దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్‌పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్‌లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.
ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.
ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.
అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు.
Comments
Please login to add a commentAdd a comment