న్యూఢిల్లీ: మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆయన ఐదు మధ్య ఆసియా దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును ప్రారంభించారు.
సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజ్బకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, టర్కెమెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు.
అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. ఉజ్బకిస్తాన్‌తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్‌కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్‌తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్‌ది కీలకపాత్రన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment