‘మీ ప్రదర్శన అద్భుతం’
కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు సచిన్ ప్రశంస
న్యూఢిల్లీ: ఏకాగ్రతతో లక్ష్యంపై గురిపెడితే అనుకున్నది సాధించవచ్చని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సచిన్ అవార్డులను అందజేశాడు.
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతం అని ఈ సందర్భంగా సచిన్ ప్రశంసించాడు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు సకీనా ఖాతూన్, దీపా కర్మాకర్, పారాథ్లెట్ రాజిందర్ రహేలును ప్రత్యేకంగా అభినందించాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఖాతూన్, రహేలూలు పారా పవర్ లిఫ్టింగ్‌లో రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరి ప్రదర్శన తనను ఎంతగానే ఆకట్టుకుందని సచిన్ చెప్పాడు. క్రికెట్ దిగ్గజం కాసేపు వారితో ముచ్చటించాడు.
ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ పతక విజేతలు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్, స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, స్క్వాష్ ప్లేయర్లు దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్, భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు నెగ్గిన వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేసింది. స్వర్ణం నెగ్గిన వారికి రూ. 20 లక్షలు; రజతాలు సాధించిన వారికి రూ. 10 లక్షలు; కాంస్యాలు గెలుపొందిన వారికి రూ. 6 లక్షల చొప్పున ఇచ్చారు.