ఈసారి నాలుగు లేక ఐదు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు!
మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది.
ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది.
గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment