ్యాల గురించి తెలుసుకుందాం. దగ్గరలో ఉన్న వన్యప్రాణి కేంద్రాలనైనా దర్శించాలనే ఆలోచనలకు ఈ వేసవి సెలవుల్లో ఓ రూపమిద్దాం...
 
 అప్పటిదాకా పుస్తకాల్లో పులి, సింహం, ఏనుగు, జింక, నక్క.... ఇలా ఎన్నో బొమ్మలను చూసిన పిల్లలు కళ్లెదురుగా ఆ జంతువులు కదలాడుతుంటే ఆనందంతో కేరింతలు కొడతారు. జంతువుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతారు. ఈ వేసవిని మరింత వేడుకగా జరుపుకున్నామని సంబరపడతారు.
 
 గిర్ సింహాలకు ఇల్లు...

 ఆఫ్రికా మినహా సింహాలు నివాసం ఉండే చోటు ప్రపంచమంతా వెతికినా కనపడదు అనుకునేవారికి సరైన సమాధానం చూపుతుంది ‘గిర్ జాతీయ అభయారణ్యం.’ మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ సింహాల వనం. గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఆసియాజాతి సింహాలకు ఇల్లు లాంటిది. సింహాలకు అత్యంత సురక్షితమైన ఈ వనం 1412 చ.కి.మీలలో ఉండగా, మరో 1153 చ.కి.మీ శాంక్చ్యురీకి కేటాయించారు. 1913లో 20 సింహాలున్న ఈ ప్రాంతంలో 2010 నాటికి వీటి సంఖ్య 411కు చేరింది. జింకల ఉత్పత్తిలో అతిపెద్ద స్థావరంగా పిలిచే ఈ ప్రాంతంలో  32 వేల జింకలు ఉన్నాయి. చిరుతలు 300కు పైగా, 40కి పైగా సరీసృపాలు, 250కి పైగా పక్షి జాతులు, 2 వేలకు పైగా ఇతర జంతుజాలాలు గిర్‌లో సందడిచేస్తుంటాయి.
   
పర్యాటకులు.. నక్షత్ర తాబేళ్లను, కొండచిలువలు, నక్కలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను, గద్దలు, .. మొదలైనవాటినెన్నింటినో తమ కెమెరాలలో బంధించుకోవచ్చు.
 
ఇలా వెళ్లాలి
రోడ్డుమార్గాన: జునాగఢ్ పట్టణం నుంచి 55 కి.మీ, అహ్మదాబాద్ నుంచి 348 కి.మీ, రాజ్‌కోట్ నుంచి 156 కి.మీ.
రైల్వేస్టేషన్: అహ్మదాబాద్/ రాజ్‌కోట్/ జునాగఢ్
విమానాశ్రయం: రాజ్‌కోట్ / అహ్మదాబాద్
 
ఇవి చూడవచ్చు
గిర్ నేషనల్ పార్క్ చూసిన తర్వాత జునాగఢ్ ప్రాంత చరిత్రను తెలుసుకోవచ్చు. ఇక్కడి రాజకోటను, నాటి దేవాలయాలను, మ్యూజియాన్ని సందర్శించవచ్చు.
 
 పెరియార్  నేషనల్ పార్క్
 
పడమటి కనుమల్లో కేరళ- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సుమారు 350 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం. కేరళలోని దర్శనీయ ప్రదేశాలలో అత్యంత ముఖ్యమైన ఈ ప్రాంతం ఇడుక్కి జిల్లాలో ఉంది. దశాబ్దాల తరబడి పర్యాటకులను అలరిస్తోన్న ఈ జాతీయవనాన్ని 1978లో కేరళ ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. పెరియార్ నదిపై 1895లో జలాశయం నిర్మించడంతో ఏర్పడిన సరస్సుల నీటి అందాలతోనూ, పరుచుకున్న పచ్చదనంతోనూ ఈ ప్రాంత పర్యటన మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తోంది. పెరియార్ శాంక్చ్యురీలో గల సరస్సులో పడవ మీద ప్రయాణిస్తూ, ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్ శాంక్చురీలో సుమారు 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుతపులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు.. పర్యాటకులను అలరిస్తున్నాయి.
 
కొచ్చి పట్టణానికి 185 కి.మీ, కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కి.మీ దూరంలో ‘తేక్కడి’ అనే ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా వాసికెక్కింది. పెరియార్ నదిలో బోటు షికారు చేసేవారు అడవిలో సంచరించే పులులు, ఏనుగులు, జింకలను చూడవచ్చు. సరస్సులో నీటిపై వాలి ఉండే చెట్టు కొమ్మలు.. వాటిపై వాలే వివిధ రకాల పక్షలు మనకు ఆనందానుభూతులను కలిగిస్తాయి. ఇక్కడి కోతుల అల్లరి చేష్టలు పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. ఇక్కడ బస చేయాలనుకునే పర్యాటకుల కోసం సౌకర్యవంతమైన కాటేజీలు, రిసార్టులు ఉన్నాయి.
     
తేక్కడిలోని రిసార్టుల్లో కేరళ ఆయుర్వేద కేంద్రాలకు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆయుర్వేద తైలాలతో శరీరానికి మర్దన చేయించుకునేందుకు నిత్యం వందల మంది వస్తుంటారు.
    
ఇక్కడి రిసార్టుల్లో కేరళ వంటకాలు నోరూరిస్తుంటాయి.
    
ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు పెరియార్ నేషనల్ పార్క్ ఒక్కసారైనా సందర్శించాలి.

 పెరియార్ పార్క్‌కి.. ఇలా వెళ్లాలి
 విమానాశ్రయం: తమిళనాడులోని మదురై. కేరళలోని కొచ్చి.
 రైల్వేస్టేషన్: కొట్టాయం. కొట్టాయం నుంచి తేక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి.
 సందర్శన సమయం: ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 7 గం.ల వరకు.
 
ఇవి చూడచ్చు...
చేస్తూ పచ్చదనాన్ని తిలకించవచ్చు.
బోట్‌లో షికారు  ట్రీ హౌజ్‌లు
 
 రణథంభౌర్ పులుల స్థావరం...
 
ఉత్తరభారత దేశంలో అతిపెద్దది రణథంభౌర్ జాతీయ పార్క్. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. జైపూర్ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న ఈ వన్యప్రాణి అభయారణ్యం పర్యాటకులకు అతిపెద్ద ఆకర్షణీయ ప్రాంతం. ఎంతో మంది వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లకు, ప్రేమికులకు ఈ వనం మరపురాని అనుభూతినిచ్చే ప్రాంతం. రణథంభౌర్ జాతీయ వనం సుమారు 392 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీంట్లో మాన్‌సింగ్ శాంక్చ్యురీ, కైలాదేవి శాంక్చురీ ప్రసిద్ధమైనవి. ఇక్కడ పులులను చాలా దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం ఉంది. పచ్చటి ప్రకృతిని, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తూ, పక్షుల కిలకిలారావాలను వింటూ ఆనంద విహారం చేయవచ్చు.
   
 పులులు, చిరుతలు, హైనాలు, జింకలు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, మొసళ్లు.. ఇలా ఎన్నో జంతువులును ఇక్కడ చూడవచ్చు. కృష్ణ జింకలు, హనుమాన్ లాంగూర్‌లు నీటిని తాగడానికి తరచూ సరస్సు వద్దకు వచ్చి, విశ్రాంతి తీసుకుంటుంటాయి.
 
విరబూసిన పువ్వుల అందాలను తిలకించవచ్చు.
 
సఫారీ టైమ్:
ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 9.30ని.ల వరకు.
 
 ఇలా వెళ్లచ్చు...
 దగ్గరలోని రైల్వేస్టేషన్: సవాయి మాధోపూర్
 దగ్గరలోని విమానాశ్రయం: జైపూర్
 ఇతర చూడదగినవి:  రణథంభౌర్ కోట, జోగీ మహల్‌తో పాటు ఇక్కడ ఉన్న మూడు సరస్సులు.. ప్రధానంగా చూడదగినవి.
 
 కజిరంగా....ఖడ్గమృగాలను చూడాల్సిందే!
 
అతి పెద్ద శక్తిమంతమైన జంతువులలో ఏనుగులు, ఖడ్గమృగాలకు కజిరంగా జాతీయ అభయారణ్యం పేరెన్నిక గన్నది. ఇప్పటి వరకు అనేకలక్షల మంది పర్యాటకులు సందర్శించిన రికార్డు ఈ అభయారణ్యానికి ఉంది. బ్రహ్మపుత్రా న ది ఒడ్డున, అస్సామ్ రాష్ట్రంలో నగావూ జిల్లాలో 430 చ.కి.మీ లలో విస్తరించి ఉంది ఈ జాతీయ వనం.  బలిష్ఠమైన ఏనుగులు, ఖడ్గమృగాలు పచ్చని పచ్చిక మైదానాలలో తిరుగుతుంటాయి.  ఏనుగులు, అడవిదున్నలు, లేళ్లు ఈ వనంలో ఎక్కువ. పక్షుల ఆవాసకేంద్రంగా కూడా కజిరంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలో ఏర్పడిన చిన్న కొలనులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. 1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ సతీమణి మేరీ కర్జన్  ఈ ప్రాంతాన్ని సందర్శించారట. ఆ తర్వాత ఏడాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో కజిరంగా అనే పేరును అధికారులు సూచించారట.
 
వృక్షజాతులు: ఈ అభయారణ్యంలో మూడు రకాల అతిపెద్ద గడ్డి మైదానాలు ఉన్నాయి. వీటిలో బలిష్ఠమైన ఏనుగులు ఉన్నాయి. బ్రహ్మపుత్రా నదికి ఏర్పడిన వరదల వల్ల ఏర్పడిన సారవంతమైన భూములు ఇవి. ఈ వనం కమలాలకు ప్రసిద్ధి. నీటిలో పాకే మొక్కలు, అతి పొడవైన వృక్షాలతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది.
 
కర్బి గ్రామాలలో: అస్సాం  పేరు వినగానే మనకు తేయాకు కళ్లముందు కనిపిస్తుంది. ఇక్కడ తేయాకు, కాఫీ, రబ్బర్ మొక్కల పెంపకం విస్తారంగా జరుగుతుంది. తోటల పెంపకం విశేషాలు దారంతా తెలుసుకుంటూ ముందుకు కదలవచ్చు.
 
 ఇలా వెళ్లాలి...
 విమానాశ్రయం: గౌహతి
 రైల్వేస్టేషన్: ఫర్‌కేటింగ్  బస్సు సదుపాయాలు ఉన్నాయి.
 
 సఫారీలో ఇలా...
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించేవారు  తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి.
     
వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో ముందుగా మాట్లాడి, వన్యప్రాణుల పట్ల ఎలా మెలగాలో... వారి సూచనలు తీసుకోవచ్చు.

పార్క్ నిబంధనలను తప్పక పాటించాలి. నిషేధం ఉన్న ప్రాంతాలలోకి వెళ్లకూడదు.
     
వాహనాలలో ప్రయాణించేటప్పుడు వేగం పోరాదు. శబ్దాలు, జంతువులను కవ్వించే పనులు చేయకూడదు.
     
ఎవరైనా వన్యప్రాణులకు హానితలపెట్టే చర్యలు జరిపినప్పుడు వెంటనే పార్క్ అధికారులకు తెలియజేయాలి.  వన్యప్రాణులకు - మీకు మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి.
     
పార్క్ లేదా అభయారణ్యం నుంచి ఎలాంటి వస్తువులనూ, బయటకు తీసుకురాకూడదు.
     
ఆహారపదార్థాలు జంతువులకు వేయడం, తెచ్చిన పదార్థాల చెత్త అక్కడ వదిలి వేయడం  తగదు.
     
ఏదైనా అభయారణ్యానికి వెళ్లే ముందు వెంట కెమెరా, సన్‌స్క్రీన్ లోషన్, టోపీ... తీసుకెళితే మీ ప్రయాణం  ఆహ్లాదంగా, సౌకర్యంగా సాగుతుంది.
 
 మీ యాత్రానుభవాలను పంపవలసిన చిరునామా:
 విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement