శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశానికి ముందు మోదీ, హయితమ్‌ల కరచాలనం
న్యూఢిల్లీ: భారత్–ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్‌లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు.
పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు.
భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment