‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు | Conference and the Joint Conference of Chief Ministers and Chief Justices | Sakshi
Sakshi News home page

‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు

Published Fri, Apr 29 2022 5:44 AM | Last Updated on Fri, Apr 29 2022 5:44 AM

Conference and the Joint Conference of Chief Ministers and Chief Justices - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది.

సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్‌వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి.

దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర     ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి.

కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్‌(రిటైర్డ్‌) మధుకర్‌ హీరాలాల్‌ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్‌ 24న చివరిసారిగా    సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్‌ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్‌ మిషన్‌ ఫర్‌     జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్‌ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

నేడు సీజేల సమావేశం
సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్‌వర్క్‌ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement