టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.
9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.
సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment