చైనాకు నరేంద్రమోడీ హెచ్చరిక?
దౌత్య నీతి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పొరుగునున్న ప్రత్యర్థి దేశాలకు తన పనితీరుతో హెచ్చరికలు చేస్తున్నారు. పదే పదే భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ.. చిరాకు పెడుతున్న చైనాకు చెక్ పెట్టడానికి ఆయన సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. జపాన్ పర్యటనను ఆయన ఒకరోజు పొడిగించుకున్నారు. భారతదేశానికి జపాన్ అత్యంత సన్నిహిత దేశమని, చైనా కంటే అదే తమకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఆయన ఈనెల 31వ తేదీన బయల్దేరి టోక్యో వెళ్తారని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించగా, 30వ తేదీనే బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. ఇది చైనాకు ఒకరకంగా దుర్వార్తే అవుతుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఆయన తిరిగి వస్తారు. ఇంతవరకు జపాన్లో ఇంతలా ఐదు రోజులు పర్యటించిన భారత ప్రధాని ఎవరూ లేరు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మోడీకి జపాన్లో అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. వాళ్లందరికీ ఇది కొంత శుభవార్తే అవుతుంది. అయితే.. చైనాకు మాత్రం కొంత దుర్వార్త అవ్వక తప్పదు. ప్రత్యర్థి శిబిరానికి చెందిన జపాన్ పర్యటన విషయంలో భారత ప్రధాని అంత ఎక్కువ ఆసక్తి చూపించడం సహజంగానే చైనాకు చేదుమాత్రలా అనిపిస్తుంది. తమను కాదని జపాన్కు నరేంద్రమోడీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చైనా ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలోనన్న దౌత్య నీతి విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఉన్నతాధికారులు కూడా మెచ్చుకుంటున్నారు.