వాషింగ్టన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికాకు చెందిన నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్‌సీఎల్) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
‘క్రికెట్ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నాడు.
ఎన్‌సీఎల్ తొలి సీజన్‌లో సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్ ప్రసాద్ (భారత్), జహీర్ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్స్ (వెస్టిండీస్), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్‌లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్ ఫార్మాట్‌లో భాగం కానున్నారు.
ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్ ఫార్మాట్‌లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్‌సీఎల్ సిక్స్‌టీ స్ట్రయిక్స్ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో రైనా, దినేశ్ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment