కౌండిన్య అడవిలో పెరిగిన ఏనుగుల సంతతి.. దక్షిణ భారతదేశంలో ఒకేసారి ఏనుగుల గణన
ఎటుచూసినా ఆకాశాన్నంటే పచ్చదనం.. జలజలపారే సెలయేళ్లు.. అడుగడుగునా నీటిగుంటలు.. జీవాలకు సమృద్ధిగా ఆహారం.. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవి. అపారమైన జంతుసంపదకు ఆవాస కేంద్రం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం.
సాక్షి, చిత్తూరు: కౌండిన్య అటవీప్రాంతం వివిధ రకాల జంతుసంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసుకుక్క, దేవాంగపిల్లి, నక్షత్ర తాబేలు, అడవిపిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, రక్తపింజరిలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా వృద్ధిచెందుతోంది. గుంపులుగుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడపా గ్రామాల్లోను స్వైరవిహారం చేస్తున్నాయి.
మూడురోజులు ఏనుగుల గణన
ఏటా మాదిరే ఈ సంవత్సరం మే నెలలో కూడా దక్షిణ భారతదేశంలో ఏనుగులను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకేసారి మూడురోజులు ఈ గణన నిర్వహించారు. మన రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల్ని లెక్కించారు. జిల్లా అటవీప్రాంతంలోని 66 బీట్లలో ఏనుగుల్ని అటవీ సిబ్బంది లెక్కపెట్టారు. తొలిరోజు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్‌జాగ్ విధానంలో లెక్కించారు.
రెండోరోజు కూడా అదే పద్ధతి కొనసాగించారు. చివరిరోజున నీటికుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిఘా వేసి ఏనుగుల్ని లెక్కపెట్టారు. అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, చెట్లను తోసివేయడం, సమూహం, పరిణామం ఆధారంగా వాటిసంఖ్యను లెక్కించారు. కనిపించిన ఏనుగుల ఫొటోలు తీసి, లింగనిర్ధారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు ఏనుగులు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
అందులో కౌండిన్య అటవీప్రాంతంలోనే 100 నుంచి 110 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోంది. గత సంవత్సరం కంటే 10 నుంచి 20 వరకు ఏనుగులు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. కౌండిన్యలో 15 వరకు పిల్ల ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. పిల్ల ఏనుగులు ఉన్నాయంటే వాటి సంతతి బాగా పెరుగుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఈ లెక్కల వివరాలను కేంద్ర అటవీశాఖకు నివేదిస్తారు. కేంద్ర అటవీశాఖ ఏనుగుల సంఖ్యను ప్రకటిస్తుంది.
ఏనుగుల సంచారం ఎక్కువ
ఏటా ఏనుగుల సంఖ్యపై సర్వే చేస్తున్నాం. ఈ ఏడాది టెక్నికల్‌గా సర్వే నిర్వహించాం. ఫ్లగ్ మార్క్స్ ఆధారంగా బ్లాగ్ సర్వే చేశాం. వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. తుది నివేదికను కేంద్ర అటవీశాఖకు అందజేశాం. కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. – చైతన్యకుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో
Comments
Please login to add a commentAdd a comment