'వచ్చే ఏడాది మా దేశ పర్యటనకు రండి'
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్తో పాటు ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆహ్వానించారు. బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో సుష్మా ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో పాక్, అప్ఘాన్లతో చేతులు కలిపేందుకు భారత్ సుముఖంగా ఉందని చెప్పారు. అట్టారి సరిహద్దు వద్ద అఫ్ఘాన్ ట్రక్కులకు స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తాము స్నేహ హస్తం అందించామని సుష్మా గుర్తు చేశారు. ఇస్లామాబాద్‌లో హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సులో పాల్గొన్న ఆమె ప్రాంతీయ సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాక్, అప్ఘాన్ ప్రధానులు నవాజ్ షరీఫ్, అష్రాఫ్ ఘనితో పాటు ఆసియా విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు.
అంతకుముందు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ఈ సదస్సుకు వచ్చిన సుష్మా మర్యాదపూర్వకంగా షరీఫ్‌ను కలిశారు. వివిధ అంశాలపై కాసేపు ముచ్చటించారు.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి జరిగే చర్చల్లో భారత్, పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్పై ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.