ఉగ్రవాదులను కీర్తించేవాళ్లతో చర్చలా? | Sushma Swaraj May Speak On Pakistan Terrorism | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులను కీర్తించేవాళ్లతో చర్చలా?

Published Sun, Sep 30 2018 5:06 AM | Last Updated on Sun, Sep 30 2018 8:34 AM

Sushma Swaraj May Speak On Pakistan Terrorism - Sakshi

ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్తాన్‌ తీరును భారత్‌ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదులను కీర్తిస్తూ, ముంబై దాడుల సూత్రధారి స్వేచ్ఛగా సంచరించేందుకు అనుమతిస్తున్న దేశంతో చర్చలు ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించింది. ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానంగా కొనసాగిస్తున్న పాకిస్తాన్‌ వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదని అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లం చేసింది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో శనివారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రసంగిస్తూ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు.

ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత జవాన్లను చంపడం, ఫలితంగా భారత్‌–పాక్‌ విదేశాంగ మంత్రుల భేటీ రద్దయిన నేపథ్యంలో ఊహించినట్లుగానే సుష్మ పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా లేవనెత్తారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌ ఎంతో ప్రయత్నించినా, ఆ దేశం ప్రవర్తన వల్లే ఈ విషయంలో ముందడుగు పడలేదని స్పష్టంచేశారు. ఇంకా సుష్మ తన ప్రసంగంలో...ప్రపంచానికి పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన తదితరాలను ప్రస్తావించారు.

చర్చలన్నారు.. అంతలోనే రక్తపాతం సృష్టించారు:
‘చర్చల ప్రక్రియకు భారత్‌ అడ్డంకులు సృష్టిస్తోందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. అత్యంత సంక్లిష్ట సమస్యలను చర్చలు మాత్రమే పరిష్కరిస్తాయని విశ్వసిస్తున్నాం. పాకిస్తాన్‌తో చర్చలు చాలాసార్లు మొదలయ్యాయి. అవి అర్ధంతరంగా నిలిచిపోయాయంటే దానికి వాళ్ల ప్రవర్తనే ఏకైక కారణం’ అని సుష్మ ఆరోపించారు. పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌ భారత ప్రధాని మోదీకి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘చర్చల కోసం పాకిస్తాన్‌ ప్రధాని చేసిన ప్రతిపాదనను భారత్‌ అంగీకరించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో ఉగ్రవాదులు ముగ్గురు భారత జవాన్లను చంపిన వార్త వెలువడింది. పాకిస్తాన్‌కు చర్చల పట్ల ఉన్న ఆసక్తి ఏంటో దీంతో తెలిసిపోతోంది’ అని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ పదవిలోకి వచ్చిన తొలిరోజు నుంచే పాకిస్తాన్‌తో చర్చల కోసం ప్రయత్నించారని, కానీ పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌ దాడికి పాల్పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని గుర్తు చేశారు. ‘ఉగ్రవాదుల రక్తపాతం నడుమ చర్చలు ఎలా కొనసాగుతాయి చెప్పండి?’ అని ప్రశ్నించారు. 9/11 దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టినా, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఇంకా పాకిస్తాన్‌ వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు మోపడం పాకిస్తాన్‌కు బాగా అలవాటైందని ఆరోపించారు. అందుకే కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని తరచూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను వేగంగా, మరి కొన్నింటిని నెమ్మదిగా తరుముతోందని, కానీ ప్రతిచోటా ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు.

సంస్కరణలు తప్పనిసరి
ప్రాథమిక సంస్కరణలు లోపించినట్లయితే ఐక్యరాజ్య సమితి బలహీననపడుతుందని, ఫలితంగా ప్రపంచంలో బహుళత్వం అనే భావన అర్థరహితమవుతుందని సుష్మా స్వరాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణలు బలవంతంగా ఉండొద్దని, సమకాలీన అవసరాలకు అనుగుణంగా సమూల ప్రక్షాళన జరగాలని పిలుపునిచ్చారు. పర్యావరణ మార్పుల వల్ల అధికంగా నష్టపోతున్నది పేద, వర్ధమాన దేశాలే అని, ధనిక దేశాలు వాటిని సాంకేతిక, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని కోరారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ 17 లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement