ఆసియా దేశాల్లో శాంతి, అభివృద్ధికి భారత్-చైనాల సహకారం
తిరుపతి తుడా: ఆసియా దేశాల్లో శాంతి స్థాపన, అభివృద్ధికి భారత్, చైనా దేశాలు సహకారం కీలకమైందని, చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ.రంగనాథన్ అన్నారు. భారత్ చైనా సంబంధాలు దృఢమైనవని ఆయన తెలిపారు. ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌హాల్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీవీ రంగనాథన్ మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య చిన్నపాటి సమ్యలు తలెత్తాయని చెప్పారు.
వాటిని అధిగమించి పరస్పరం అభివృద్ధికి సహకరించాల్సిచాల్సిన సమయం ఎంతైనా ఉందన్నారు. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉందన్నారు. భారత్‌కు చైనా సహకారం, చైనాకు భారత్ సహకారం అవరసమన్నారు. ఎస్వీయూ వీసీ ఆచార్య రాజేంద్ర మాట్లాడుతూ ఇరు దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అవగాహనతో కూడిన సహకారం అవసరమన్నారు. భారత్ చైనాల మధ్య బలమైన సత్‌సంబంధాలు మెరుగుపడి ప్రపంచ శాంతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇరుదేశాల ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం పరిశోధన సంస్థలు, రాయబార కేంద్రాలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ. రంగనాథన్‌ను సదస్సులో ఘనంగా సన్మానించారు.