Asian countries
-
పెరిగిన డాలర్ విలువ: ఆసియా దేశాలపై ఎఫెక్ట్!
యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత అమెరికా డాలర్ విలువ పెరుగుదల దిశగా పయనిస్తోంది.. గ్లోబల్ కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ప్రభావం చూపుతోంది. అనేక ఆసియా దేశాలు ఈ ప్రభావానికి తీవ్రంగా లోనైనప్పటికీ.. భారతదేశం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలుస్తోంది.గత దశాబ్ద కాలంలో.. భారత్ వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఇతర ఆసియా దేశాలతో పాటు చైనా ఆర్ధిక వ్యవస్థ మందగిస్తే.. ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా పడుతుంది. రూపాయి విలువ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీనిని నిపుణులు 'ఎఫ్ఎక్స్ యుద్ధం' అని సంబోధించారు.గ్లోబల్ కరెన్సీ విలువల తగ్గుదల అనేది.. రాబోయే సంవత్సరాల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ (FX) మార్కెట్లలో ప్రపంచ అస్థిరతను రేకెత్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడటం అనేది ప్రపంచ కరెన్సీ మార్కెట్లో సవాళ్లను పెంచుతుందని చెబుతున్నారు.డాలర్ పెరుగుదలకు కారణం కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సెప్టెంబరులో బేసిస్ పాయింట్ రేటు తగ్గింపుకు సంబంధించిన ఫెడ్ వ్యూహాత్మక పునరాలోచన అని కూడా తెలుస్తోంది. డాలర్ విలువ పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు కూడా దీనివైపు ఆకర్షితులవుతున్నారు.ట్రంప్ విజయం డాలర్‌కు అందించిన స్వల్పకాలిక మద్దతు మాత్రమే. కానీ ప్రపంచ కరెన్సీ మార్కెట్ సంక్లిష్టమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా ఆసియా అంతటా.. చైనాతో సహా ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ఎఫ్ఎక్స్ యుద్ధం తీవ్రతరం కావడం వల్ల వచ్చే నష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రవిభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అయితే ఆటలో మాత్రమే అతను కింగ్ అనిపించుకోవడం లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలోనూ కోహ్లి తనకు తానే సాటి. ఇటీవలే ఐపీఎల్ రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లి నిలిచాడు. టీమిండియా తరపున ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గానూ కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కోహ్లి తర్వాత ఎంఎస్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 40.3 మిలిమిన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. రొనాల్డోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 585 మిలియన్. రొనాల్డో తర్వాత లియోనల్మెస్సీ 462 మంది మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడంలో మరోసారి విఫలమైంది. సీజన్లో మంచి విజయాలు నమోదు చేసినప్పటికి ఆర్సీబీ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టలేదు. అయితే కోహ్లి మాత్రం రెండు సెంచరీలు సహా ఐదు అర్థసెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. చదవండి: కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్ ఉల్ హక్ ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?' -
ప్రపంచ దేశాల్లో రుణ సంక్షోభం.. పన్ను ఎగవేతలను అరికట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది. పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ►కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది. ►ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి. ►2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది. ► పన్ను ఎగవేతలు, ఐఎఫ్ఎఫ్లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది. ►ఐఎఫ్ఎఫ్ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టిందా?
ఆసియా దేశాలు అల్లాడి పోతున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుకుపడుతున్నాయి. భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాలు ఆ వరదల్లో కకావికలమవుతున్నాయి.ఇంకో వైపు విపరీతమైన వేడిగాలులు జీవనదులను ఆవిరి చేసి నీళ్లను మాయం చేసి భూమి అంతటా బీటలు తీసి కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఆసియా వెలవెల బోతోంది. ఆ వానలూ మంచివి కావు. ఈ కాటకాలూ మంచివికావు. మనిషి మంచిగా లేకపోవడం వల్లనే ఈ విపత్తులు దాడులు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని శపిస్తున్నాయి. హఠాత్తుగా కుంభవృష్టి పడుతోంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. బెంగళూరు, చెన్నై, ముంబైతో సహా చాలా ప్రాంతాలు ఒక్క రోజులోనే నీట మునుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం దిక్కుతోచని పరిస్థితి తెస్తోంది. మన దేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కుంభవృష్ఠి వర్షాలతో ఉధృతమైన వరదలతో కకావికలమైపోతున్నాయి. లక్షలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులవుతున్నారు. ఈ వానలు ఎన్నడూ చూడలేదురోయ్ దేవుడా అని జనం మబ్బులవైపు చూసి ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు. అసోంలో బ్రహ్మపుత్ర నది విజృంభణతో వేలాది మంది వరదల్లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మేఘాలు ఒక్కసారిగా విరిగిపోయినట్లు నీటి సంచులు పేలిపోయినట్లు ఒక్క ఉదుటన కుంభవృష్ఠి వానలు పడిపోతున్నాయి. నిముషాల్లోనే అవి జల ప్రళయంలోకి జనాన్ని నెట్టేస్తున్నాయి. ఈ మాయదారి వానలే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నూ వణికించేస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ ప్రాంతంలో 122 సంవత్సరాల్లో ఎన్నడే లేనంతగా భారీ వర్షాలు పడ్డంతో కొన్ని తరాల జనం చూడనంతటి వరదలు ముంచెత్తాయి. చుట్టూరా వరద నీరే. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. ఒక్క బంగ్లాదేశ్ లోనే 40 లక్షల మంది వరదల తాకిడికి అల్లాడిపోయారు. అందులో 16లక్షల మంది చిన్నారులు ఉండడం గమనార్హం. బంగ్లాదేశ్ దేశంలో 75 శాతం భూభాగం సముద్ర మట్టంతో ఇంచుమించు సమానంగా ఉంటుంది. మరో రెండు దశాబ్ధాల్లో మూడొంతులకు పైగా బంగ్లాదేశ్ సముద్రగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన దాయాది దేశం పాకిస్థాన్ లో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది.పాకిస్థాన్ లో 2010లీ వచ్చిన వరదలే బీభత్సమైనవని అనుకుంటే ఈ సారి అంతకు మించి వర్షాలు కుమ్మేశాయి. ఎనిమిది వారాల పాటు అంటే 50 రోజుల పాటు ఏకధాటిగా కుంభవృష్ఠి వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రతీ చోటా వరదలు ముంచెత్తాయి. దేశంలో 150 జిల్లాలుంటే ఏకంగా 110 జిల్లాలను వరదలు ముంచేశాయి. మూడు కోట్ల 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయిదు లక్షల వరకు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో మనుషులు ఉండడానికి అనువైన ఇల్లు ఒక్కటంటే ఒక్కటికూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి సర్వనాశనం అయిపోయింది. వరదల తెచ్చిన సంక్షోభంతో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగిపోయింది. ఆహార కొరత.. దయనీయంగా పరిస్థితి కోట్లాది మందిని ఆహార కొరత వేధిస్తోంది. పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో భారత దేశం నుండి కూరగాయలు,ఇతర ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ ఆలోచిస్తోంది. ఇటు భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ అడగడమే ఆలస్యంగా భారీ ఎత్తున సాయం అందించడానికి సర్వ సన్నద్ధంతో ఉంది. వరదల పాపమా అని 15 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ప్రాధమిక అంచనా. ఆసియాలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన చైనా కూడా భారీ వర్షాలు, వరదల తాకిడికి కుదేలైపోయింది. వాయువ్య చైనాలో భీకర వర్షాలు దండెత్తాయి. వర్షాలు, వరదల తీవ్రతతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూత పడ్డాయి. వీటిలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మూత పడ్డంతో తీవ్రమైన విద్యుత్ కొరత కూడా చైనాను వేధిస్తోంది. క్వింఘాయ్ ప్రావిన్స్ లో వర్షాలు విశ్వరూపమే ప్రదర్శించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు వరదల తీవ్రతకు పెద్ద ఎత్తున రోడ్లు కల్వర్టులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కొట్టుకుపోయాయి. నైరుతి చైనా ప్రాంతంలో లక్షలాది మందికి విద్యుత్ సరఫరా లేదు. దాంతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. 2021లో వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతటి వానలతో చైనా వణికిపోయింది. ఆ వర్షాల ప్రభావంతో గత ఏడాది వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. దాన్నుంచి కోలుకోక ముందే ఇపుడీ వర్షాలు విరుచుకు పడ్డంతో ఈ ఏడాది కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. ఇది చైనా ఆర్దిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశాలున్నాయి. చైనా నుండి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే దేశాలపైనా ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఒక పక్క అతివృష్ణి మరో పక్క అనావృష్ఠి. చూస్తూ ఉండగానే మేఘాలు బద్దలై కుంభవృష్టి వానలు. ఆ వెంటనే అందరినీ ముంచెత్తే వరదలు. మరో పక్క భరించలేని వేడి గాలులు. తట్టుకోలేని కరకు కరవు కాటకాలు. దేన్నీ భరించే పరిస్థితి లేదు. దేన్నీ సహించే ఓపిక లేదు. బతుకులు రోజు రోజుకీ దుర్భరం అయిపోతున్నాయి. ఈ విపరీత ధోరణులకు కారణం వాతావరణంలోని అనూహ్య మార్పులే అంటున్నారు వాతావరణ శాస్త్ర వేత్తలు. ఏళ్ల తరబడి మనుషులు వహిస్తోన్న నిర్లక్ష్యమే ఇపుడు శాపంగా మారిందంటున్నారు వారు. అడ్డగోలుగా అడవులు నరికివేయడం.. అడ్డూ అదుపూ లేకుండా పరిశ్రమలు పెట్టి కాలుష్యాన్ని వెదజల్లేయడం.. పరిమితులకు మించి కర్బన ఉద్గారాలు ఉత్పత్తి చేయడం పచ్చటి ప్రకృతికి నిర్దాక్షిణ్యంగా పొగ బెట్టేయడం వంటి పాపాలు ఏళ్ల తరబడి చేసుకుపోవడం వల్లనే ప్రకృతి గాయపడిందంటున్నారు పర్యావరణ వేత్తలు. ఆ గాయాలతోనే మనిషిపై ప్రకృతి పగబట్టి ఉంటుందని వారు అంటున్నారు. ప్రకృతికి కోపం వస్తే దాన్ని అడ్డుకోవడానికి కానీ తట్టుకోవడానికి కానీ మనిషికి ఉన్న శక్తి సరిపోదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యూరప్ దేశాలు భగ భగ మండిపోతున్నాయని చదువుకున్నాం. బ్రిటన్, ఫ్రాన్స్,ఇటలీ,జర్మనీ,పోర్చుగల్,సెర్బియా వంటి దేశాల్లో జీవనదులు ఎండిపోతున్న విషాద ఘటనల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ సమస్య యూరప్ దేశాలకే కాదు ఆసియా దేశాల్లోనూ తిష్ఠ వేసుకుని కూర్చుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధం అవుతోందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచ మంతా విస్తరించడం ఖాయం అంటున్నారు వారు. ఇంత జరుగుతోన్నా దేశాలు కానీ వాటి పాలకులు కానీ అక్కడి ప్రజలు కానీ గాఢ నిద్ర నుండి మేల్కొనకపోవడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతోందని వారంటున్నారు. ఇది మును ముందు మరింత భయానక పరిణామాలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతోన్న చైనాను మరో వైపు వేడి గాలులు వెంబడించి దెబ్బతీస్తున్నాయంటున్నారు పర్యావరణ వేత్త భాస్కర రెడ్డి. దాని ప్రభావం చైనాపై చాలా తీవ్రంగానే ఉంది. వర్షాభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం..దాని వల్ల కర్మాగారాలు మూతపడ్డం దాని ఫలితంగా ఉత్పత్తులు పడిపోవడం.. అల్టిమేట్ గా ఆర్ధిక వ్యవస్థ చావు దెబ్బతినడం వంటి చెయిన్ రియాక్షన్స్ చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విపత్తులు ..ఇవి తెచ్చే సమస్యలు రాత్రికి రాత్రే రాలేదు. కొన్ని ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలంతా కూడా మనుషులు చేస్తోన్న తప్పిదాల వల్ల పర్యావరణానికి ఎలా తూట్లు పడుతున్నాయో..వాటి కారణంగా రానున్న కాలంలో ఎంతటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రకృతి మానవాళిపై పగబట్టిందంటే దానర్ధం ఏంటి? ప్రకృతిని మనిషి ఇష్టారాజ్యంగా అణచివేస్తున్నాడనే అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకపోతే కొందరి తప్పిదాల వల్ల యావత్ ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. -
రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..
EU Says Cases Of Omicron BA.2: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో మళ్లీ కోవిడ్-19 సబ్‌వేరియంట్ అయిన ఒమిక్రాన్ BA.2 కేసులు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంతటా పెరుగుతున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) తెలిపింది. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్-19 కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. దీంతో భారత ప్రభుత్వం తమ పౌరులను సురక్షితంగా ఉండమని హెచ్చరించడమే కాక మాస్కలు ధరించడం మానేయవద్దని ఆదేశించింది. చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు సంబంధిందచిన కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలో పేర్కొంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే కాక హెచ్చరికలు జారీ చేసింది. ఐదు ఆసియా దేశాల్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు: చైనా: చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అన్ని దేశాల కంటే చైనా కఠినమైన కరోనా ఆంక్షలను విధించింది. పైగా జిరో కోవిడ్ టోలరెన్స్‌ని లక్ష్యంగా ప్రజలపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ చైనా అమలు చేసిన ఆంక్షలన్ని విఫలమయ్యేలా కేసులు రికార్డు స్థాయలో నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో లేని విధంగా కేసులు నమోదవ్వడమే కాక మరణాలు కూడా మొదలయ్యాయి. చైనాలో అనేక నగరాలు నిర్బంధంలోనే ఉన్నాయి. సింగపూర్: సింగపూర్‌లో శనివారం తాజాగా 10,244 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 1,007,158కి చేరుకుంది. ప్రస్తుతం 1,130 బాధితులు ఆసుపత్రులో చికిత్స పొందుతుండగా, 27 బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య సుమారు 1,194కు చేరుకుందని ఆ దేవ హెల్త్ డిపార్టుమెంట్ తెలిపింది. హాంకాంగ్: హాంకాంగ్‌లో శనివారం ఒక్క రోజులో దాదాపు 16,597 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను అదుపు చేసే దిశలో హాంకాంగ్ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తోంది. దక్షిణ కొరియా: కొత్త కోవిడ్ -19 కేసులు శనివారం 4 లక్షల కంటే తక్కువగా నమోదైయ్యాయి. ప్రస్తుతం దాదాపు 381,454 కొత్త కోవిడ్-19 కేసులు అందులో విదేశాల నుంచి వచ్చిన 63 మందితో సహా సుమారు 9,038,938కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కెడిసిఎ) పేర్కొంది. తాజా గణంకాల ప్రకారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి సుమారు 621,328 నుంచి గణనీయంగా తగ్గింది, అయితే కేసుల ఆకస్మిక పెరుగుదల మునుపటి రోజు కంటే అనుహ్యంగా 70 వేల కేసులు పెరుగుదలను సూచిస్తోంది. మరణించిన వారి సంఖ్య 12,101కి చేరుకుంది. మరణాల రేటు 0.13 శాతంగా ఉంది. మయన్మార్: కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ BA.2 చెందిన 31 కేసులు నమోదైయ్యాయని మయన్మార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 15న పరీక్షించిన 31 మంది కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో BA.2 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ దేశంలో సుమారు 608,384 కేసుల మరణాల దాదాపు 19,420 నమోదయ్యాయని నివేదిక తెలిపింది. (చదవండి: చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత) -
భారత్ – మధ్య ఆసియా దేశాల సహకారమే కీలకం!
న్యూఢిల్లీ: మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆయన ఐదు మధ్య ఆసియా దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజ్బకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, టర్కెమెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. ఉజ్బకిస్తాన్తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్‌కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్ది కీలకపాత్రన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. -
అఫ్గాన్ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. అఫ్గాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అఫ్గానిస్తాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. డిక్లరేషన్‌లో ఏముందంటే ? ► అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ► అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ. ► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ► అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు ► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. ► అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి. ► కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. -
ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
ఆసియన్ అమెరికన్లకి బైడెన్ అండ
అట్లాంటా: ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక దాడులు మనసుని కలిచి వేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై అమెరికన్లు అందరూ మౌనం వీడాలని పిలుపునిచ్చారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్ పార్లర్లపై శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మరణించడంతో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు అట్లాంటా పర్యటనకు వచ్చారు. ఎమొరి యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడన్ జాతి వివక్ష దాడులైనా, విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలందరూ మాట్లాడాలని, ప్రతిస్పందించాలని అన్నారు. ‘‘మౌనం వహించడం అన్నది అత్యంత సంక్లిష్టమైనది. మనం అలా ఉండకూడదు’’అని హితవు పలికారు. అంతకు ముందు ఆసియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమలా హ్యారిస్‌లు సమావేశమై చర్చించారు. ఆసియన్ అమెరికన్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసియన్ అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతోందన్న బైడెన్ అమెరికా పౌరులందరూ విద్వేషాలు వీడాలని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక ఆసియన్లపై ఓ విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ‘‘ఆసియన్లపై దాడి చేస్తున్నారు. నిందిస్తున్నారు. వేధిస్తున్నారు. బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వాళ్లని ఏకంగా చంపేస్తున్నారు’’అని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీసుకురానున్న కోవిడ్–19 హేట్ క్రైమ్స్ యాక్ట్‌కి తాను మద్దతునిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేసే వీలు కలుగుతుందని వివరించారు. చూస్తూ ఊరుకోం: కమలా హ్యారిస్ అట్లాంటాలో కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెలిపారు. జాతి వివక్ష, విదేశీయులంటే భయం అమెరికాలో ఎప్పట్నుంచో ఉన్నాయని అన్నారు. తాను, అధ్యక్షుడు ఈ దాడుల్ని చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక దాడులు, వివక్ష ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ అమెరికన్లుగానే గుర్తించాలని, మనలో ఒకరిగా చూడాలని కమలా హ్యారిస్ హితవు పలికారు. -
10 దేశాల్లోని 27 పత్రికల్లో మోదీ వ్యాసం
సింగపూర్: భారత్, ఆసియాన్ దేశాల సంబంధాలు వివాదాలు, విమర్శలకు అతీతమైనవని మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవాన 10 ఆసియాన్ దేశాల అధినేతలు భారత్‌కు అతిథులుగా వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ రాసిన వ్యాసం 10 భాషల్లో, 27 పత్రికల్లో ప్రచురితమైంది. 10 ఆసియాన్ దేశాల్లోని పత్రికలు ఒకే రోజున మోదీ వ్యాసాన్ని ప్రచురించడం విశేషం. ఆసియాన్ దేశాలతో భారత భాగస్వామ్యం, భవిష్యత్తు గురించి మోదీ ఈ వ్యాసంలో రాశారు. ఆసియాన్ దేశాలతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు భారత్ ఎంతో ఆసక్తిగా ఉందని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు. థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనై దేశాల్లో మోదీ వ్యాసం ప్రచురితమైంది. భారత్–ఆసియాన్ 25 ఏళ్ల సంబంధాలను గుర్తుచేసుకుంటూ ఆ దేశాధినేతలందరినీ 69వ గణతంత్రదినోత్సవాన భారత్‌లో కలుసుకోవడం తనకు గౌరవంగా ఉందని మోదీ వ్యాసంలో రాశారు. ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌కు రెండు వేల ఏళ్లకు పైగానే సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆసియాన్ నేతలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శుక్రవారం మలేసియా, లావోస్ ప్రధానులతోపాటు ఇండోనేసియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన వీరంతా శుక్రవారం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం, సంబంధాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. తర్వాత ప్రధాని లావోస్ ప్రధాని సిసౌలిత్‌తో సమావేశం సందర్భంగా ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహభావం, సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో ఆర్థిక సహకారం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తించారు. చైనాకు దీటుగా భారత్ కూడా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని వారు కోరినట్లు విదేశంగా శాఖ తూర్పు విభాగం కార్యదర్శి ప్రీతి సరణ్ వెల్లడించారు. -
చైనాకు ‘ఆసియాన్’ హెచ్చరిక!
న్యూఢిల్లీ: చైనాకు భారత్–ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి. అలాగే భారత ప్రధాని మోదీ ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై చర్చలు జరిపారు. 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా–ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను గురువారం విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి దక్షిణ చైనా సముద్ర ఒప్పందాన్ని అమలుచేయాలని తీర్మానించారు. ఉగ్రవాదుల స్థావరాలు, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాన్ని అనుసరించి సామర్థ్యాలను పెంచుకోవాలని నిర్ణయించారు. ఉగ్ర కట్టడికి సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడంతో పాటు ఇంటర్నెట్, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని అంగీకరించారు. భారత్–ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ..ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. నేడు జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. -
భారత్, చైనా నుంచే నయా బిలియనీర్లు
సాక్షి,న్యూఢిల్లీ: ఆసియా నుంచి బిలియనీర్లుగా ఎదుగుతున్న వారి సంఖ్య తొలిసారిగా అమెరికాను అధిగమించింది. బిలియనీర్ల సంపదలో అమెరికా ఇప్పటికీ ముందున్నా నయా బిలియనీర్ల సంఖ్యలో మాత్రం ఆసియా దేశాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. చైనాలో ప్రతి మూడు వారాలకు ఒక బిలియనీర్ తయారవుతూ ఆసియా సత్తాను చాటుతున్నాడు. ఇదే వేగంతో ఆసియా ముందుకెళితే నాలుగేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక సంపద పోగుపడ్డ ప్రాంతంగా అమెరికాను అధిగమించి ఆసియా ముందుకొస్తుందని యూబీఎస్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ అంచనా వేసింది. ప్రపంచంలో నయా బిలియనీర్లలో 75 శాతం మంది చైనా, భారత్‌ల నుంచే ఆవిర్భవించారని ఈ అంచనా వెల్లడించిది. ప్రపంచ బిలియనీర్లలో ఆసియన్ బిలియనీర్లు 637 కాగా, వీరిలో 117 మంది కొత్తగా బిలియనీర్ల క్లబ్లో చేరారు. తాజా జాబితాలో ఆర్ట్, స్పోర్ట్స్ దిగ్గజాలకు చోటు దక్కడం గమనార్హం. ప్రపంచంలోనే టాప్ 200 ఆర్ట్ కలెక్టర్స్‌లో 75 శాతం బిలియనీర్లున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 140 ప్రముఖ స్పోర్ట్స్ క్లబ్‌లను 109 మంది బిలియనీర్లు నిర్వహిస్తున్నారు. -
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
-
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు పుల్ల వేయడంతో భారత్-చైనాల మధ్య దౌత్య వాతావరణం వేడిక్కింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధ జైష్-ఈ-మొహమ్మద్(జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ పై అంతర్జాతీయ నిషేధం విధించాలని యూఎన్ లో భారత్ చేసిన ప్రపోజల్ కూ చైనా ససేమీరా అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తమవేనంటూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చైనాకు షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని పేర్కొన్న ఇతర ఆసియా దేశాలతో( వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బ్రూనై) భారత్ సంబంధాలను బలపర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ మేరకు అక్టోబర్ లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై సంయుక్త ప్రకటన చేయాలని సింగపూర్ ను భారత్ కోరినట్లు తెలిసింది. అయితే అందుకు ఆ దేశం అందుకు ససేమీరా అన్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉందని సింగపూర్ ఎన్నడూ ప్రకటించలేదు. భూభాగాల వివాదాల్లోకి ప్రవేశించడానికి ఆ దేశం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై హక్కు గురించి జపాన్ తో భారత్ సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడొచ్చు. వియత్నాంతో కలిసి కూడా భారత్ సంయుక్త ప్రకటన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, సంయుక్త ప్రకటన చేయాలనే మనవిపై జపాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దక్షిణ చైనా సముద్రంపై భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాలని గత నెలలో జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు చైనా సముద్రంలో చైనా మాటను కాదని జపాన్ శరవేగంగా ఎదుగుతోంది. దీంతో జపాన్-చైనాల మధ్య కూడా దౌత్యపరంగా వాతావరణం వేడెక్కింది. చైనాపై ఎలాగైనా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్న జపాన్ యూఎస్-2ఐ విమానాల ధరను తగ్గించి భారత్ కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రాగన్ దేశం ఇది మంచి విషయం కాదని వ్యాఖ్యానించింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ జపాన్, వియత్నాంలతో సంబంధాలను బలపర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండటం శుభపరిణామం. చైనా బాధిత దేశాలైన కొన్ని ఆసియా దేశాలతో రక్షణ, భద్రత అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ యత్నిస్తోంది. జపాన్ కూడా వియత్నాంతో సంబంధాలను బలపర్చునే యత్నాలు చేస్తుండటంతో దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా ఆటలు సాగకపోవచ్చు. -
'వచ్చే ఏడాది మా దేశ పర్యటనకు రండి'
-
'వచ్చే ఏడాది మా దేశ పర్యటనకు రండి'
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆహ్వానించారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో సుష్మా ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో పాక్, అప్ఘాన్లతో చేతులు కలిపేందుకు భారత్ సుముఖంగా ఉందని చెప్పారు. అట్టారి సరిహద్దు వద్ద అఫ్ఘాన్ ట్రక్కులకు స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తాము స్నేహ హస్తం అందించామని సుష్మా గుర్తు చేశారు. ఇస్లామాబాద్‌లో హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సులో పాల్గొన్న ఆమె ప్రాంతీయ సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాక్, అప్ఘాన్ ప్రధానులు నవాజ్ షరీఫ్, అష్రాఫ్ ఘనితో పాటు ఆసియా విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ఈ సదస్సుకు వచ్చిన సుష్మా మర్యాదపూర్వకంగా షరీఫ్‌ను కలిశారు. వివిధ అంశాలపై కాసేపు ముచ్చటించారు.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి జరిగే చర్చల్లో భారత్, పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. -
ఆసియా దేశాల్లో శాంతి, అభివృద్ధికి భారత్-చైనాల సహకారం
తిరుపతి తుడా: ఆసియా దేశాల్లో శాంతి స్థాపన, అభివృద్ధికి భారత్, చైనా దేశాలు సహకారం కీలకమైందని, చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ.రంగనాథన్ అన్నారు. భారత్ చైనా సంబంధాలు దృఢమైనవని ఆయన తెలిపారు. ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్హాల్లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీవీ రంగనాథన్ మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య చిన్నపాటి సమ్యలు తలెత్తాయని చెప్పారు. వాటిని అధిగమించి పరస్పరం అభివృద్ధికి సహకరించాల్సిచాల్సిన సమయం ఎంతైనా ఉందన్నారు. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉందన్నారు. భారత్‌కు చైనా సహకారం, చైనాకు భారత్ సహకారం అవరసమన్నారు. ఎస్వీయూ వీసీ ఆచార్య రాజేంద్ర మాట్లాడుతూ ఇరు దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అవగాహనతో కూడిన సహకారం అవసరమన్నారు. భారత్ చైనాల మధ్య బలమైన సత్సంబంధాలు మెరుగుపడి ప్రపంచ శాంతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం పరిశోధన సంస్థలు, రాయబార కేంద్రాలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ. రంగనాథన్‌ను సదస్సులో ఘనంగా సన్మానించారు. -
ఊడ్చేస్తే అవమానించినట్లే!
ఏ ప్రాంతం వారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారో మనకు కొంత తెలుసు. అయితే ఏ ప్రాంతంలో ఎలా తినాలో తెలుసా? తిండిలోనే కాదు, తినడంలో కూడా ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో శైలి. వాటి గురించి తెలుసుకోవడం అందరికీ అవసరమే. ఎందుకంటే... ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి శైలిని ఫాలో అవ్వకపోతే, వారు మనల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. పోర్చుగల్‌లో భోజనం చేసేటప్పుడు... ఆహారంలో ఉప్పు కానీ, మిరియాల పొడి కానీ తక్కువైనా మాట్లాడకూడదు. తీసుకురమ్మని అడగకూడదు. అలా చేస్తే, అది వండిన వారిని అనుమానించినట్టు లెక్క! ైచె నా వారి ఆచారం ప్రచారం... తినడం పూర్తయ్యాక కంచంలో కాస్తయినా ఆహారాన్ని వదిలిపెట్టాలి. మొత్తం ఊడ్చేస్తే... సరిపడనంత ఆహారం పెట్టలేదని అవతలివాళ్లను అవమానించినట్టు లెక్క! చిలీ, బ్రెజిల్ దేశాలో ఎటువంటి ఆహార పదార్థాన్నయినా సరే... చెంచాలు, ఫోర్కులతోనే తినాలి. తినేదాన్ని చేతితో ముడితే మనకు మ్యానర్స్ లేదనుకుంటాను. చివరికి బర్గర్‌ను కూడా స్పూన్‌తో తినాల్సిందే! థాయ్‌లాండ్‌లో ఫోర్కుతో ఆహారాన్ని నోటిలో పెట్టుకోకూడదు. కేవలం స్పూన్తోనే పెట్టుకోవాలి. అలాగే అక్కడ టూత్‌పిక్స్ కూడా వాడకూడదు! భోజనానికి పిలిచినప్పుడు పసుపురంగు పూలు తీసుకెళ్లినా, వాళ్లను భోజనానికి పిలిచినప్పుడు ఏ డైనింగ్ టేబుల్మీదో పసుపురంగు పూలను పెట్టినా... చైనీయులకు చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే... అక్కడ పసుపురంగు అయిష్టతకు చిహ్నం! పెట్టిన ఆహారాన్ని సూపర్‌గా ఉందంటూ పొగడటం ఫ్రాన్స్వారికి అస్సలు నచ్చదట! భోజనం చేసిన వెంటనే గట్టిగా తేన్చడాన్ని కొన్ని ఆసియా దేశాల వారు ప్రశంసగా తీసుకుంటారు! ఆఫ్ఘనిస్తాన్‌లో ఆహారాన్ని ఎంతో గౌరవిస్తారు. తినేటప్పుడు ఏ రొట్టెముక్కో జారి పడితే... దాన్ని తీసి, ముద్దుపెట్టుకుని అప్పుడు తినాలి! ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే... భోజనం అవగానే లేచి వెళ్లిపోవడాన్ని మెక్సికోలో అమర్యాదగా పరిగణిస్తారు! తిన్న తరువాత గిన్నెలు కడిగి, టేబుల్ సర్దేస్తే... మనల్ని మర్యాదస్తులుగా గుర్తిస్తారు ఫిలిప్పీన్స్ వారు!