ఇద్దరు మిత్రులు.. రెండు దేశాలు!!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. జపాన్ ప్రధాని షింజో అబెకు మధ్య చాలా పోలికలున్నాయి. షింజో అబె ట్విట్టర్లో కేవలం ముగ్గురినే ఫాలో అవుతారు. వాళ్లలో ఒకరు ఆయన భార్య, మరొకరు జపాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఆ మూడో వ్యక్తి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ!! ఇద్దరూ కూడా రైట్ వింగ్ జాతీయవాదులే. ఇద్దరూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవాళ్లే. ప్రాంతీయంగా చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలి అనుకుంటూనే చైనాతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నవాళ్లే. ఇద్దరూ కూడా తమ తమ దేశాల్లో చాలా బలమైన నాయకులుగా పేరుపొందారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి రీరెగ్యులేషన్ మంత్రాన్ని ఇద్దరూ జపిస్తున్నారు.
ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మోడీ జపాన్ చేరుకున్న తర్వాత ఇద్దరు ముందు ఆ దేశ రాజధాని నగరమైన టోక్యోలో అధికారికంగా కాకుండా.. ముందు వ్యక్తిగతంగా ట్యోకో నగరంలో కలుస్తున్నారు. అక్కడ ఒక విందులో పాల్గొన్న తర్వాతే అధికారిక చర్చలు ప్రారంభం అవుతాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ రెండుసార్లు జపాన్ వెళ్లారు. ఆ రెండు సార్లూ ఆయన షింజో అబెను కలిశారు. ఇప్పుడు జపాన్ వెళ్లడానికి ముందు జపనీస్ భాషలో ట్వీట్ చేశారు.