ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టిందా? | Asian countries Worry About Sudden Heavy Rain Fall | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టిందా?

Published Tue, Sep 6 2022 4:11 PM | Last Updated on Tue, Sep 6 2022 5:30 PM

Asian countries Worry About Sudden Heavy Rain Fall - Sakshi

ఆసియా దేశాలు అల్లాడి పోతున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుకుపడుతున్నాయి. భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాలు ఆ వరదల్లో కకావికలమవుతున్నాయి.ఇంకో వైపు విపరీతమైన వేడిగాలులు జీవనదులను ఆవిరి చేసి నీళ్లను మాయం చేసి భూమి అంతటా బీటలు తీసి కరవుకు కేరాఫ్ అడ్రస్గా ఆసియా వెలవెల బోతోంది. ఆ వానలూ మంచివి కావు. ఈ కాటకాలూ మంచివికావు. మనిషి మంచిగా లేకపోవడం వల్లనే ఈ విపత్తులు దాడులు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని శపిస్తున్నాయి.

హఠాత్తుగా కుంభవృష్టి పడుతోంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. బెంగళూరు, చెన్నై, ముంబైతో సహా చాలా ప్రాంతాలు ఒక్క రోజులోనే నీట మునుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం దిక్కుతోచని పరిస్థితి తెస్తోంది. మన దేశంలో  ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కుంభవృష్ఠి వర్షాలతో  ఉధృతమైన వరదలతో కకావికలమైపోతున్నాయి. లక్షలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులవుతున్నారు. ఈ వానలు ఎన్నడూ చూడలేదురోయ్ దేవుడా అని జనం మబ్బులవైపు చూసి ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

అసోంలో బ్రహ్మపుత్ర నది విజృంభణతో వేలాది మంది వరదల్లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మేఘాలు ఒక్కసారిగా విరిగిపోయినట్లు నీటి సంచులు పేలిపోయినట్లు ఒక్క ఉదుటన కుంభవృష్ఠి వానలు పడిపోతున్నాయి. నిముషాల్లోనే అవి జల ప్రళయంలోకి జనాన్ని నెట్టేస్తున్నాయి.

ఈ మాయదారి వానలే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నూ వణికించేస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ ప్రాంతంలో  122 సంవత్సరాల్లో ఎన్నడే లేనంతగా భారీ వర్షాలు  పడ్డంతో కొన్ని తరాల జనం చూడనంతటి వరదలు ముంచెత్తాయి. చుట్టూరా వరద నీరే. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. ఒక్క బంగ్లాదేశ్ లోనే 40 లక్షల మంది వరదల తాకిడికి  అల్లాడిపోయారు. అందులో 16లక్షల మంది చిన్నారులు ఉండడం గమనార్హం. బంగ్లాదేశ్ దేశంలో 75 శాతం భూభాగం సముద్ర మట్టంతో ఇంచుమించు సమానంగా ఉంటుంది. మరో రెండు దశాబ్ధాల్లో మూడొంతులకు పైగా బంగ్లాదేశ్ సముద్రగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మన దాయాది దేశం పాకిస్థాన్ లో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది.పాకిస్థాన్ లో 2010లీ వచ్చిన వరదలే బీభత్సమైనవని అనుకుంటే ఈ సారి  అంతకు మించి వర్షాలు కుమ్మేశాయి. ఎనిమిది వారాల పాటు అంటే 50 రోజుల పాటు ఏకధాటిగా కుంభవృష్ఠి వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రతీ చోటా వరదలు ముంచెత్తాయి. దేశంలో 150 జిల్లాలుంటే ఏకంగా 110 జిల్లాలను వరదలు ముంచేశాయి. మూడు కోట్ల 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయిదు లక్షల వరకు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

చాలా జిల్లాల్లో మనుషులు ఉండడానికి అనువైన ఇల్లు ఒక్కటంటే ఒక్కటికూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి సర్వనాశనం అయిపోయింది. వరదల తెచ్చిన సంక్షోభంతో  ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగిపోయింది.

ఆహార కొరత.. దయనీయంగా పరిస్థితి
కోట్లాది మందిని ఆహార కొరత  వేధిస్తోంది. పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో భారత దేశం నుండి కూరగాయలు,ఇతర ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ ఆలోచిస్తోంది. ఇటు భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ అడగడమే ఆలస్యంగా భారీ ఎత్తున సాయం అందించడానికి సర్వ సన్నద్ధంతో ఉంది. వరదల పాపమా అని 15 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ప్రాధమిక అంచనా. 

ఆసియాలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన చైనా కూడా భారీ వర్షాలు, వరదల తాకిడికి కుదేలైపోయింది. వాయువ్య చైనాలో భీకర వర్షాలు  దండెత్తాయి. వర్షాలు, వరదల తీవ్రతతో పెద్ద సంఖ్యలో  పరిశ్రమలు మూత పడ్డాయి. వీటిలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మూత పడ్డంతో తీవ్రమైన విద్యుత్ కొరత కూడా చైనాను వేధిస్తోంది.

క్వింఘాయ్ ప్రావిన్స్ లో వర్షాలు విశ్వరూపమే ప్రదర్శించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు వరదల తీవ్రతకు పెద్ద ఎత్తున రోడ్లు కల్వర్టులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కొట్టుకుపోయాయి. నైరుతి చైనా ప్రాంతంలో  లక్షలాది మందికి విద్యుత్ సరఫరా లేదు. దాంతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది.

2021లో వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతటి వానలతో చైనా వణికిపోయింది. ఆ వర్షాల ప్రభావంతో గత ఏడాది వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. దాన్నుంచి కోలుకోక ముందే ఇపుడీ వర్షాలు విరుచుకు పడ్డంతో ఈ ఏడాది కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. ఇది చైనా ఆర్దిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశాలున్నాయి. చైనా నుండి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే దేశాలపైనా ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.

ఒక పక్క అతివృష్ణి మరో పక్క అనావృష్ఠి.
చూస్తూ ఉండగానే మేఘాలు బద్దలై కుంభవృష్టి వానలు. ఆ వెంటనే అందరినీ ముంచెత్తే వరదలు. మరో పక్క భరించలేని వేడి గాలులు. తట్టుకోలేని కరకు కరవు కాటకాలు. దేన్నీ భరించే పరిస్థితి లేదు. దేన్నీ సహించే ఓపిక లేదు. బతుకులు రోజు రోజుకీ దుర్భరం అయిపోతున్నాయి. ఈ విపరీత ధోరణులకు కారణం వాతావరణంలోని అనూహ్య మార్పులే అంటున్నారు వాతావరణ  శాస్త్ర వేత్తలు. ఏళ్ల తరబడి మనుషులు వహిస్తోన్న నిర్లక్ష్యమే  ఇపుడు శాపంగా మారిందంటున్నారు వారు. 

అడ్డగోలుగా అడవులు నరికివేయడం.. అడ్డూ అదుపూ లేకుండా పరిశ్రమలు పెట్టి  కాలుష్యాన్ని  వెదజల్లేయడం..  పరిమితులకు మించి కర్బన ఉద్గారాలు  ఉత్పత్తి చేయడం  పచ్చటి ప్రకృతికి నిర్దాక్షిణ్యంగా పొగ  బెట్టేయడం వంటి పాపాలు ఏళ్ల తరబడి చేసుకుపోవడం వల్లనే ప్రకృతి గాయపడిందంటున్నారు పర్యావరణ వేత్తలు. ఆ గాయాలతోనే మనిషిపై ప్రకృతి పగబట్టి ఉంటుందని వారు అంటున్నారు. ప్రకృతికి కోపం వస్తే దాన్ని  అడ్డుకోవడానికి కానీ తట్టుకోవడానికి కానీ మనిషికి ఉన్న శక్తి సరిపోదని వారు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే యూరప్ దేశాలు భగ భగ మండిపోతున్నాయని చదువుకున్నాం. బ్రిటన్, ఫ్రాన్స్,ఇటలీ,జర్మనీ,పోర్చుగల్,సెర్బియా వంటి దేశాల్లో జీవనదులు  ఎండిపోతున్న విషాద ఘటనల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ సమస్య యూరప్ దేశాలకే కాదు ఆసియా దేశాల్లోనూ తిష్ఠ వేసుకుని కూర్చుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధం అవుతోందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచ మంతా విస్తరించడం ఖాయం అంటున్నారు వారు.

ఇంత జరుగుతోన్నా  దేశాలు కానీ వాటి పాలకులు కానీ అక్కడి ప్రజలు కానీ  గాఢ నిద్ర నుండి మేల్కొనకపోవడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతోందని వారంటున్నారు. ఇది మును ముందు మరింత భయానక పరిణామాలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒక వైపు వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతోన్న చైనాను మరో వైపు  వేడి గాలులు వెంబడించి దెబ్బతీస్తున్నాయంటున్నారు పర్యావరణ వేత్త భాస్కర రెడ్డి. దాని ప్రభావం చైనాపై చాలా తీవ్రంగానే ఉంది. వర్షాభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం..దాని వల్ల కర్మాగారాలు మూతపడ్డం దాని ఫలితంగా ఉత్పత్తులు పడిపోవడం.. అల్టిమేట్ గా ఆర్ధిక వ్యవస్థ చావు దెబ్బతినడం వంటి చెయిన్ రియాక్షన్స్ చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విపత్తులు ..ఇవి తెచ్చే సమస్యలు రాత్రికి రాత్రే రాలేదు. కొన్ని ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలంతా కూడా మనుషులు చేస్తోన్న తప్పిదాల వల్ల పర్యావరణానికి ఎలా తూట్లు పడుతున్నాయో..వాటి కారణంగా రానున్న కాలంలో ఎంతటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రకృతి మానవాళిపై పగబట్టిందంటే దానర్ధం ఏంటి? ప్రకృతిని మనిషి ఇష్టారాజ్యంగా అణచివేస్తున్నాడనే అంటున్నారు మేథావులు.
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకపోతే కొందరి తప్పిదాల వల్ల యావత్ ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement