జపాన్ పర్యటనకు బయల్దేరిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరారు. భారత ఉపఖండం వెలుపల ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే మొదటిది. ముందుగా ఆయన క్యోటో విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని మోడీ గౌరవార్థం అబె ఒక విందు కూడా శనివారమే ఏర్పాటుచేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ తదితరులు కూడా ఉన్నారు.
ప్రధానంగా స్మార్ట్ సిటీ అయిన క్యోటోను మోడీ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటుచేస్తామని ఇంతకుముందే ఆయన హామీ ఇవ్వడంతో ఆ తరహా నిర్మాణాల కోసం అక్కడ పరిశీలిస్తారు. అలాగే జపాన్ బుల్లెట్ రైళ్లను కూడా మోడీ చూస్తారు. దేశంలో ప్రవేశపెట్టబోయే బుల్లెట్ రైళ్లను తమవద్దనుంచే కొనుగోలు చేయాలని జపాన్ భారతదేశాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మూడో విదేశీ పర్యటన. బ్రిక్స్ సదస్సుకు వెళ్లడం, నేపాల్లో పర్యటించడం తర్వాత ఆయన జపాన్ వైపు మొగ్గుచూపారు.