ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం
అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో భేటీ
జార్జిటౌన్: పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకో వాలని భారత్, గయానా నిర్ణయించాయి. వ్యవసాయం, హైడ్రోకార్బన్లు మొదలుకుని ఫార్మా, డిజిటల్ పేమెంట్ల దాకా 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనికంగా గయానాకు కీలక మద్దతు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం గయానా చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది.
జార్జిటౌన్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, పలువురు మంత్రులు మోదీని స్వయంగా స్వాగతించారు. గత 56 ఏళ్లలో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనతో ఇరు దేశాల మైత్రీ బంధం సుదృఢమవుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. గయానాలో జన్ ఔషధీ కేంద్రం ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు.
ఇరు దేశాల సంబంధాల్లో మోదీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇర్ఫాన్ అలీ అన్నారు. ఆయన్ను నేతల్లో చాంపియన్‌గా అభివర్ణించారు. మోదీ పాలన తీరు అద్భుతమన్నారు. భేటీ అనంతరం నేతలిద్దరూ మొక్కలు నాటారు. గయానా, గ్రెనెడా, బార్బడోస్ ప్రధాను లు కూడా మోదీతో భేటీ అయ్యారు. తర్వాత గయానాలోని భారతీయులతో ప్రధాని భేటీ అయ్యారు. 185 ఏళ్ల కింద అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ఇప్పటికీ దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తున్నారంటూ ప్రశంసించారు. గయానాలో 3.2 లక్షల మందికి పైగా ఎన్నారైలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment