రాష్ట్రపతిభవన్‌లో భేటీ సందర్భంగా మోదీ, ఆసియాన్ దేశాధినేతల అభివాదం
న్యూఢిల్లీ: చైనాకు భారత్–ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి.
అలాగే భారత ప్రధాని మోదీ ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై చర్చలు జరిపారు. 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా–ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను గురువారం విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి దక్షిణ చైనా సముద్ర ఒప్పందాన్ని అమలుచేయాలని తీర్మానించారు. ఉగ్రవాదుల స్థావరాలు, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాన్ని అనుసరించి సామర్థ్యాలను పెంచుకోవాలని నిర్ణయించారు.
ఉగ్ర కట్టడికి సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడంతో పాటు ఇంటర్నెట్, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని అంగీకరించారు. భారత్–ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ..ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. నేడు జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment