సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ పార్టీల నేతృత్వంలోని మహాకూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. లోక్ సభఎన్నికలకు ముందు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఆ సమయలో కూడా మహాకూటమికే అత్యధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెప్పాయి. ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కూడా దాదాపుగా అవే గణాంకాలు పునరావృతమయ్యాయి. దీంతో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ పార్టీల నేతృత్వంలోని మహాకూటమిలో ఆనందం వ్యక్తమవుతోండగా మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాసామ్య కూటమిలో కొంత ఆందోళన మొదలైంది.
ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చేసిన దాదాపు అన్ని సర్వేలు మహాకూటమికే అధిక స్థానాలు వస్తాయని పేర్కొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. సీ-వోటర్, ఏబీపీ-నీల్సన్, ఎన్‌డీటీవి, ఆజ్‌తక్/ఇండియాటుడే, సీఎన్‌ఎన్-ఐబీఎన్, టైమ్స్ నౌ తదితర సంస్థలు, న్యూస్ చానళ్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. దాదాపు అన్ని సర్వేలలో మహాకూటమికి కనీసం 23, అత్యధికంగా 36 స్థానాలను గెలుచుకోనున్నాయని వెల్లడైంది. మరోవైపు ప్రజాస్వామ్యకూటమికి కనీసం 10 స్థానాలు, అత్యధికంగా 22 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని సర్వేలు తెలిపాయి. ఇక ఇతరులకు ఒకటి నుంచి ఆరు స్థానాలు లభించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ద్వారా సర్వే చేసిన సంస్థలు అంచనా వేశాయి.
ముంబైలో మహాకూటమి హవా..?
గత లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో అయిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒక స్థానాన్ని ఎన్సీపీ.. ఇలా మొత్తం ఆరింటిని ప్రజాస్వామ్య కూటమి దక్కించుకుంది. అయితే ఈసారి సీన్‌మారే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దక్షిణ ముంబైలో శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్, దక్షిణ మధ్య ముంబైలో శివసేన అభ్యర్థి రాహుల్ శెవాలే, ఉత్తర ముంబైలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి, వాయవ్య ముంబైలో శివసేన గజానన్ కీర్తికర్, ఈశాన్య ముంబైలో బీజేపీ అభ్యర్థి కిరీట్ సోమయ్య విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. అయితే ఈశాన్య ముంబైలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్ విజయం సాధిస్తుందని, దీంతో ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతోనే ప్రజాస్వామ్య కూటమి సంతృప్తి పడాల్సివస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో స్పష్టమైంది.
ఖాతా తెరిచేనా..?
ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఖాతా తెరిచే అవకాశాలున్నాయని కొన్ని సర్వేలు తెలిపాయి. మరోవైపు ఒక్కస్థానం కూడా గెలవడం కష్టమేనని మరికొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. దీంతో గతంలో ఖాతా తెరవని ఎమ్మెన్నెస్ ఈసారి ఖాతా తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ముఖ్యంగా ఆజ్‌తక్/ఇండియాటుడే సర్వేలో ఎమ్మెన్నెస్‌కు రెండు నుంచి ఆరు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ఇక ఎన్‌డీటీవీ సర్వే ఎమ్మెన్నెస్, ఆప్‌లు ఒక్కొక్కటి గెలిచేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. ఏబీపీ నీల్సన్ సర్వే ఆప్‌కు అవకాశం లేదని, అయితే ఎమ్మెన్నెస్ మాత్రం ఓ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయని తెలిపింది. సీ-ఓటర్, సీఎన్‌ఎన్-ఐబీఎన్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రం ఎమ్మెన్నెస్, ఆప్‌లు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు లేవని తెలిపాయి.
దిగ్గజాలకు పరాభవం తప్పదు..?
ఈసారి రాష్ట్రంలోని అనేక మంది దిగ్గజ నాయకులు పరాభవం పాలయ్యే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘యాక్సిస్ ఏపీఎం చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో షోలాపూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, నాందేడ్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, నాసిక్‌లో ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, రాయ్‌గఢ్‌లో సునీల్ తట్కరే, భండారా-గోండియాలో ప్రఫుల్ పటేల్ తదితరుల విజయావకాశాలు ఈసారి సన్నగిల్లాయని స్పష్టమైంది.
మహాకూటమికి పట్టం కట్టనున్న ఓటర్లు
Published Tue, May 13 2014 10:24 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement