general elections in india
-
Fourth lok Sabha Elections-1967: కాంగ్రెస్ కోటకు బీటలు
తండ్రి నెహ్రూ వారసురాలిగా 1966లో ప్రధాని పీఠమెక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రజాతీర్పు కోరాల్సిన పరిస్థితి! రాజకీయాల్లో ముక్కుపచ్చలారకపోయినా తొలిసారి ప్రజామోదం పొందడంలో ఆమె సక్సెసయ్యారు. కానీ సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. ధరల పెరుగుదల, మందగించిన వృద్ధి, ఉపాధి కల్పన వంటి సమస్యలకు తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి! చివరికి సొంత పార్టియే బయటకు గెంటినా తట్టుకుని నిలవడమే గాక విపక్షాల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకుని సంకీర్ణ శకానికి తెర తీశారు ఇందిర. ఇలా 1967–70 నాలుగో లోక్‌సభ ఎన్నో సంక్షోభాలకు సాక్షిగా నిలిచింది... చివరి జమిలి ఎన్నికలు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలపై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ మనకిదేమీ కొత్త కాదు. 1967 దాకా వరుసగా నాలుగు పర్యాయాలు దేశమంతటా ఇదే విధానంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడా, ఇక్కడా పూర్తి పదవీకాలం పాటు ఆ పార్టీ ప్రభుత్వాలే రాజ్యమేలాయి. నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్ కోటకు బీటలు మొదలయ్యాయి. ఇందిర సారథ్యంలో పార్టీ అస్మదీయ, తస్మదీయ వర్గాలుగా విడిపోయింది. దాంతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 283 స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతం కూడా 44.72 నుంచి 40కి తగ్గింది. ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. స్వతంత్ర పార్టీ ఏకంగా 44 చోట్ల గెలిచి లోక్‌సభలో అతి పెద్ద విపక్షంగా నిలిచింది. అఖిల భారతీయ జన్ సంఘ్ కూడా ఏకంగా 21 సీట్లు అదనంగా నెగ్గి బలాన్ని 35కు పెంచుకుంది. ప్రజా సోషలిస్ట్ పార్టీ 13 సీట్లకు పరిమితమైంది. 1964లో దాన్నుంచి చీలి జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో పుట్టుకొచి్చన సంయుక్త సోషలిస్ట్ పార్టీ 23 సీట్లు గెలిచింది. సీపీఐ ఆరు సీట్లు కోల్పోయి 23కు పరిమితమైంది. సీపీఐ నుంచి ఆవిర్భవించిన సీపీఎం 19 చోట్ల గెలిచింది. 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు లోక్‌సభతో పాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే సగం రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ దక్కింది. యూపీలో ఎన్నికలైన నెల రోజులకే చరణ్‌సింగ్ కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టిల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి నేతల బహిష్కరణలు, రాజీనామాలు ప్రాంతీయ పార్టిల ఆవిర్భావానికి దారితీశాయి. పశి్చమబెంగాల్, బిహార్, ఒడిశాల్లో కాంగ్రెస్ మాజీలు వేరుకుంపటి పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి! తమిళనాట డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టిగా నిలిచింది. మిగతా 8 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇందిర బహిష్కరణ 1969 నవంబర్ 12వ తేదీకి చరిత్రలో ప్రత్యేకత ఉంది. అదే రోజున ప్రధాని ఇందిరను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు! పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, వ్యక్తి ఆరాధనకు కేంద్రంగా మారారనే ఆరోపణలపై కాంగ్రెస్‌లోని ఇందిర వ్యతిరేక వర్గమైన “సిండికేట్’ ఈ చర్య తీసుకుంది. హిందీయేతర నాయకులతో, ముఖ్యంగా దక్షిణాది నేతలతో కూడిన ఈ వర్గంలో కీలక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిండికేట్ వర్గానికి కామరాజ్ నాయకత్వం వహించారు. ఈ చర్యతో కాంగ్రెస్ రెండు ముక్కలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని 705 మందిలో 446 మంది ఇందిర వెంట నడిచారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ (ఆర్), సిండికేట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఓ)గా పార్టీ చీలిపోయింది. లోక్‌సభలో మెజారిటీ కోల్పోయినా సీపీఎం, డీఎంకే, సీపీఐ దన్నుతో ఇందిర సర్కారు మనుగడ సాగించింది. ఎన్నెన్నో విశేషాలు... ► 1967 లోక్‌సభ ఎన్నికల్లో 61.1 శాతం ఓటింగ్ పోలైంది. మన దేశంలో అప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్ ఇదే. ► ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోని తొలి లోక్‌సభ కూడా ఇదే. 1970 డిసెంబర్లో 15 నెలల ముందే రద్దయింది. ► రెండు వరుస యుద్ధాలు, రెండేళ్లు వరుసగా వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి 20 శాతానికి పైనే తగ్గి ఆహార ధాన్యాలు అడుగంటాయి. ► దిగుమతులకు చెల్లింపుల సామర్థ్యం మరింత క్షీణించింది. ఆహారం కోసం అమెరికా రుణ సాయం తీసుకోవాల్సి వచి్చంది. ► స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా డాలర్‌తో రూపాయి విలువను ఎన్నికల ముందు 4.76 నుంచి 7.5కి తగ్గించారు. ► హరిత విప్లవం ఊపందుకోవడంతో 1971 కల్లా పంటల దిగుబడి 35 శాతం పెరిగింది. ► రాష్ట్రాల సంఖ్య 27కు పెరిగింది. దాంతో లోక్‌సభ స్థానాలు 494 నుంచి 520కి పెరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఎన్నికల షెడ్యూల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది. -
Indian general election 2024: తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో మోదీ...?
దక్షిణాదిన ఈసారి బీజేపీ ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ఆ పార్టీ ఇప్పటిదాకా బోణీ కొట్టలేకపోయింది. అధికార డీఎంకే అక్కడ కాంగ్రెస్‌తో అంటకాగడం బీజేపీకి మింగుడు పడట్లేదు. జయలలిత హయాంలో బీజేపీకి ఏఐఏడీఎంకేతో పొత్తుండేది. అయితే 2014లో అన్నాడీఎంకే 44 శాతం ఓట్లతో 37 సీట్లు నెగ్గితే మిత్రపక్షంగా బీజేపీ కేవలం 5.56 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఓట్ల శాతం 3.66 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో అక్కడ ఓట్ల శాతాన్ని పెంచుకుని, దాన్ని సీట్లలోకి కూడా మార్చు కోవడం బీజేపీకి కత్తిమీద సామే. మోదీ కరిష్మాతో ఈ పరిస్థితిని అధిగమించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మోదీని తమిళనాడు నుంచి రాష్ట్రం నుంచి బరిలో నిలపాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోయంబత్తూరు, కన్యాకుమారి, రామనాథపురంలో ఏదైనా ఒక లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేయవచ్చే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిస్తూ మోదీ తమిళనాడులో పదేపదే పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన డీఎంకే ప్రభుత్వ పనితీరు, అవినీతిపై తీవ్రంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇద్దరు డీఎంకే మంత్రులు ఇప్పటికే జైలుకు వెళ్లగా, మరింత మందికి శిక్ష తప్పదనే సంకేతాలను బీజేపీ పంపుతోంది! -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్‌సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ గురి
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలపై అధికార బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జిలు ఇందులో పాల్గొంటారు. దిశానిర్దేశం చేయనున్న నడ్డా గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి అంతకుమించి నెగ్గాలని లక్ష్యం నిర్దేశించుకుంది. 2014, 2019ల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈ లోక్‌సభ స్థానాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నలుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందాలు పర్యటించాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జేపీ నడ్డా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల భేటీలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కచ్చితంగా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నలోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో జరగబోయే త్రిపుర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, మరింత చేరువ కావాల్సిన ప్రాంతాలు, వర్గాలను గుర్తించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడానికి వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉందని మరో నాయకుడు చెప్పారు. అమరీందర్‌కు కీలక బాధ్యతలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు పంజాబ్ నేతలకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్, మాజీ ఎంపీ సునీల్ జాఖడ్,యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మహాకూటమికి పట్టం కట్టనున్న ఓటర్లు
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ పార్టీల నేతృత్వంలోని మహాకూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. లోక్ సభఎన్నికలకు ముందు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఆ సమయలో కూడా మహాకూటమికే అత్యధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెప్పాయి. ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కూడా దాదాపుగా అవే గణాంకాలు పునరావృతమయ్యాయి. దీంతో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ పార్టీల నేతృత్వంలోని మహాకూటమిలో ఆనందం వ్యక్తమవుతోండగా మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాసామ్య కూటమిలో కొంత ఆందోళన మొదలైంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చేసిన దాదాపు అన్ని సర్వేలు మహాకూటమికే అధిక స్థానాలు వస్తాయని పేర్కొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. సీ-వోటర్, ఏబీపీ-నీల్సన్, ఎన్డీటీవి, ఆజ్‌తక్/ఇండియాటుడే, సీఎన్ఎన్-ఐబీఎన్, టైమ్స్ నౌ తదితర సంస్థలు, న్యూస్ చానళ్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. దాదాపు అన్ని సర్వేలలో మహాకూటమికి కనీసం 23, అత్యధికంగా 36 స్థానాలను గెలుచుకోనున్నాయని వెల్లడైంది. మరోవైపు ప్రజాస్వామ్యకూటమికి కనీసం 10 స్థానాలు, అత్యధికంగా 22 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని సర్వేలు తెలిపాయి. ఇక ఇతరులకు ఒకటి నుంచి ఆరు స్థానాలు లభించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ద్వారా సర్వే చేసిన సంస్థలు అంచనా వేశాయి. ముంబైలో మహాకూటమి హవా..? గత లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో అయిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒక స్థానాన్ని ఎన్సీపీ.. ఇలా మొత్తం ఆరింటిని ప్రజాస్వామ్య కూటమి దక్కించుకుంది. అయితే ఈసారి సీన్మారే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దక్షిణ ముంబైలో శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్, దక్షిణ మధ్య ముంబైలో శివసేన అభ్యర్థి రాహుల్ శెవాలే, ఉత్తర ముంబైలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి, వాయవ్య ముంబైలో శివసేన గజానన్ కీర్తికర్, ఈశాన్య ముంబైలో బీజేపీ అభ్యర్థి కిరీట్ సోమయ్య విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. అయితే ఈశాన్య ముంబైలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్ విజయం సాధిస్తుందని, దీంతో ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతోనే ప్రజాస్వామ్య కూటమి సంతృప్తి పడాల్సివస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో స్పష్టమైంది. ఖాతా తెరిచేనా..? ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఖాతా తెరిచే అవకాశాలున్నాయని కొన్ని సర్వేలు తెలిపాయి. మరోవైపు ఒక్కస్థానం కూడా గెలవడం కష్టమేనని మరికొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. దీంతో గతంలో ఖాతా తెరవని ఎమ్మెన్నెస్ ఈసారి ఖాతా తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ముఖ్యంగా ఆజ్‌తక్/ఇండియాటుడే సర్వేలో ఎమ్మెన్నెస్‌కు రెండు నుంచి ఆరు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ఇక ఎన్డీటీవీ సర్వే ఎమ్మెన్నెస్, ఆప్‌లు ఒక్కొక్కటి గెలిచేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. ఏబీపీ నీల్సన్ సర్వే ఆప్‌కు అవకాశం లేదని, అయితే ఎమ్మెన్నెస్ మాత్రం ఓ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయని తెలిపింది. సీ-ఓటర్, సీఎన్ఎన్-ఐబీఎన్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రం ఎమ్మెన్నెస్, ఆప్‌లు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు లేవని తెలిపాయి. దిగ్గజాలకు పరాభవం తప్పదు..? ఈసారి రాష్ట్రంలోని అనేక మంది దిగ్గజ నాయకులు పరాభవం పాలయ్యే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘యాక్సిస్ ఏపీఎం చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో షోలాపూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, నాందేడ్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, నాసిక్‌లో ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, రాయ్‌గఢ్‌లో సునీల్ తట్కరే, భండారా-గోండియాలో ప్రఫుల్ పటేల్ తదితరుల విజయావకాశాలు ఈసారి సన్నగిల్లాయని స్పష్టమైంది.