Country Population
-
జనశక్తి... శ్రమయుక్తి...
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే! ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది. అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది. ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది. అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే! -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్‌లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్‌టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్‌లో గుండెపోటు, స్ట్రోక్‌లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్‌సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్‌లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
99 శాతం మందికి కలుషిత గాలే గతి
న్యూఢిల్లీ: దేశ జనాభాలో అక్షరాలా 99 శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు. పీఎం 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే దిక్కవుతోంది. గ్రీన్‌పీస్ ఇండియా సంస్థ ‘డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై’ పేరిట శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► భారత్‌లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్ఓ వార్షిక సగటు గైడ్లైన్ కంటే ఐదు రెట్లు అధిక పీఎం 2.5 కణాలు కలిగి ఉంటున్నదే. ► దేశంలో 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ► ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం–ఢిల్లీ. ► కలుషిత గాలి వల్ల వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితమవుతున్నారు. ► గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి. ► గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలి. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుంటుంది. ► ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల్లో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ► నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ)ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి. -
పెరుగుతున్న పట్టణ జనాభా
సాక్షి, అమరావతి: దేశంలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోంది. రానున్న కాలంలో ఇది రికార్డు స్థాయిలో ఉండనుందని, 2021–36 మధ్య కాలంలో మరింతగా పెరగనుందని ‘నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని చెప్పింది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత దేశం చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుంది. నివేదికలోని మరిన్ని ప్రధాన అంశాలను పరిశీలిస్తే... పల్లెల్లో తగ్గుతున్న జనాభా ► 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది. ► 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది. ► ఇక 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది. ► ఢిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది. ఉత్తరాదిలోనే పెరుగుదల.. దక్షిణాదిలో నియంత్రణ ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల అధికంగా ఉండనుంది. ► ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది. ఇక 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. 2036 నాటికి 152 కోట్ల జనాభా ► దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది. ► 2011–21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుందని కమిషన్ పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు. కాగా, 2021–31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది. -
కొత్తతరంలో 6 కోట్ల మంది బడికి వెళ్లనేలేదు!
న్యూఢిల్లీ: 2011నాటి దేశ జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 5 నుంచి 19 ఏళ్ల వయసున్న వారిలో 6.54 కోట్ల మంది అసలు పాఠశాలకే వెళ్లలేదు. గత దశాబ్దంలో మరో 4.49 కోట్ల పిల్లలు బడిని మధ్యలోనే మానేశారు. దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 38.01 కోట్ల మంది ఉంటే వారిలో 26.98 కోట్ల మంది విద్యాలయాలకు వెళ్తున్నారు. ఇదే వయసు వారిలో 65.7 లక్షల మందికి వికలాంగులు. వారిలో 17.5 లక్షల మంది ఎప్పుడూ బడికి వెళ్లలేదు. 8 లక్షల మంది పాఠశాలను మధ్యలోనే మానేయగా, 40.2 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 22.8 లక్షల మంది బాలురు. 17.4 లక్షల మంది బాలికలు.