
∙జయసూర్య, సచిన్, ముత్తయ్య మురళీధరన్
‘‘1993లో మురళీధరన్‌ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు.
ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్‌ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం.
మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్‌ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్‌గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్.