చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు పుల్ల వేయడంతో భారత్-చైనాల మధ్య దౌత్య వాతావరణం వేడిక్కింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధ జైష్-ఈ-మొహమ్మద్(జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ పై అంతర్జాతీయ నిషేధం విధించాలని యూఎన్ లో భారత్ చేసిన ప్రపోజల్ కూ చైనా ససేమీరా అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తమవేనంటూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చైనాకు షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుంది.
దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని పేర్కొన్న ఇతర ఆసియా దేశాలతో( వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బ్రూనై) భారత్ సంబంధాలను బలపర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ మేరకు అక్టోబర్ లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై సంయుక్త ప్రకటన చేయాలని సింగపూర్ ను భారత్ కోరినట్లు తెలిసింది. అయితే అందుకు ఆ దేశం అందుకు ససేమీరా అన్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉందని సింగపూర్ ఎన్నడూ ప్రకటించలేదు. భూభాగాల వివాదాల్లోకి ప్రవేశించడానికి ఆ దేశం అంతగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై హక్కు గురించి జపాన్ తో భారత్ సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడొచ్చు. వియత్నాంతో కలిసి కూడా భారత్ సంయుక్త ప్రకటన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, సంయుక్త ప్రకటన చేయాలనే మనవిపై జపాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
దక్షిణ చైనా సముద్రంపై భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాలని గత నెలలో జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు చైనా సముద్రంలో చైనా మాటను కాదని జపాన్ శరవేగంగా ఎదుగుతోంది. దీంతో జపాన్-చైనాల మధ్య కూడా దౌత్యపరంగా వాతావరణం వేడెక్కింది. చైనాపై ఎలాగైనా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్న జపాన్ యూఎస్-2ఐ విమానాల ధరను తగ్గించి భారత్ కు విక్రయించాలని నిర్ణయించింది.
దీంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రాగన్ దేశం ఇది మంచి విషయం కాదని వ్యాఖ్యానించింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ జపాన్, వియత్నాంలతో సంబంధాలను బలపర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండటం శుభపరిణామం. చైనా బాధిత దేశాలైన కొన్ని ఆసియా దేశాలతో రక్షణ, భద్రత అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ యత్నిస్తోంది. జపాన్ కూడా వియత్నాంతో సంబంధాలను బలపర్చునే యత్నాలు చేస్తుండటంతో దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా ఆటలు సాగకపోవచ్చు.