Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..! | Indian general election 2024: Bjp Focus On South States | Sakshi
Sakshi News home page

Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!

Published Tue, Dec 26 2023 1:08 AM | Last Updated on Tue, Dec 26 2023 1:08 AM

Indian general election 2024: Bjp Focus On South States - Sakshi

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది...

ఆరునూరైనా 60 దాటాల్సిందే...!
కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది.

కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.

బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్‌)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది.

అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్‌ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు.

కేరళలో...
కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది.  జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.

ఉత్తరాది నేతలకు బాధ్యతలు
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్‌ పాండా, దిలీప్‌ ఘోష్, లాల్‌సింగ్‌ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, సునీల్‌ బన్సల్, స్వతంత్ర దేవ్‌ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్‌ మోదీ, విజయ్‌ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది.

– సాక్షి, న్యూఢిల్లీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement