
Top 11 Players Who Wear Number 10 Jersey In Cricket: క్రీడల్లో నెంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్‌లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ నెంబర్ 10 జెర్సీకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్ ధరించే జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం. ఆ జెర్సీ ధరిస్తే స్టార్ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్‌లో నెంబర్ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. తన కెరీర్‌లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో 10వ నెంబర్ జెర్సీ ధరించిన కొందరి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
- సాక్షి, వెబ్‌డెస్క్
సచిన్ టెండూల్కర్(టీమిండియా)
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మొదట్లో 99 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్‌తో ఆడాడు. ఇక చివరగా 10వ నెంబర్ జెర్సీతో రిటైర్మెంట్ వరకు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే
క్రెయిగ్ మెక్‌మిలన్(న్యూజిలాండ్)
1997-2007 కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్ మెక్‌మిలన్ మంచి బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. తన 10 ఏళ్ల కెరీర్‌లో ఎక్కువశాతం 10వ నెంబర్ జెర్సీలోనే కనిపించాడు. న్యూజిలాండ్ తరపున 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. ఇక 8 టి20ల్లో ఆడిన మెక్‌మిలన్ 187 పరుగులు సాధించాడు.
స్టువర్ట్ లా(ఆస్ట్రేలియా)
1994-95 మధ్య కాలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా గాయంతో వెనుదిరిగిన సమయంలో అతని స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చాడు స్టువర్ట్ లా. ఇదే అతను ఆడిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఇక క్రికెట్ ఆడినంత కాలం తన కెరీర్‌లో 10వ నెంబర్ జెర్సీని ధరించాడు. ఆసీస్ తరపున 54 వన్డేల్లో 1237 పరుగులు.. ఒక్క టెస్టు మ్యాచ్‌లో 54 పరుగులు సాధించాడు.
చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!
అలెన్ డొనాల్డ్(దక్షిణాఫ్రికా)
దక్షిణాఫ్రికా తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అలెన్ డొనాల్డ్ జెర్సీ నెంబర్ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా డొనాల్డ్ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్‌గా 72 టెస్టులాడిన అలెన్ డొనాల్డ్ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్ రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్ లీగ్‌ల్లో కోచ్‌గా వ్యవహరించాడు.
షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్)
ఆసియా నుంచి చూస్తే క్రికెట్‌లో సచిన్ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్ అయిన ఆటగాడు షాహిద్ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన అఫ్రిది వ్యక్తిగత జీవితంలో వివాదాలకు కొదువ లేకపోయిన.. ఆటలో మాత్రం పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన అఫ్రిది రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు.
చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్‌రూం అద్దానికి అంటించా'
డారెన్ లీమన్(ఆస్ట్రేలియా)
1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్ లీమన్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్ 2004-05 కాలంలో 10వ నెంబర్ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్‌గా సేవలందించిన లీమన్ 2017 బాల్‌టాంపరింగ్ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు.
జెరెయింట్ జోన్స్(ఇంగ్లండ్)
ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా 2004-06 మధ్య కాలంలో సేవలందించిన జెరెయింట్ జోన్స్ తన కెరీర్ మొత్తం జెర్సీ నెంబర్ 10నే ధరించాడు. ఈ కాలంలో అతను ఇంగ్లండ్ తరపున 51 వన్డేల్లో 862 పరుగులు.. 34 టెస్టుల్లో 1172 పరుగులు చేశాడు.
పీటర్ సిడిల్(ఆస్ట్రేలియా)
2019లో ఆస్ట్రేలియా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పీటర్ సిడిల్ .. 2008 అరంగేట్రం నుంచి రిటైర్ అయ్యేవరకు జెర్సీ నెంబర్ 10తోనే ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 67 టెస్టుల్లో 217 వికెట్లు.. 20 వన్డేల్లో 17 వికెట్లు తీశాడు.
శార్దూల్ ఠాకూర్(టీమిండియా)
టీమిండియా నుంచి సచిన్ తర్వాత శార్దూల్ మాత్రమే జెర్సీ నెంబర్ 10 ధరించాడు. అయితే సచిన్ కానుకగా ఉన్న ఆ జెర్సీని ధరించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారడంతో బీసీసీఐ అనధికారికంగా ఆ జెర్సీ నెంబర్‌ను తొలగించింది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న శార్దూల్ 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టి 20లు ఆడాడు.
డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా)
ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న మిల్లర్ కీలక బ్యాటర్‌గా మారాడు. అలెన్ డొనాల్డ్ తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. విధ్వంసకర ఆటకు మారుపేరుగా ఉన్న మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున 137 వన్డేలు.. 95 టి20లు ఆడాడు.
చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు
షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్)
దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ధరించిన 10వ నెంబర్ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్ అఫ్రిది ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. అయితే క్రికెట్‌లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్ ఆ తర్వాత 10వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్‌గా మారిన షాహిన్ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment