![Indian general election 2024: PM Narendra Modi contest 2024 Lok Sabha elections from Tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/26/tn-modi7.jpg.webp?itok=x3OFwLf0)
దక్షిణాదిన ఈసారి బీజేపీ ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ఆ పార్టీ ఇప్పటిదాకా బోణీ కొట్టలేకపోయింది. అధికార డీఎంకే అక్కడ కాంగ్రెస్‌తో అంటకాగడం బీజేపీకి మింగుడు పడట్లేదు. జయలలిత హయాంలో బీజేపీకి ఏఐఏడీఎంకేతో పొత్తుండేది. అయితే 2014లో అన్నాడీఎంకే 44 శాతం ఓట్లతో 37 సీట్లు నెగ్గితే మిత్రపక్షంగా బీజేపీ కేవలం 5.56 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఓట్ల శాతం 3.66 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో అక్కడ ఓట్ల శాతాన్ని పెంచుకుని, దాన్ని సీట్లలోకి కూడా మార్చు కోవడం బీజేపీకి కత్తిమీద సామే. మోదీ కరిష్మాతో ఈ పరిస్థితిని అధిగమించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మోదీని తమిళనాడు నుంచి రాష్ట్రం నుంచి బరిలో నిలపాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోయంబత్తూరు, కన్యాకుమారి, రామనాథపురంలో ఏదైనా ఒక లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేయవచ్చే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిస్తూ మోదీ తమిళనాడులో పదేపదే పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన డీఎంకే ప్రభుత్వ పనితీరు, అవినీతిపై తీవ్రంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇద్దరు డీఎంకే మంత్రులు ఇప్పటికే జైలుకు వెళ్లగా, మరింత మందికి శిక్ష తప్పదనే సంకేతాలను బీజేపీ పంపుతోంది!
Comments
Please login to add a commentAdd a comment