Joint Conference
-
విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు. రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్‌పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, భారత్‌లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదిరిన ఎంవోయూలు.. బంగ్లాదేశ్ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్ భారత్ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్ డబ్లింగ్ పనుల్లోనూ, పర్బతీపూర్– కౌనియా రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చేందుకు భారత్ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్ వద్ద 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత ప్లాంట్ మైత్రి యూనిట్–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు. షేక్ హసీనాకు ఘన స్వాగతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. -
ముఖ్యమంత్రులు-న్యాయమూర్తుల సంయుక్త సదస్సు 2022 (ఫొటోలు)
-
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
భారత్ – మధ్య ఆసియా దేశాల సహకారమే కీలకం!
న్యూఢిల్లీ: మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆయన ఐదు మధ్య ఆసియా దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజ్బకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, టర్కెమెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. ఉజ్బకిస్తాన్తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్‌కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్ది కీలకపాత్రన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. -
'దేశంలో న్యాయవ్యవస్థ మెరుగుపడాలి'
ఢిల్లీ: అనవసర చట్టాలను తొలగించి, న్యాయ వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు. ఈ సదస్సుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందా గౌడ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు గైర్హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.