జపాన్‌లో అంతకంతకూ పెరుగున్న వృద్ధుల సంఖ్యకు తోడు తగ్గుతున్న జనాభా ఆ దేశానికి అనేక సవాళ్లను విసురుతోంది. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ డేటాలోని వివరాల ప్రకారం జపాన్‌లోని ప్రతి ప్రావిన్స్‌లో మొదటిసారిగా రికార్డు స్థాయిలో జనాభా సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు పెరిగింది. గత 14 ఏళ్లుగా జపాన్‌లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ పౌరుల మొత్తం జనాభా 122.4 మిలియన్లు. ఇది 2021 నాటి జనసంఖ్య కంటే ఎనిమిది లక్షలు తక్కువ. 1968 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత.
జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరుల పాత్ర
జపాన్‌లోని మొత్తం 47 ప్రిఫెక్చర్(ప్రాంతం)లలో పౌరుల సంఖ్య తగ్గింది. సాధారణంగా అధిక జనన రేటు కలిగిన ఒకినావా ప్రిఫెక్చర్‌లో కూడా జనాభా సంఖ్య క్షీణించింది. అయితే క్షీణిస్తున్న జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెన్సీ కార్డులు కలిగిన విదేశీయుల సంఖ్య 10 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య మూడేళ్లలో మొదటిసారిగా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్‌లో నివసిస్తున్న వారి సంఖ్య 2013 తర్వాత అత్యధికంగా ఉందని తేలింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జననాల రేటును ఎదుర్కొంటున్నాయి. అయితే జపాన్‌లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది.
విదేశీ జనాభాకు నిలయంగా టోక్యో
జపాన్‌లోని ప్రతీ ప్రావిన్స్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరిగింది. రాజధాని టోక్యో విదేశీ పౌరుల జనాభాకు నిలయంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. అదేసమయంలో టోక్యోలో జపాన్ పౌరుల జనాభా తగ్గింది. అయితే విదేశీయుల చేరిక కారణంగా ఈ ప్రావిన్స్ మొత్తం జనాభా పెరిగింది. అకిటా ప్రిఫెక్చర్ జనాభా అత్యధికంగా 1.65 శాతం మేరకు తగ్గింది. జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం 2067 నాటికి జపాన్ జనాభాలో 10.2 శాతం విదేశీయులు ఉంటారని అంచనా. విదేశీ నివాసితుల సంఖ్య పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది.
నిబంధనలను సడలించడంతో..
జపాన్‌లో కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియమాలు అమలులో ఉన్నాయి. అయితే కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వాటిని క్రమంగా సడలిస్తోంది. ఇది విదేశీయుల రాకకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లల సంఖ్య 11.82 శాతంగా ఉంది. ఇది 0.18 శాతం తగ్గింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.15 శాతం పెరిగి 29.15 శాతానికి చేరుకుంది. 92.4 శాతం ప్రిఫెక్చర్‌లలో జపాన్ జనాభా క్షీణించింది. ఈ సంవత్సరం జూన్‌లో దేశంలో పడిపోతున్న జనన రేటును అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం $25 బిలియన్ల ప్రణాళికను ప్రారంభించింది. జపాన్‌లో జాతీయ విధానాలు జనాభా క్షీణతను ఆపడంలో విఫలమయ్యాయి. ఈ ధోరణి యువత,మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నది.
ఇది కూడా చదవండి: మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది
Published Sun, Jul 30 2023 7:58 AM | Last Updated on Sun, Jul 30 2023 11:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment