Vigyan Bhavan
-
Lok sabha elections 2024: ఎన్నికల షెడ్యూల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది. -
69th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అలియా,రణబీర్ సందడి (ఫొటోలు)
-
2014 తర్వాతే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో.. డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు. ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్‌తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది. #WATCH | 10 years ago, there was a competition to do more and more corruption. Big scams took place during that time but the accused were not scared because the system stood by them… After 2014, we worked on a mission mode against corruption, black money: PM Narendra Modi pic.twitter.com/LOqxd6mCbz — ANI (@ANI) April 3, 2023 ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత -
Best Teacher Award: గురు దేవోభవ!
బడి... బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి. ఆ ఒడిలో పిల్లలు హాయిగా అక్షరాలు దిద్దాలి. భవిష్యత్తును బంగారంగా దిద్దుకోవాలి. బిడ్డల భవిష్యత్తును దిద్దే చేతులకు వందనం. ఉపాధ్యాయ వృత్తికి వందనం. వృత్తికి వన్నె తెచ్చిన గురువులకు వందనం. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అంటే విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఓ గుర్తింపు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కానూరు ‘జిల్లా పరిషత్ హైస్కూల్’ ఫిజిక్స్ టీచర్ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సునీతారావు, రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మాది మైసూర్. బాల్యం హైదరాబాద్‌లోనే. ఐదవ తరగతి వరకు సెయింట్ ఆన్స్‌లో చదివాను. ఆరవ తరగతి నుంచి చెన్నై. నా బోధన ప్రస్థానం కర్నాటక రాష్ట్రం తుముకూరులోని టీవీఎస్ అకాడమీలో మూడవ తరగతి టీచర్‌గా మొదలైంది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే నేను చదువు చెబుతూ చదువుకున్నాను. ఉద్యోగం చేస్తూ ఎంఏ ఎకనమిక్స్, ఎంఫిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో డిప్లమో, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాను... ఇలా ఏటా స్కూల్ వెకేషన్‌ని నేను ఏదో ఒక కోర్సుకోసం ప్లాన్ చేసుకునేదాన్ని. నాకిష్టమైన గణితం కోసం చెన్నైలోని రామానుజమ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను. ముప్పై రెండేళ్ల సర్వీస్‌లో నేను పిల్లలకు ఎన్నో నేర్పించాను, అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్నాను. టీచర్ ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న విషయాన్ని చెప్పి పాఠాలు ముగిస్తే సరిపోదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ పాఠం చెప్పాలి. అలాగే ఏ తరగతికి అవసరమైతే ఆ తరగతికి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను థర్డ్ క్లాస్ టీచర్‌గా చేరినా, అవసరమైనప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌కి కూడా పాఠాలు చెప్పాను. పన్నెండో తరగతి టీచర్ అయినా సరే ఒకటవ తరగతి టీచర్ లేనప్పుడు ఆ క్లాస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాఠాన్ని సృజనాత్మకంగా చెప్పాలి. పిల్లలకు ఏ పదాలు అర్థం అవుతున్నాయో ఆ పదాల్లో వివరించాలి. వృత్తి పట్ల గౌరవం, విశ్వాసం ఉండాలి. రూల్స్‌కోసం పని చేసే వృత్తి కాదిది. అవసరమైన విధంగా ఒదిగిపోవాలి. కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రుల కంటే ముందు పసిగట్టగలిగింది టీచర్ మాత్రమే. పేరెంట్స్ వచ్చి చెప్పేవరకు టీచర్ గుర్తించని స్థితిలో ఉండకూడదు. అలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను నేను. వాళ్లతో విడిగా మాట్లాడి, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి కోసం మెంటార్‌గా ఒక టీచర్‌కు బాధ్యత అప్పగించడం ద్వారా ఆ స్టూడెంట్ తిరిగి చదువుమీద మునుపటిలా ధ్యాస పెట్టేవరకు కనిపెట్టి ఉండాలి. అలాంటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంటారు. టీచర్‌గా అత్యంత సంతోష పడే క్షణాలవి. గురుశిష్యుల బంధం విద్యార్థులు అమ్మానాన్న తర్వాత ఆదర్శంగా తీసుకునేది టీచర్నే. అందుకే టీచర్ గౌరవప్రదంగా కనిపించాలి. ఆహార్యం, మాటతీరు, నడవడిక... ప్రతి విషయంలోనూ ఆదర్శనీయంగా ఉండాలి. గురుశిష్యుల బంధం ఉన్నతమైంది. స్టాఫ్‌రూమ్‌లో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. విద్యాబోధనకు అవసరమైన చర్చలే ఉండాలి. అలాగే ప్రతి టీచరూ క్లాస్‌కి వెళ్లే ముందు ఏం చెప్పాలనే విషయం మీద తప్పనిసరిగా హోమ్‌వర్క్ చేయాలి, పాఠం చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పానా లేదా అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే ఒక టీచర్‌గా నా తోటి ఉపాధ్యాయులకు నేను చెప్పగలిగిన మంచిమాట’’ అన్నారు సునీతారావు. పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు! ప్రిన్సిపల్‌గా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కరికులమ్ రూపొందిస్తుంటాను. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాల్సిన తరం ఇది. ఒకప్పటిలా సిలబస్‌కే పరిమితమైతే సరిపోదు. క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యం. విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావం, నిజాయితీ వంటివన్నీ వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏదో ఒకటి ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతుంది. మా దగ్గర స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే విద్యార్థులకు అవసరమైన సెలవులు ఇవ్వడం, వారి కోసం సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పించి పరీక్షలు పెట్టడం వంటి మార్పులు చేశాను. టీచర్ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడమే కాదు, వారి భవిష్యత్తు కలలకు ఒక రూపం ఇవ్వాలి, ఆ కలల సాకారానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి. – సునీతారావు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, సికింద్రాబాద్ సైన్స్ ఎక్కడో లేదు... ‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీస్ మీద íపీహెచ్డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నాను. ప్రత్యామ్నాయం వెతకాలి! సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్ అలా ఫెయిల్ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్ మస్కిటో రిపెల్లెంట్ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్ ఎడ్యుకేషన్‌కి వాటర్ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్ ఇన్స్పైర్ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్ సిటిజన్ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది. – రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నడిపూడి కిషోర్ -
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
న్యూఢిల్లీ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా దేశంలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రూపొందించిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ... ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందుకోసం తన నియోజకవర్గంలోని ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని... ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలా 2016 నాటికి దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను తయారు చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాలు, ఎంపీ ల్యాడ్స నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 1915లో విదేశాల నుంచి స్వదేశం వచ్చిన మహత్మ గాంధీ గ్రామాభివృద్ధికి పాటపడిన తీరును మోడీ వివరించారు. అలాగే గ్రామాల హక్కుల కోసం గాంధీజి పోరాడిన తీరును కూడా ఈ సందర్భంగా మోడీ విశదీకరించారు. గ్రామాభివృద్ధికి గాంధీజీయే మనకు స్పూర్తి ప్రధాత అని అన్నారు. పేదలు, రైతుల కోసమే గ్రామ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించినట్లు చెప్పారు. పేదల అభివృద్దే మన ప్రధాన కల కావాలని మోడీ ఆకాంక్షించారు. -
‘మీ ప్రదర్శన అద్భుతం’
కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు సచిన్ ప్రశంస న్యూఢిల్లీ: ఏకాగ్రతతో లక్ష్యంపై గురిపెడితే అనుకున్నది సాధించవచ్చని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సచిన్ అవార్డులను అందజేశాడు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతం అని ఈ సందర్భంగా సచిన్ ప్రశంసించాడు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు సకీనా ఖాతూన్, దీపా కర్మాకర్, పారాథ్లెట్ రాజిందర్ రహేలును ప్రత్యేకంగా అభినందించాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఖాతూన్, రహేలూలు పారా పవర్ లిఫ్టింగ్‌లో రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరి ప్రదర్శన తనను ఎంతగానే ఆకట్టుకుందని సచిన్ చెప్పాడు. క్రికెట్ దిగ్గజం కాసేపు వారితో ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ పతక విజేతలు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్, స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, స్క్వాష్ ప్లేయర్లు దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్, భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు నెగ్గిన వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేసింది. స్వర్ణం నెగ్గిన వారికి రూ. 20 లక్షలు; రజతాలు సాధించిన వారికి రూ. 10 లక్షలు; కాంస్యాలు గెలుపొందిన వారికి రూ. 6 లక్షల చొప్పున ఇచ్చారు.