
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే!
ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.
అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది.
ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది.
అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.
పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది.
ఇటీవల గుజరాత్‌లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది.
ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది.
ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది.
అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే!
Comments
Please login to add a commentAdd a comment