ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగే కేమెల్ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే!
బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు.
బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది.
ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment