చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా హైబ్రిడ్‌మోడ్‌లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్‌ఎస్, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఎల్‌ఎస్‌పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు.
దేశవ్యాప్త కులగణన: తేజస్వి
వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్‌బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు.
విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్
‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు
Comments
Please login to add a commentAdd a comment