(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది.
ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం.
పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది
ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి.
► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది.
► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా.
► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం.
సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్
సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది.
ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు.
► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా.
► ఇక ఉక్రెయిన్‌లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ.
మన దేశానికి ప్రయోజనాలెన్నో..
మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం..
► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది.
► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా.
► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది.
► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు.
► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment